Begin typing your search above and press return to search.

కేసీఆర్ లో కిరణ్ కుమార్ రెడ్డి అహంకారం?

By:  Tupaki Desk   |   13 Oct 2019 5:24 AM GMT
కేసీఆర్ లో కిరణ్ కుమార్ రెడ్డి అహంకారం?
X
ఉద్యమాలు జోరుగా సాగే వేళ.. పాలకుల నోటి నుంచి వచ్చే ప్రతి మాటా ఆచితూచి అన్నట్లు ఉండాలి. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పినా.. అందుకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అందునా సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి నోటి నుంచి వచ్చే మాటకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఏ పరిస్థితుల్లో.. ఏ కారణంతో ముఖ్యమంత్రి మాట్లాడారు అన్న దాని కంటే.. ఏం మాట్లాడారు? సదరు మాటలు ఎలాంటి సంకేతాల్ని ఇస్తున్నాయి? అన్న ప్రశ్నే ఎక్కువగా ఉంటుంది.

ఇందుకు చక్కటి ఉదాహరణగా తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్నవేళ.. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడే క్రమంలో నాడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాజెక్టుకు రూపాయి కూడా ఇవ్వనని వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆయనే సందర్భంలో అలా మాట్లాడాల్సి వచ్చిందన్న విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు.

తెలంగాణ ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వనంటాడా? అన్నదే పాయింట్ గా మారింది. ఆ మాటకు వస్తే.. కిరణ్ కుమార్ రెడ్డి మాటను అదే పనిగా ప్రస్తావిస్తూ.. ఎంత అహంకారం? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన వారిలో గులాబీ బాస్ కేసీఆర్ ముందుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్ల తర్వాత కూడా సీమాంధ్ర పాలకుల అహంకారానికి నిదర్శనంగా కిరణ్ కుమార్ రెడ్డి మాటను కేసీఆర్ అప్పుడప్పుడు ప్రస్తావిస్తుంటారు.

ఇదంతా ఎందుకంటే.. పాలకుల నోటి నుంచి వచ్చే మాటలు ఎంత ప్రభావం చూపిస్తాయనటానికి ఈ ఉదంతాన్ని ఒక నిదర్శనంగా చెప్పాలి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెను ఉద్దేశించి తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటలు అహంకారపూరితంగా.. ఉద్యమాన్ని కించపరిచేలా.. త్యాగాల్ని లైట్ తీసుకునేలా ఆయన మాటలు ఉన్నాయని చెప్పాలి.

ఒకప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి నోటి నుంచి వచ్చిన మాటకు అహంకారం ట్యాగ్ వేసి రాజకయ ప్రయోజనం పొందిన కేసీఆర్.. ఇప్పుడు తన నోటి నుంచి అదే తరహాలో వచ్చే మాటలతో తనకు డ్యామేజ్ అవుతుందన్న విషయాన్ని మర్చిపోతుండటం గమనార్హం. తాను ఎక్కి వచ్చిన మెట్లను తానే మర్చిపోవటం.. మరికొందరు అదే తీరులో ఎక్కి వచ్చేలా అవకాశం ఇవ్వటాన్ని ఏమనాలి కేసీఆర్?