Begin typing your search above and press return to search.
కేసీఆర్ మళ్లీ సినిమా చూపించేశాడుగా
By: Tupaki Desk | 26 Oct 2017 11:30 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోమారు తన పార్టీ నేతలకు గీతోపదేశం చేశారు. సొంత పార్టీ టీఆర్ ఎస్ బలాబలాలను విశ్లేషించారు....వ్యూహా ప్రతివ్యూహాలను వివరించారు...ప్రత్యర్థిని ఎదుర్కునే నైపుణ్యాలను నేర్పించారు...స్థూలంగా పార్టీ ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలకు ఆసక్తికరమైన సినిమా చూపించారు. మొత్తంగా కేసీఆర్ ఓ వ్యక్తిత్వ వికాస నిపుణుడిలా మారిపోయారు. ఇదంతా తన అధ్యక్షతన జరిగిన టీఆర్ ఎస్ ఎల్పీ సమావేశంలో సీఎం కేసీఆర్ పోషించిన పాత్ర.
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తెలంగాణ భవన్ లో టీఆర్ ఎస్ ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీలో వ్యవహరించాల్సిన విధానాలపై పార్టీ శ్రేణులకు సీఎం దిశా నిర్దేశం చేశారు. దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో ఎవరెవరు ఏయే బాధ్యతలు నెరవేర్చాలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా చెప్పారు. పార్టీ ప్రజాప్రతినిధులు తప్పకుండా సభలో ఉండాలని చెప్పారు. శాసనసభ్యులు ప్రతీ సబ్జెక్టుపై అవగాహనతో.. పూర్తిగా సన్నద్ధమై సభకు హాజరుకావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అసెంబ్లీలో విపక్షాలు చేసే విమర్శలను తిప్పికొట్టేలా టీఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు సిద్దంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. అసెంబ్లీ సమావేశాలకు తప్పనిసరిగా హాజరుకావాలని సభలో చర్చించే అవకాశం ఉన్నా కావాలనే రాద్దాంతాలకు తెరతీస్తున్న కాంగ్రెస్ పార్టీ కుట్రలను తిప్పికొట్టాలని సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు.
2019 ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీదే మళ్లీ గెలుపని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. వచ్చే ఎన్నికల్లో 96 నుంచి 104 స్థానాలు గెలుస్తామన్నారు. 99శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. పార్టీలో వర్గ రాజకీయాలను ప్రోత్సహించేది లేదన్నారు. విప్ లు సభలో సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. స్థూలంగా సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో ఇప్పుడు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలంతా శాసనసభ - మండలిలో తమవాణిని బలంగా వినిపించడానికి సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.