Begin typing your search above and press return to search.

సారుకు చుర్రుమనిపిస్తున్న లెక్కలు!

By:  Tupaki Desk   |   10 May 2020 12:30 AM GMT
సారుకు చుర్రుమనిపిస్తున్న లెక్కలు!
X
రోజులన్ని ఒక్కటిలా ఉండవు. ఈ ఏడాది ఇంత వచ్చిందంటే.. వచ్చే ఏడాది ఇదే సమయానికి అంతకు మించే తప్పించి.. తగ్గే అవకాశమే లేదన్నట్లుగా ఉండేవి ఇప్పటివరకూ సాగిన లెక్కలన్ని. కానీ.. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. కలలో కూడా ఊహించని ఉత్పాతం కళ్ల ముందుకు వచ్చిన వేళ.. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి జరిగిన డ్యామేజ్ భారీగా సాగిందని చెప్పక తప్పదు.

గత ఏడాది ఏప్రిల్ లో తెలంగాణ రాష్ట్రానికి వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయం.. ఈ ఏడాది పూర్తిగా మిస్ కావటమే కాదు.. ఆ అంకెల్ని చూసినంతనే బావురమనే పరిస్థితి. చేతికి రావాల్సిన ఆదాయం మొత్తం మిస్ కావటం జీర్ణించుకోలేని పరిస్థితి. సంపన్న రాష్ట్రంలోనే ఇలాంటి దుస్థితి నెలకొంటే.. మిగిలిన రాష్ట్రాల పరిస్థితి మరెంత దారుణంగా ఉంటుందో ఇట్టే అర్థం కాక మానదు.

గత ఏడాది ఏప్రిల్ లో తెలంగాణలోని వివిధ విభాగాల నుంచి వచ్చిన ఆదాయంతో ఈ ఏప్రిల్ ను పోల్చి చూస్తే.. తెలంగాణ రాష్ట్ర గల్లా పెట్టెకు పడిన గండి ఇట్టే అర్థమైపోతుంది. పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాలపై వచ్చే ఆదాయం గత ఏడాది ఏప్రిల్ నెలలో రూ.673 కోట్లు రాగా.. ఈ ఏప్రిల్ లో అది కాస్తా రూ.181 కోట్లకే పరిమితమైంది. మద్యం అమ్మకాల మీద రూ.680 కోట్లు వస్తే.. ఈ ఏడాది ఏప్రిల్ లో పైసా రాలేదు.

అదే విధంగా ఐజీఎస్టీ సెటిల్ మెంట్ గత ఏప్రిల్ లో రూ.242 కోట్లు వస్తే.. ఈ ఏడాది ఏప్రిల్ లో చిల్లిగవ్వ కూడా రాలేదు. ఎస్జీఎస్టీ కింద గత ఏప్రిల్ లో రూ.1145 కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఇస్తే.. ఈ ఏప్రిల్ లో వచ్చింది కేవలం రూ.253 కోట్లు మాత్రమే. ఐజీఎస్టీ కింద గత ఏప్రిల్ లో రూ.912 కోట్లు వస్తే.. ఈ ఏడాది రూ.198 కోట్లకు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గత ఏప్రిల్ లో ఇతర ఆదాయాల ఖాతాల కింద రూ.76 కోట్లు వస్తే.. ఈ ఏడాది రూ.32 కోట్లు మాత్రమే వచ్చాయి. మొత్తంగా చూస్తే.. గత ఏప్రిల్ లో తెలంగాణ రాష్ట్రానికి పన్నుల ద్వారా వచ్చిన రాబడి రూ.3728 కోట్లు అయితే.. ఈ ఏప్రిల్ లో అది కాస్తా రూ.933 కోట్లకు తగ్గిపోవటం గమనార్హం. ఈ లెక్కల్ని చూస్తున్న కేసీఆర్ సారుకు పుడుతున్న సురుకు అంతా ఇంతా కాదంటున్నారు.