Begin typing your search above and press return to search.

కేటీఆర్ కోసం అన్నీ రెడీ చేసి పెడుతున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   31 Dec 2018 6:42 AM GMT
కేటీఆర్ కోసం అన్నీ రెడీ చేసి పెడుతున్న కేసీఆర్
X
లోక్ సభ ఎన్నికల తరువాత తెలంగాణలో సీఎం మారుతారని బలంగా ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుత సీఎం కేసీఆర్ అడుగులు కూడా అందుకు ఊతమిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల తరువాత కేసీఆర్ తన కుర్చీని కుమారుడు కేటీఆర్‌ కు అప్పగిస్తారని భావిస్తున్నారు. ఈలోగానే రాష్ట్ర వ్యవహారాలన్నీ చక్కదిద్ది కుమారుడికి ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా కార్యనిర్వాహక వ్యవస్థలో తన అనుకూల టీంను రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురు ఐఏఎస్‌ ల బదిలీలు - పదోన్నతులు ఉంటాయని తెలుస్తోంది.

భారీ ఎత్తున ఐఏఎస్‌ ల బదలీలు ఖాయమని ప్రభుత్వం సంకేతాలిస్త్తోంది. సీఎం కార్యాలయంలోని కార్యదర్శులు - స్పెషల్‌ సీఎస్‌ లను యథాతథంగా కొనసాగిస్తూనే కీలక శాఖలకు నమ్మకమైన వారిని నియమించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. అప్పుడే నిశ్చింతగా ఫెడరల్‌ ఫ్రంట్‌ పై దృష్టి సారించొచ్చని... కేటీఆర్ ఇక్కడ వ్యవహారాలు చూసుకోవడమూ సులభమవుతుందని కేసీఆర్‌ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

పనిలో పనిగా తాజాగా ముగిసిన ఎన్నికల్లో శత్రుపక్షాలకు సహకరించిన ఐఏఎస్‌ - ఐపీఎస్‌ అధికారుల జాబితాను ఈ మేరకు సేకరించి సిద్ధంగా పెట్టుకున్నారట. కాంగ్రెస్‌ పార్టీలో కీలకపాత్ర పోషించి - పదవీ విరమణ చేసిన ఐఏఎస్‌ అధికారికి టచ్‌ లో ఉంటూ ప్రభుత్వ రహస్యాలను బట్టబయలు చేశారన్న ఆరోపణలు వచ్చిన కొందరిని ప్రభుత్వం పక్కకు పెట్టనున్నట్లు సమాచారం. కీలకమైన ఆర్థిక - రెవెన్యూ - సీసీఎల్ ఏ - ఎక్సైజ్‌ - వాణిజ్య పన్నుల శాఖల్లో సమూల మార్పులు చేయనున్నట్లు సమాచారం. సీసీఎల్ ఏగా అధర్‌ సిన్హాను - ఆర్థిక శాఖకు మరో సీనియర్‌ అధికారిని నియమించేందుకు అవకాశాలున్నాయని తెలుస్తోంది.

వాణిజ్య పన్నులు - ఆబ్కారీ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేష్‌ కుమార్‌ కు కూడా ప్రభుత్వం పెద్దపీట వేయనుందని తెలిసింది. ఇటీవలీ ఎన్నికల్లో కొందరు కలెక్టర్లపై వచ్చిన ఫిర్యాదులను - వారి పనితీరును పరిశీలించిన ప్రభుత్వం భారీగా సంస్కరణలు తేనున్నట్లు సమాచారం. కొందరిని మార్చడంతోపాటు - మరికొందరు సమర్ధులను కమిషనర్‌ లుగా పదోన్నతులను కల్పించేందుకు యోచిస్తోంది.

మరోవైపు తెలంగాణలో ఐఏఎస్‌ ల కొరత తీర్చమని కూడా కేంద్రాన్ని కేసీఆర్ ఇప్పటికే కోరినట్లు చెబుతున్నారు. రాష్ట్రానికి 208 పోస్టుల మంజూరుకాగా - ఇప్పటివరకు 151 మందినే కేంద్రం కేటాయించింది. ఇంకా 57 మంది అధికారుల కొరత వేధిస్తున్నది. కొత్తగా 21జిల్లాలు ఏర్పడగా - త్వరలో మరో రెండు జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఈ నేపథ్యంలో మరింత కొరత పెరగనుంది. ఈ ఏడాది మరో ఆరుగురు ఐఏఎస్‌ లు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఐఏఎస్‌ లను కేటాయించాలని కేంద్రాన్ని కేసీఆర్ కోరారు.

ఎక్కడా అధికారుల కొరత లేకుండా.. అన్ని శాఖలకూ బాధ్యులు ఉండేలా ఏర్పాటు చేసి.. కీలక శాఖలకు నమ్మకస్తులు - సమర్థులను నియమించుకుని కేటీఆర్‌ కు పని సులభం చేయాలన్నది కేసీఆర్ ముందుచూపుగా తెలుస్తోంది.