Begin typing your search above and press return to search.

మెట్రో ఫేజ్ 2..కేసీఆర్ స‌ర్కారు దూకుడు

By:  Tupaki Desk   |   4 Feb 2018 5:42 PM GMT
మెట్రో ఫేజ్ 2..కేసీఆర్ స‌ర్కారు దూకుడు
X
హైదరాబాద్‌ మెట్రోపై తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ సారథ్యంలోని స‌ర్కారు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తోంది. మొద‌టి ద‌శ త‌న హ‌యాంలో ప్రారంభం కాన‌ప్ప‌టికీ...ఆ మైలేజీని సొంతం చేసుకున్న గులాబీ స‌ర్కారు...రెండో ద‌శ‌ను త‌న‌ఖాతాలో చేర్చుకునేందుకు రెడీ అవుతోంది. అయితే, మెట్రో రైలు మొదటిదశ కారిడార్‌-1కు సంబంధించి అమీర్‌పేట నుంచి ఎల్బీనగర్‌ వరకు కారిడార్‌-3కు సంబంధించి అమీర్‌పేట నుంచి హైటెక్‌సిటీ వరకు అందుబాటులోకి వచ్చిన తర్వాతే రెండోదశ పనులకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఇందుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి.

ఒక పక్క ఈ రెండు కారిడార్లకు సంబంధించిన పనులు వచ్చే జూన్‌లోగా పూర్తిచేసి మెట్రోను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధం చేస్తుండగా, మొదటిదశ పనులకు సమాంతరంగా రెండోదశకు సంబంధించిన సర్వేపూర్తిచేసి వచ్చే జూన్‌నాటికి డీపీఆర్‌ సిద్ధం చేయాలని నిర్ణయించారు. జూన్‌లో రెండు కారిడార్లు అందుబాటులోకి రావడంతోపాటు రెండో దశ డీపీఆర్‌ సిద్ధం కానున్నది. మొదటి దశ కారిడార్‌-2కు సంబంధించి జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌(9 కి.మీ) మార్గాన్ని ఈ ఏడాది చివరినాటికి పూర్తిచేయనున్నారు.

మొదటిదశ ఏడాది చివరినాటికి పూర్తి కానుండటంతో రెండో దశను మొదలుపెట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందడుగు వేసింది. రెండోదశకు సంబంధించిన డీటేయిల్‌డ్‌ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్‌)ను సాధ్యమైనంత త్వరగా సిద్ధం చేసి పనులకు శ్రీకారం చుట్టేందుకు సమాయత్తమవుతోంది అందులో భాగంగా డీపీఆర్‌ తయారుచేసే బాధ్యతను ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్‌(డీఎంఆర్‌ సీ)కు అప్పగించారు. డీఎంఆర్‌సీ నిపుణులు హైదరాబాద్‌ కు వచ్చి రెండో దశ కారిడార్లకు సంబంధించిన ప్రాంతాలను పరిశీలించారు. హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి నేతృత్వంలో హెచ్‌ఎంఆర్‌ఎల్‌కు చెందిన సీనియర్‌ ఇంజినీర్లతోపాటు డీఎంఆర్‌సీ బృందం పలు ప్రదేశాలను పరిశీలించింది.

మెట్రోరైలు రెండో దశలో భాగంగా మూడు మార్గాలకు సంబంధించిన కారిడార్ల విషయం చర్చకు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. అందులో మొదటిదశలో భాగంగా ప్రస్తుతం నడుస్తున్న కారిడార్‌-3కు కొనసాగింపుగా నాగోల్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు మెట్రోరైలును పొడిగించాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో కారిడార్‌-1, 3లు ఎల్బీనగర్‌ జంక్షన్‌ వద్ద కలుస్తాయి. అదేవిధంగా బీహెచ్‌ఇల్‌ నుంచి లక్డికాపూల్‌ వరకు మరో మార్గం(కారిడార్‌)ను నిర్మించాలని అనుకున్నారు. కొండాపూర్‌, గచ్చిబౌలి మీదుగా దీన్ని తీసుకురావాలని చర్చించారు. ప్రస్తుతం కారిడార్‌-3 రాయదుర్గం వరకు పొడిగించగా దానికి కొనసాగింపుగా రాయదుర్గం నుంచి రాజేంద్రనగర్‌ - పోలీసు అకాడమీ మీదుగా శంషాబాద్‌ విమానాశ్రయం వరకు పొడిగించాలని సమావేశంలో చర్చించారు. మెట్రో రెండోదశ డిపోల కోసం మియాపూర్‌ లేదా బీహెచ్‌ఈఎల్‌లో 70 ఎకరాల స్థలం సేకరించాలని, మరో డిపో కోసం శంషాబాద్‌ లో లేదా బుద్వేల్‌ వద్ద 60 ఎకరాలు సేకరించాలని అభిప్రాయం వ్యక్తంచేశారు. ఒక్కో స్టేషన్‌ - పార్కింగ్‌ స్థలం కోసం నాలుగు ఎకరాల వరకు సేకరించాలని, దీనికోసం ఖాళీ స్థలాలు పరిశీలించాలని అభిప్రాయానికి వచ్చారు.