Begin typing your search above and press return to search.

రెడ్డి ఇష్యూను ప‌ర్స‌న‌ల్ గా తీసుకోవ‌ద్దు కేసీఆర్‌

By:  Tupaki Desk   |   31 July 2018 7:47 AM GMT
రెడ్డి ఇష్యూను ప‌ర్స‌న‌ల్ గా తీసుకోవ‌ద్దు కేసీఆర్‌
X
కొన్ని విష‌యాలకు దూరంగా ఉండాలి. అనుకోకుండా ఆ అంశాల్ని ట‌చ్ చేసినా.. ఎదురు దెబ్బ త‌ప్ప‌ద‌న్న‌ప్పుడు వెన‌క్కి త‌గ్గితే అంతో ఇంతో ప‌రువు ద‌క్కుతుంది. అందుకు భిన్నంగా ఇష్యూను అదే ప‌నిగా కెలికితే న‌ష్టం త‌ప్ప‌దు. ఆ విష‌యాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ గుర్తించిన‌ట్లుగా లేదు.

ఆ మ‌ధ్య అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా లొల్లి జ‌ర‌గ‌టం.. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.. ఎస్.ఎ. సంప‌త్ కుమార్ ల అసెంబ్లీ స‌భ్య‌త్వాలు ర‌ద్దు చేస్తూ ఆఘ‌మేఘాల మీద నిర్ణ‌యం తీసుకోవ‌టం సంచ‌ల‌నం సృష్టించింది. త‌ప్పు చేశార‌న్న విష‌యంలోనూ ప‌లువురు సందేహాలు వ్య‌క్తం చేస్తున్నా.. వేటు వేసేశారు. దీనిపై ఇద్ద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్ర‌యించారు.

అప్ప‌టి సంధి.. ఈ ఇష్యూలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు అదే ప‌నిగా ఎదురుదెబ్బలు త‌గులుతున్నాయి. కోర్టుకు స‌మాధానం ఇచ్చే క్ర‌మంలో లాయ‌ర్ల‌ను మార్చేసినా ప్ర‌యోజ‌నం ఉండ‌టం లేదు. ఈ మ‌ధ్య‌నే కోమ‌టిరెడ్డి.. సంప‌త్ ల శాస‌న స‌భా స‌భ్య‌త్వాల్ని పున‌రుద్ద‌రించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. త‌మ ఆదేశాల్ని అమ‌లుపైనా కోర్టు కాస్త సీరియ‌స్ వ్యాఖ్య‌లు చేసింది.

ఈ నేప‌థ్యంలో కేసీఆర్ స‌ర్కారు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే.. తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు చూస్తుంటే.. ఈ ఇష్యూలో కేసీఆర్ వెన‌క్కి త‌గ్గేందుకు ఆస‌క్తి చూపించ‌టం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రే రాష్ట్రంలో లేని విధంగా వారంలో ఒక‌సారి త‌ప్ప‌నిస‌రిగా రాజ్ భ‌వ‌న్ కు వెళ్లి.. గ‌వ‌ర్న‌ర్ తో అన్ని విష‌యాల మీద మాట్లాడ‌టం తెలిసిందే.

తాజాగా మ‌రోసారి గ‌వ‌ర్న‌ర్ తో భేటీ అయిన కేసీఆర్‌.. వివిధ అంశాల‌తో పాటు కోమ‌టిరెడ్డి.. సంప‌త్ కుమార్ ల స‌భ్య‌త్వం ర‌ద్దు.. అనంత‌రం కోర్టు స్పందించిన తీరును చ‌ర్చించిన‌ట్లుగా తెలిసింది. గ‌వ‌ర్న‌ర్ తో భేటీకి ముందు.. అసెంబ్లీ స్పీక‌ర్ తో సీఎం కేసీఆర్ దాదాపు రెండు గంట‌ల పాటు చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లుగా తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా ఇద్ద‌రు ఎమ్మెల్యేల అన‌ర్హ‌త వేటు.. త‌ర్వాత చోటు చేసుకున్న అంశాల‌పై ఆయ‌న జ‌రిపిన చ‌ర్చ సారాంశం చూస్తుంటే.. ఈ ఇష్యూలో వెన‌క్కి త‌గ్గే విష‌యంలో కేసీఆర్ అంత సానుకూలంగా లేర‌న్న మాట వినిపిస్తోంది. ఇప్ప‌టికే ఈ ఎపిసోడ్ లో ప‌లుమార్లు త‌ల బొప్పి క‌ట్టిన నేప‌థ్యంలో.. ఇప్ప‌టికైనా పెద్ద‌గా ప‌ట్టించుకోన‌ట్లుగా ముఖ్య‌మంత్రి లైట్ తీసుకుంటే మంచిద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ ఇష్యూకు కేసీఆర్ ప్రాధాన్య‌త ఇచ్చే కొద్దీ.. మీడియాలో ఆయ‌న పేరు నాన‌టం ద్వారా ఆయ‌న ఇమేజే.. డ్యామేజ్ అవుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి.. కేసీఆర్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.