Begin typing your search above and press return to search.

ఈటలకు వెన్న రాసి వాత పెట్టిన కేసీఆర్

By:  Tupaki Desk   |   13 Sept 2019 11:29 AM IST
ఈటలకు వెన్న రాసి వాత పెట్టిన కేసీఆర్
X
నచ్చని పని చేయటం ఎవరికైనా ఒళ్లు మంటే. మామూలోళ్ల సంగతే ఇలా ఉంటే.. తనను తాను ప్రత్యేక రూపంగా.. శక్తిగా భావించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి బలమైన నేత.. తనకిష్టం లేని పని చేయటం ఎంత చిరాగ్గా ఉంటుంది. అందుకే.. తన చేత..తనకేమాత్రం సానుకూలత లేని పని చేయించిన దానికి ప్రతిగా బదులు తీర్చుకున్నారా? అంటే అవుననే మాట వినిపిస్తోంది.

ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణ వాస్తవానికి కేబినెట్ ప్రక్షాళన అని అనుకున్నా.. అనుకోని రీతిలో తెర మీదకు వచ్చిన అంశాలతో కాస్త వెనక్కి తగ్గి.. అప్పటికప్పుడు ఖరారైన ప్లాన్ తో విస్తరణతో సరిపెట్టుకున్నారని చెబుతారు. ప్లాన్ ఏ ప్రకారం హరీశ్ కు కేబినెట్ లో బెర్త్ లభించకూడదని.. ఈటలకు మంత్రి వర్గం నుంచి ఉద్వాసన ఖాయమని.. ఇలా పలు మార్పులతో మొదట అనుకున్నా.. తర్వాత మారిన సమీకరణాల నేపథ్యంలో ఎలాంటి వేట్లు వేయకుండా యథాతధ స్థితిని కొనసాగించినట్లుగా చెబుతున్నారు.

తనకు దూరమైన వారి విషయంలో నిర్దయగా వ్యవహరించే తీరుకు భిన్నంగా.. ఈటెలతో పెరిగిన దూరాన్ని తన ఫోన్ కాల్ తో కేసీఆర్ దగ్గర చేసుకున్నారని చెప్పాలి. కొత్త మంత్రుల ప్రమాణస్వీకారానికి ముందు తన నివాసానికి రావాలంటూ ఈటలను పిలిపించుకున్న కేసీఆర్.. తర్వాత కూడా ఫోన్ కాల్ చేయటం.. విష జ్వరాల విషయంలో అధైర్యపడకుండా ముందుకెళ్లాలన్న ప్రోత్సాహాన్ని ప్రదర్శించటం తెలిసిందే.

పైకి చూసినోళ్లకు వెన్న రాసినట్లుగా రాసిన కేసీఆర్.. తనకు లభించిన అవకాశాన్ని ఏ మాత్రం మిస్ చేసుకోకుండా వాత పెట్టినట్లుగా చెప్పక తప్పదు. ఈటలను మంత్రిగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న ఆయనకు.. తనకున్న కోపాన్ని తన తాజా చర్యతో చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. అసెంబ్లీ వ్యవహారాల్లో తలదూర్చకుండా ఉండటానికి వీలుగా బీఎసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సభ్యుడి ఉన్న ఆయన్ను.. అందులో నుంచి తప్పించారు.

ఇందుకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్ కు కేసీఆర్ లేఖ రాయటం గమనార్హం. ఈటల స్థానంలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పైకి వెన్న రాసినట్లుగా ఈటెలతో మాట్లాడుతూనే.. ఛాన్స్ చిక్కినంతనే ఆయనకు వాత పెట్టేందుకు ఏ మాత్రం వెనుకాడని కేసీఆర్ తీరు ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసిందని చెప్పక తప్పదు.