Begin typing your search above and press return to search.

సోనియాను కేసీఆర్ కోరిందేమిటో విన్నారా?

By:  Tupaki Desk   |   13 Dec 2018 6:05 AM GMT
సోనియాను కేసీఆర్ కోరిందేమిటో విన్నారా?
X
ఈ ద‌ఫా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ ప్ర‌ధానంగా టీఆర్ ఎస్ - కాంగ్రెస్ నేతృత్వంలోని ప్ర‌జా కూట‌మి మ‌ధ్యే జ‌రిగింది. కూట‌మిని చిత్తు చేసిన గులాబీ పార్టీ రెండో సారి త‌మ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ గురువార‌మే ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్నారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. వాస్త‌వానికి కేసీఆర్ కోరిన ఓ కోరిక‌ను కాంగ్రెస్ మాజీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ మ‌న్నించి ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ - టీఆర్ ఎస్ మ‌ధ్య పోటీయే జ‌రిగి ఉండేది కాద‌ట‌. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్య‌క్షుడిగా ఉండేవార‌ట‌.

శాస‌న‌స‌భాప‌క్ష నేత‌ను ఎన్నుకునేందుకు టీఆర్ ఎస్ బుధ‌వారం స‌మావేశ‌మైన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మావేశంలో కేసీఆర్‌ ను త‌మ ఫ్లోర్ లీడ‌ర్‌ గా ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు గులాబీ ఎమ్మెల్యేలు. అనంత‌రం మీడియాతో కేసీఆర్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ప‌లు సంచ‌ల‌న - ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.

తెలంగాణను ప్ర‌త్యేక రాష్ట్రంగా ప్ర‌క‌టిస్తే కాంగ్రెస్‌ లో టీఆర్ ఎస్‌ ను విలీనం చేస్తాన‌ని కేసీఆర్ ప్ర‌క‌టించిన‌ట్లు గ‌తంలో వార్త‌లొచ్చాయి. దీనిపై విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌కు కేసీఆర్ తాజాగా స్పందించారు. సోనియా ముందు తాను ఆ ప్ర‌తిపాద‌న పెట్టిన సంగ‌తి వాస్త‌వ‌మేన‌న్నారు. టీఆర్ ఎస్‌ ను విలీనం చేస్తే త‌న‌ను రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్య‌క్షుడిగా ప్ర‌క‌టించాల‌ని సోనియాను కోరిన‌ట్లు తెలిపారు. త‌న విన‌తికి ఆమె నుంచి సానుకూల స్పంద‌న రాక‌పోవ‌డంతో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయ‌లేద‌ని వెల్ల‌డించారు.

ఇక వాస్త‌వానికి ఈ ఎన్నిక‌ల్లో తాము 106 స్థానాలు గెల‌వాల్సింద‌ని కేసీఆర్ పేర్కొన్నారు. చిన్న చిన్న లోపాల వల్ల కొన్ని సీట్లు కోల్పోయామన్నారు. త‌న‌కు ఈ ఎన్నిక‌ల్లో గెలిచిన వాళ్ళే కాదు ఓడిన వాళ్లు కూడా ముఖ్య‌మేన‌ని చెప్పారు. ఖమ్మంలో మా వాళ్ళే మా వాళ్ల‌ను ఓడించారని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు కేసీఆర్‌. ఎన్నిక‌ల ఫ‌లితాల‌కు ఒక్క‌రోజు ముందు త‌న‌తో భేటీ అయిన మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఒవైసీతో జాతీయ రాజ‌కీయాల గురించే మాట్లాడిన‌ట్లు కేసీఆర్ తెలిపారు.