Begin typing your search above and press return to search.

జీతాల కోసం కిందా మీదా ప‌డ్డార‌ట‌!

By:  Tupaki Desk   |   10 Jan 2019 4:55 AM GMT
జీతాల కోసం కిందా మీదా ప‌డ్డార‌ట‌!
X
నిద్ర లేచింది మొద‌లు నిజాలు చెప్పేందుకే తాము ఉన్న‌ట్లుగా బిల్డ‌ప్ ఇచ్చే మీడియాల‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొద‌వ లేదు. ఎవ‌రికి వారు.. ట్యాగ్ లైన్లు పెట్టుకొని మ‌రీ.. త‌మ బ్రాండ్ ల‌ను ప్ర‌చారం చేసుకుంటూ ఉంటారు. మ‌రి.. అలాంటి ఏ మీడియా సంస్థ‌లోనూ రాని ఉదంత‌మిది. కొత్త సంవ‌త్స‌రం వ‌చ్చేసింది. ఎవ‌రికి వారంతా ఫుల్ హ్యాపీ. కానీ.. సంప‌న్న రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణ రాష్ట్రానికి మాత్రం కొత్త సంవ‌త్స‌రం రావ‌టంతోనే చుక్క‌లు చూపించిన‌ట్లుగా తెలుస్తోంది.

ఏపీ విభ‌జ‌న జ‌రిగి నాలుగున్న‌రేళ్లు కావొస్తున్న వేళ‌.. జ‌న‌వ‌రి నెలలో రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జీతాలు ఇచ్చేందుకు కేసీఆర్ స‌ర్కార్ కిందా మీదా ప‌డిన‌ట్లుగా తెలుస్తోంది. ఇబ్బ‌డిముబ్బ‌డిగా పెరిగిపోయిన ఖ‌ర్చులు.. అందుకు త‌గ్గ‌ట్లుగా రాని ఆదాయంతో వారి ప‌రిస్థితి మ‌హా ఇబ్బందిక‌రంగా మారిన‌ట్లుగా స‌మాచారం.

సంక్షేమ కార్య‌క్ర‌మాల్ని చేతికి ఎముక లేద‌న్న‌ట్లుగా ప్ర‌క‌టించిన కేసీఆర్ స‌ర్కారుకు.. ఆర్థిక క‌ష్టాలు అంత‌కంత‌కూ పెరుగుతున్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే.. ఈ స‌మాచారాన్ని బ‌య‌ట‌కు తెచ్చే ధైర్యం ప్ర‌ధాన మీడియా సంస్థ‌ల నుంచి మ‌రెవ‌రూ బ‌య‌ట‌పెట్టేందుకు ఇష్ట‌ప‌డ‌టం లేదు. బ‌డ్జెట్ అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లుగా రాబ‌డి లేక‌పోవ‌టం.. అప్పు మీద అప్పు తెస్తున్న రాష్ట్ర స‌ర్కారు.. రుణ ప‌రిమితులున్నీ దాదాపుగా అయిపోయిన‌ట్లుగా స‌మాచారం.

దీంతో.. జ‌న‌వ‌రి నెల ఉద్యోగుల జీతాలు ఇచ్చేందుకు నానా క‌ష్టాలు ప‌డిన‌ట్లుగా చెబుతున్నారు. ఇప్పుడున్న‌ట్లుగా రాష్ట్ర ఆదాయం పెర‌గ‌ని ప‌క్షంలో రానున్న రోజుల్లో మ‌రిన్ని ఇబ్బందులు త‌ప్ప‌వంటున్నారు. వ‌చ్చే రెండు నెల‌ల్లో ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన సంక్షేమ కార్య‌క్ర‌మాల‌కు మ‌రిన్ని నిధులు అవ‌స‌ర‌మైన వేళ‌.. అందుకు అవ‌స‌ర‌మైన నిధుల్ని ఎలా స‌ర్దుబాటు చేస్తార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌న్న విష‌యాన్ని ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు తెలియ‌ జేసే ధైర్యం అధికారుల‌కు ఉండ‌టం లేద‌ని.. అదే స‌మ‌యంలో ఆ విష‌యాన్ని ఆయ‌న‌కు చెప్పి.. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఏం చేస్తే మంచిద‌న్న విష‌యాన్ని చెప్పేందుకు అవ‌స‌ర‌మైన టైం ఆయ‌న ఇవ్వ‌క‌పోవ‌టంతో ఆర్థికశాఖ ముఖ్యుల‌కు ఏం చేయాలో అర్థం కావ‌టం లేదంటున్నారు.

మొత్తంగా చూస్తే.. మిగులు బ‌డ్జెట్ తో మొద‌లైన తెలంగాణ రాష్ట్ర ఖ‌జానా నాలుగున్న‌రేళ్ల వ్య‌వ‌ధిలో ఖ‌జానా ఖాళీ అయిన ప‌రిస్థితి ఎదుర్కొంటున్న‌ట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్ర‌భుత్వం శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేస్తే.. వాస్త‌వ ప‌రిస్థితులు ఏమిట‌న్న దానిపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉందంటున్నారు.