Begin typing your search above and press return to search.

కేసీఆర్ మాటతో జీతాలు ఎవరికి రానున్నాయి?

By:  Tupaki Desk   |   13 Oct 2019 7:30 AM GMT
కేసీఆర్ మాటతో జీతాలు ఎవరికి రానున్నాయి?
X
అధికారంలో ఉన్న వారు వాస్తవాల్ని ఎందుకు గుర్తించరు. గ్రౌండ్ లెవల్లో జరిగే పరిణామాలు వారికి ఎందుకు చేరవు? సామాన్యులకు అర్థమయ్యే కొన్ని విషయాలు సీఎం స్థానంలో కూర్చున్న అధినేతకు ఎందుకు అర్థం కాదు? అన్న సందేహం తరచూ వస్తుంటుంది. ఆ మాటకు వస్తే.. కొన్నేళ్ల క్రితం వరకూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ఈ విషయం మీద క్లారిటీ ఉండేదన్న మాటను పలువురు చెబుతారు.

ఆత్మవిశ్వాసం అంతకంతకూ పెరిగిపోవటం.. తన చుట్టూ ఉండే వారి పుణ్యమా అని.. మైండ్ సెట్ లో మార్పు వచ్చేస్తుంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పరిస్థితి ఇదే తీరులో ఉందని చెప్పాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్ తో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటంతో.. అదే తీరులో తెలంగాణ సీఎం కూడా చేయాలన్నది ఆర్టీసీ ఉద్యోగుల ఆకాంక్ష.

అయితే.. ఈ విషయంలో ఆర్టీసీని ఏం చేయాలన్న విషయం మీద సీఎం కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చేయటం.. తన మాటకు భిన్నంగా సమ్మె చేస్తున్న ఉద్యోగులపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తన మాట వినని వారి విషయంలో కేసీఆర్ ఎంత కరకుగా ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు. స్వభావరీత్యా మాటలు కాస్త దూకుడుగా ఉన్నా.. కేసీఆర్ మనసు వెన్నపూసగా చెబుతారు.

భావోద్వేగంతో ఉండటంతో పాటు.. ఎవరైనా ఏదైనా సమస్యను చెబితే ఇట్టే కనెక్ట్ అయ్యే గుణం ఆయనలో ఎక్కువ. ఈ కారణంతోనే ఆయన కొన్నిసార్లు మొండిగా వ్యవహరించినా.. విషయం చేజారిపోతుందన్న విషయాన్ని గ్రహించి.. అందుకు తగ్గట్లుగా తన నిర్ణయాన్ని మార్చుకునే గుణం ఇంతకాలం ఉండేది. ఇందుకు భిన్నంగా ఇటీవల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాను ఒక విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేస్తే.. దాన్ని మార్చటం దేవుడి వల్ల కూడా కాదన్నట్లుగా కేసీఆర్ వైఖరి మారింది.

ఈ కారణంతోనే ఆర్టీసీ ఉద్యోగులు చేస్తున్న సమ్మే న్యాయసమ్మతం కాదని ఫీలైన కేసీఆర్.. ఉద్యోగులు పని చేసిన కాలానికి చెల్లించాల్సిన జీతాల్ని కూడా చెల్లించకుండా ఉండిపోయారు. పదమూడో తారీఖు వచ్చినా ఇప్పటికి గత నెల జీతాలు రాని పరిస్థితి. సమ్మె తీవ్రత అంతకంతకూ పెరిగిపోతున్న వేళ.. కేబినెట్ భేటీ నిర్వహించారు కేసీఆర్. దాదాపు ఆరున్నర గంటల పాటు సాగిన మంత్రివర్గ భేటీలో ఆర్టీసీ ఉద్యోగుల జీతాల గురించి ఆయన వ్యాఖ్యలు కార్మికుల్ని రగిలించేలా చేస్తున్నాయి.

సమ్మెకు దూరంగా ఉంటూ.. బాధ్యతల్నినిర్వహిస్తున్న వారికి మాత్రమే గత నెల జీతాలు ఇవ్వాలని.. మిగిలిన వారికి జీతాల్ని నిలిపివేయాలని కోరటం చూసినప్పుడు.. సమ్మె విషయంలో కేసీఆర్ ఎంత పట్టుదలతో ఉన్నారో ఇట్టే అర్థం కాక మానదు. కేసీఆర్ తాజా మాటతో సమ్మె చేస్తున్న 48 వేల మందికి పైగా ఉద్యోగులకు జీతాలు అందని పరిస్థితి. సమ్మెతో సంబంధం లేనట్లుగా పని చేస్తున్న దాదాపు 1200 మందికి మాత్రమే జీతాలు అందనున్నట్లుగా చెబుతున్నారు. అదే జరిగితే.. ఆర్టీసీ ఉద్యోగులు మరింత ఆగ్రహానికి గురి కావటం ఖాయం.