Begin typing your search above and press return to search.

హ‌రీశ్ ను పూర్తిగా ప‌క్క‌న పెడుతున్నారా?

By:  Tupaki Desk   |   13 Jan 2019 10:46 AM GMT
హ‌రీశ్ ను పూర్తిగా ప‌క్క‌న పెడుతున్నారా?
X
టీఆర్ ఎస్ అగ్ర‌ నేత‌ల్లో హ‌రీశ్ రావు ఒక‌రు. రాష్ట్రవ్యాప్తంగా ఆయ‌న‌కు మంచి జ‌నాద‌ర‌ణ ఉంది. ఇటీవ‌లి అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సిద్ధిపేట నుంచి ఆయ‌న అఖండ విజ‌యం సాధించారు. స‌మీప ప్ర‌త్య‌ర్థిపై ల‌క్ష ఓట్ల‌కు పైగా మెజారిటీ సాధించారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టించి గులాబీ అభ్య‌ర్థుల విజ‌యానికి కృషి చేశారు.

అయితే - హ‌రీశ్ రావు భ‌విత‌వ్యంపై ఇప్పుడు ఆందోళ‌న‌లు - అనుమానాలు ముసురుకున్నాయి. కుమారుడు, కుమార్తెల రాజ‌కీయ భ‌విష్యత్తుకు అడ్డం కాకుండా ఉండేందుకుగాను గులాబా ద‌ళ‌ప‌తి కేసీఆర్ త‌న మేన‌ల్లుడు హ‌రీశ్ ను పూర్తిగా సైడ్ చేస్తున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత అడ‌పాద‌డ‌పా మాత్ర‌మే హ‌రీశ్ బ‌య‌ట‌కు క‌నిపిస్తుండ‌టం ఈ వార్త‌ల‌ను బ‌ల‌ప‌రుస్తోంది.

తెలంగాణ‌లో అపూర్వ విజ‌యం సాధించి తిరిగి సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసిన కేసీఆర్ త‌న కుమారుడు కేటీఆర్ కు పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్ష ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. త‌ద్వారా కేటీఆరే త‌న వార‌సుడ‌ని చాటిచెప్పారు. ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం కేటీఆర్ పార్టీ ప‌నుల్లో నిమ‌గ్న‌మ‌య్యారు. క‌విత పార్ల‌మెంటు స‌మామేశాల‌తో బిజీ అయ్యారు. హ‌రీశ్ మాత్రం బ‌హిరంగంగా క‌నిపించ‌లేదు. టీఆర్ ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కేటీఆర్ ను అభినందించ‌డం కోసం తెలంగాణ భ‌వ‌న్ కు వెళ్లిన‌ప్పుడు చివ‌రిసారిగా ఆయ‌న మీడియా కంట‌ప‌డ్డారు. ఇటీవ‌ల హ‌రీశ్ సింగ‌పూర్ టూర్ కు వెళ్లారు. ఆపై ఓ డైరీ విడుద‌ల కార్య‌క్ర‌మంలో మాత్ర‌మే క‌నిపించారు.

విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం.. హ‌రీశ్ కు కొంత‌కాలంగా కేసీఆర్‌ అపాయింట్ మెంట్ ఇవ్వ‌డం లేద‌ట‌. ఇటీవ‌ల కాళేశ్వ‌రం స‌హా ప‌లు ప్రాజెక్టుల సంద‌ర్శ‌న‌కు సీఎం వెళ్లిన‌ప్పుడు ఆయ‌న వెంట హ‌రీశ్ లేక‌పోవ‌డానికి అదే కార‌ణ‌మ‌ట‌. కాళేశ్వ‌రం స‌హా ఇరిగేష‌న్ ప్రాజెక్టుల స‌మీక్ష‌ల్లో హ‌రీశ్ పాల్గొన‌లేదు. నాలుగున్న‌రేళ్లుగా నీటి పారుదల శాఖ బాధ్య‌త‌లు చూసుకున్న ఆయ‌న‌.. కీల‌క స‌మీక్షా స‌మావేశాల్లో పాల్గొన‌క‌పోవ‌డంపై స‌ర్వ‌త్రా అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. నీటి పారుద‌ల శాఖ‌కు సంబంధం లేని మంత్రులు మాత్రం ఆ స‌మావేశాల్లో పాల్గొన‌డం గ‌మ‌నార్హం.

ఇక ఈ ద‌ఫా మంత్రివ‌ర్గంలో హ‌రీశ్ రావుకు కేసీఆర్ స్థానం క‌ల్పించ‌బోర‌నే వార్త కూడా ప్ర‌స్తుతం బాగా వినిపిస్తోంది. అందులో పెద్ద‌గా ఆశ్చ‌ర్య‌పోయేదేం లేదు. హ‌రీశ్ తో కేసీఆర్ ఎంపీగా పోటీ చేయించే అవ‌కాశాలు లేక‌పోలేదు. మేన‌ల్లుడు ఎంపీగా దిల్లీకి వెళ్తే రాష్ట్ర సీఎం ప‌గ్గాలు చేప‌ట్టేందుకు కుమారుడికి మార్గం సుగ‌మ‌మ‌వుతుంద‌ని కేసీఆర్ భావిస్తుండొచ్చు.

హ‌రీశ్ భ‌విత‌వ్యంపై మ‌రో వార్త తాజాగా చ‌క్క‌ర్లు కొడుతోంది. ఆయ‌న‌కు కేసీఆర్ ఎంపీ టికెట్ ఇవ్వ‌బోర‌న్న‌ది దాని సారాంశం. హ‌రీశ్ ఎంపీగా దిల్లీ వెళ్తే త‌న కుమార్తె క‌విత ప్రాధాన్యం త‌గ్గిపోతుంద‌ని కేసీఆర్ అనుకుంటున్నార‌ట‌. అందుకే మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కుండా.. ఎంపీ టికెట్ కేటాయించ‌కుండా హ‌రీశ్ ను కేసీఆర్ ఓ సాదాసీదా ఎమ్మెల్యేగా ఉంచ‌బోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ వార్త‌ల్లో నిజ‌మెంతో తెలియాలంటే మ‌రికొంత‌కాలం వేచి చూడాల్సిందే!