Begin typing your search above and press return to search.

చక్రం తిప్పుతారు కానీ.. సారు ప్రచారం చేయరట

By:  Tupaki Desk   |   14 April 2019 5:28 AM GMT
చక్రం తిప్పుతారు కానీ.. సారు ప్రచారం చేయరట
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా స్క్రిప్ట్ మాదిరిగా ఉండే ఆయన వ్యూహం కొన్నిసార్లు ఆకాశానికి మెట్లు వేసినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే.. కేసీఆర్ లెక్కలు మాత్రం పక్కాగా ఉంటాయన్న విషయాన్ని ఆయన రాజకీయ ప్రత్యర్థులు మరిచిపోతుంటారు. కేసీఆర్ మాటల్ని తక్కువగా అంచనా వేయటం.. ఆయన కొండకు వెంట్రుక కడతారని.. ప్రతిసారీ తెలంగాణ మాదిరి కొండ రావటం సాధ్యం కాదన్న విశ్లేషణలు చేస్తుంటారు.

కానీ.. కొండకు వెంట్రుక కట్టాలన్న దమ్ము అందరికి రాదు కదా? అన్న చిన్న లాజిక్ మాత్రం మిస్ అవుతూ ఉంటారు. తాజా ఎపిసోడ్ లోనూ కేసీఆర్ తనకు అలవాటైన దూకుడు రాజకీయాన్నే ప్రదర్శించినా.. లోగుట్టుగా మాత్రం సేఫ్ గేమ్ ఆడేందుకు డిసైడ్ అయ్యారని చెప్పాలి.

జాతీయ స్థాయి రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించాలని భావించే వారెవరూ రాష్ట్రానికే పరిమితం కారు. సొంత రాష్ట్ర ప్రజల దన్ను ఎంత అవసరమో.. జాతీయ స్థాయిలో తనకు తాను కానీ.. తన తరఫున కానీ వ్యవహారాలు చక్కబెట్టే వర్గాన్ని సిద్ధం చేసుకుంటారు. తాజాగా కేసీఆర్ కసరత్తు చూస్తే.. ఇలాంటివేమీ ఆయనలో కనిపించవు. ఏపీలో జరిగిన ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు తరఫున పలువురు జాతీయ స్థాయి నేతలు రావటం.. ఆయన అవసరం రాష్ట్రానికి ఎంత ఉందో చెప్పి వెళ్లారు.

మరి.. ఇదే తీరును కేసీఆర్ ఎందుకు వ్యవహరించటం లేదన్నది ప్రశ్న. అవసరం మాత్రమే కలిపించాలి తప్పించి.. కేసీఆర్ కు ప్రత్యేకంగా ఆత్మీయ రాజకీయ అనుబంధాలు తక్కువగా చెప్పాలి. ఎవరి పుట్టలోనూ అనవసరంగా వేలెట్టకపోవటంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో.. అదే సమయంలో వేరే వారి పుట్టలో వేలెట్టాలని అనుకోరు. ఒకవేళ అవసరం తన్నుకు వస్తే సరే అంటారే తప్పించి.. మిగిలిన సమయాల్లో ఆయన తెర వెనుకనే ఉండిపోతారు.

ఎక్కడిదాకానో ఎందుకు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టేందుకు తయారైనట్లు చెప్పిన కేసీఆర్.. కీలకమైన తెలంగాణ బిల్లు లోక్ సభలో పాస్ చేయించాలని డిసైడ్ అయిన రోజు సభలో ఆయన లేని వైనాన్ని గుర్తుకు తెచ్చుకుంటే.. గులాబీ బాస్ తత్త్వం ఇట్టే అర్థమవుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ ప్లాన్ ఏ వర్క్ అవుట్ అయ్యే అవకాశం తక్కువ. అందుకే.. ఆయన తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన ప్రచారంలో ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చేందుకు కారు.. పదహారు నినాదాన్ని తెర మీదకు తెచ్చారు.

కేంద్రంలో చక్రం తిప్పుతామని అదే పనిగా చెప్పిన కేసీఆర్.. ఎన్నికల సందర్భంగా జాతీయ పార్టీలతో కానీ.. బలమైన ప్రాంతీయ పార్టీలతో భేటీ కాకపోవటం ఒక ఎత్తు అయితే.. ఎన్నికల ప్రచారానికి ఏ రాష్ట్రానికి వెళ్లేది లేదని ఆయన డిసైడ్ కావటం ఆసక్తికరం. ఢిల్లీలో చక్రం తిప్పాలన్న ధ్యాస ఉన్నోళ్ల అడుగులు ఆ దిశగా పడతాయి. కానీ.. కేసీఆర్ మాత్రం కేంద్రంలో చక్రం తిప్పుతాను కానీ.. మరే రాష్ట్రంలోనూ దుష్ట దుర్మార్గ బీజేపీ.. కాంగ్రెస్ లను తిట్టిపోసే ప్రచారానికి సిద్ధంగా లేనని చెప్పటం.. హిందీ.. ఉర్దూలో అనర్గళంగా మాట్లాడే సత్తా ఉన్న కేసీఆర్ ఎందుకీ నిర్ణయాన్ని తీసుకున్నట్లు?  ఇది దేనికి సంకేతం?