Begin typing your search above and press return to search.

చైనాలో గాడిద‌ల‌కున్న డిమాండ్ కేసీఆర్‌ కు తెలిస్తే?

By:  Tupaki Desk   |   2 Jan 2018 5:12 AM GMT
చైనాలో గాడిద‌ల‌కున్న డిమాండ్ కేసీఆర్‌ కు తెలిస్తే?
X
ఊహ‌ల్లో మాత్ర‌మే సాధ్య‌మ‌వుతాయ‌ని భావించేవి వాస్త‌వాల్లోకి తీసుకొచ్చే ద‌మ్ము.. ధైర్యం ఉండే పాల‌కులు కొద్ది మందే ఉంటారు. కొన్ని వినేందుకు విచిత్రంగా అనిపించినా.. వాటిని అమ‌ల్లోకి తీసుకొచ్చే సాహ‌సం కొంద‌రికి మాత్ర‌మే ఉంటుంది. అలాంటి గుణాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు కాస్త ఎక్కువే.

ఎవ‌రు మాత్రం.. గొర్రెలతో ఒక రాష్ట్ర ఆర్థిక ముఖ‌చిత్రాన్నే మార్చేయగ‌ల‌మ‌ని అంచ‌నా వేస్తారు? గొర్రెల పెంప‌కం ద్వారా వేలాది కోట్ల రూపాయిలు జ‌న‌రేట్ చేయ‌గ‌ల‌మ‌ని చెప్పి ఒప్పంచ‌గ‌లుగుతారు? ప‌శు సంప‌ద‌తో భారీగా ఆర్థిక‌వృద్ధి జ‌రుగుతుందని చెప్ప‌ట‌మే కాదు.. ఎక్క‌డా లాజిక్ మిస్ కాకుండా చెప్ప‌టంలో తెలంగాణ రాష్ట్ర సీఎం త‌ర్వాతే ఎవ‌రైనా.

గొర్రెల పెంప‌కంతో భారీగా వృద్ధిరేటు న‌మోదు అవుతుంద‌ని చెప్ప‌ట‌మే కాదు.. అదిగ‌దిగో బంగారు తెలంగాణ అని చెప్పే ఆయ‌న‌.. ఇప్పుడు బంగారు తెలంగాణ దాదాపుగా వ‌చ్చేసిన‌ట్లేన‌ని చెప్ప‌టం మొద‌లెట్టారు. 2019 సార్వ‌త్రికానికి బంగారు తెలంగాణ వ‌చ్చేసింద‌న్న మాట‌ను చెప్పాలంటే.. ఇప్పటికి ఈ మాత్రం చెప్పుకోక‌పోతే బాగోదు క‌దా.

స‌రే.. ఈ మేక‌ల‌కు.. చైనా గాడిద క‌ష్టాల‌కు లింకేంటో? అన్న సందేహం అక్క‌ర్లేదు. ఆ ముచ్చ‌ట్లోకే వెళుతున్నాం.

ప్ర‌పంచ అవ‌స‌రాల్ని తీర్చే చైనాకు ఇప్పుడు పెద్ద క‌ష్ట‌మే వ‌చ్చింది. ఆ వ‌స్తువు.. ఈ వ‌స్తువు అన్న తేడా లేకుండా ఎలాంటిదాన్నైనా.. కారు చౌక‌గా ప్ర‌పంచ ప్ర‌జ‌ల‌కు అందించే స‌త్తా చైనీయుడికే ఉంది. వ‌స్తు నాణ్య‌త విష‌యంలో కాస్త తేడా ఉన్నా.. ఇచ్చే డ‌బ్బుకు త‌గ్గ సంతృప్తిని తాత్కాలికంగా ఇచ్చే విష‌యంలో చైనావోడిని కొట్టినోడు లేడు.

అందుకే.. చైనా ఉత్ప‌త్తులు నాణ్య‌త లేవ‌న్న విష‌యం తెలిసినా.. పిండి కొద్ది రొట్టె సామెత‌ను గుర్తుకు తెచ్చుకొని మ‌రీ కొనేయటం క‌నిపిస్తుంది. ఇలా చౌక‌గా అందించే చైనాకు గాడిద చిక్కులు వ‌చ్చాయి. చైనాకు ఇప్పుడు గాడిద తోలు మ‌హా డిమాండ్ వచ్చేసింది. గాడిద తోలుతో చైనావోళ్లు ఏం చేస్తారో తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. గాడిద‌.. గాడిద అంటూ చుల‌క‌న‌గా అనేస్తాం కానీ.. గాడిద తోలు చేసే బిజినెస్ వింటే షాక్ అవ్వాల్సిందే.

గాడిద తోలు నుంచి జెలిటిన్ ను తీస్తారు. అదెలా ఉంటే.. చ‌ర్మ కండ‌రాల నుంచి కాచితే.. రుచి లేని జిగురు ప‌దార్థం ఒక‌టి ఉత్ప‌త్తి అవుతుంది. దీనికి చైనాలో ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. దాంతో చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంచే సంప్ర‌దాయ చైనా ఔష‌ధాల్లో వినియోగిస్తార‌ట‌. అంతేనా.. గాడిద మాంసం అంటేచాలు చైనీయులు లొట్ట‌లేసుకొని తినేస్తుంటారు. 1996లో చైనాలో దాదాపు కోటి గాడిద‌లు ఉంటే.. ఇష్టారాజ్యంగా తినేయ‌టంతో వాటి సంఖ్య 2015 నాటికి 50 ల‌క్ష‌ల‌కు ప‌డిపోయింది. దీంతో.. గాడిద‌ల‌కు.. వాటి ద్వారా వ‌చ్చే బై ప్రొడ‌క్ట్స్ కు భారీ డిమాండ్ ఏర్ప‌డింది.

ఒక లెక్క ప్ర‌కారం ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న గాడిద‌ల సంఖ్య కేవ‌లం 4.4 ల‌క్ష‌లు మాత్ర‌మేన‌ట‌. దీంతో.. గాడిద చ‌ర్మానికి.. వాటి మాంసానికి చైనాలో భారీ డిమాండ్ పెరిగిపోయింది. ఇంత‌కీ చైనా గాడిద‌ల స‌మ‌స్య‌ తెలంగాణ ముఖ్య‌మంత్రుల వారికి ఎందుకంటారా? ప‌శు సంప‌ద‌ను భారీగా పెంచేసి.. కోట్లాది రూపాయిల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను సృష్టించే క్ర‌మంలో అహ‌ర‌హం కృషి చేస్తున్న పెద్దాయ‌న చెవిలో చైనాలో గాడిద‌ల‌కున్న డిమాండ్ ముచ్చ‌ట వేస్తే.. క‌త్తి లాంటి కేసీఆర్ కు క‌స్సుక్కున దిగే అద్భుత‌మైన ఐడియా రావొచ్చు. తెలంగాణ‌లో భారీగా గాడిద‌ల పెంప‌కం మీద భారీ ప‌థ‌కం షురూ చేయొచ్చు. గాడిద కూడా సంప‌దేన‌ని స్ప‌ష్ట‌మ‌య్యాక‌.. దాని గురించి ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంది క‌దా?