Begin typing your search above and press return to search.

వెంక‌య్య టూర్లు!...కేసీఆర్‌ కు చిర్రెత్తినట్టేనా?

By:  Tupaki Desk   |   1 May 2019 2:30 PM GMT
వెంక‌య్య టూర్లు!...కేసీఆర్‌ కు చిర్రెత్తినట్టేనా?
X
ముప్ప‌వ‌రపు వెంక‌య్య‌నాయుడు... ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరే. మొన్న‌టిదాకా బీజేపీ సీనియ‌ర్ నేత‌ - మోదీ కేబినెట్ లో కీల‌క శాఖ‌ల మంత్రి కూడానూ. అయితే మోదీ తీసుకున్న సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యంతో ఒక్క‌సారిగా వెంక‌య్య పొలిటిక‌ల్ కెరీర్ కు ముగింపు కార్డు ప‌డిపోయింది. త‌న‌కు ఇష్టం లేద‌ని మొత్తుకున్నా విన‌కుండా... వెంక‌య్య‌ను భార‌త ఉప‌రాష్ట్రప‌తి సీట్లో కూర్చోబెట్టేశారు క‌మ‌ల‌నాథులు. ఇంకేముంది... అప్ప‌టిదాకా త‌న‌దైన చ‌తుర‌త‌తో రాజకీయాలు న‌డిపిన వెంక‌య్య‌... ఇప్పుడు నోటికి ప్లాస్ట‌ర్ వేసుకుని కూర్చోక త‌ప్ప‌లేదు. ఎంతైనా ఉరుకులు ప‌రుగులు పెట్టిన ప్రాణం క‌దా. ఎంత ఉప‌రాష్ట్రప‌తి సీట్లో కూర్చోబెట్టినా... నోటిని అయితే క‌ట్టేసుకోగ‌లరు గానీ... కాళ్ల‌ను క‌ట్టేసుకోలేరు క‌దా. అందుకే దేశానికి ఉప‌రాష్ట్రప‌తి అయినా వెంక‌య్య మాత్రం త‌ర‌చూ త‌న సొంతూరికి వ‌చ్చిపోతూనే ఉన్నారు.

ఏదో నెల‌లో ఒక‌సారి అయితేనే - రెండు నెల‌ల‌కు ఒక‌సారి అయితేనో ప్రాబ్లం లేదు గానీ... వారానికి ఒక‌సారి - మ‌రీ వారానికి రెండు సార్లు - ప్ర‌తి వీకెండ్ లో వెంక‌య్య తెలుగు నేల‌కు వ‌స్తుంటే ఇబ్బందే క‌దా. అయినా సొంతూరికి - తెలుగు నేల‌కు వెంక‌య్య వ‌స్తే ఇబ్బందేంట‌నేగా మీ డౌటు? ఉప‌రాష్ట్రప‌తి హోదాలో వ‌స్తున్న వెంక‌య్య‌కు స్వాగ‌త ప‌లికేందుకు సీఎం వెళ్లాల్సిందే. వీడ్కోలుకు కూడా సీఎమ్మే వెళ్లాలి. మ‌రి వారానికి హీన‌ప‌క్షం ఓ వెల‌క‌మ్‌ - ఓ వీడ్కోలు అంటే ఎలా కుదురుతుంది? నిజ‌మే తెలంగాణ సీఎం కేసీఆర్ లాంటి వారికి అయితే అస్స‌లే కుద‌ర‌దు. తొలుత వెంక‌య్య‌కు స్వాగ‌తం చెప్పేందుకు ఇబ్బంది అయినా ఓర్చుకున్న కేసీఆర్‌... ఇప్పుడు వెంక‌య్య రాక‌లు ఎక్కువైపోవ‌డంతో ఆ వెల్ క‌మ్ బాధ్య‌త‌లు త‌న‌తో కాదని తేల్చేశార‌ట‌.

త‌న ప్లేస్ లో డిప్యూటీ సీఎం మ‌హ‌మూద్ అలీని పెట్టేసి... వెంక‌య్య‌కు ఎం కావాలో మీరే చూసుకోండి అంటూ కేసీఆర్ ఓ కీల‌క నిర్ణ‌య‌మే తీసుకున్నార‌ట‌. ఈ కార‌ణంగానే ఇప్పుడు వెంక‌య్య ఎప్పుడు హైద‌రాబాద్ వ‌చ్చినా... కేసీఆర్ కు బ‌దులుగా మ‌హ‌మూద్ అలీ స్వాగ‌తం చెబుతున్నారు. వీడ్కోలు కూడా ఆయ‌నే ప‌లుకుతున్నారు. అయినా ఏదో ఓ స్థాయి ఉన్న కార్య‌క్ర‌మానికి వ‌స్తే ఫ‌ర‌వా లేదు గానీ... ఎవ‌రి పెళ్లి జ‌రిగినా.... వెంక‌య్య ఫ్లైటెక్కేస్తుంటే ఇబ్బందే క‌దా. త‌ర‌చూ ప్రొటోకాల్ అంటే సీఎం స్థాయి వ్య‌క్తుల‌కు ఇబ్బందిని అలా ప‌క్క‌న‌పెడితే... స‌ద‌రు ప్రొటోకాల్ ఏర్పాట్లు, భ‌ద్రతా ఏర్పాట్ల‌కు స‌ర్కారీ ధ‌నం ఇంకెంత వేస్ట్ అయిపోతోందో అన్న వాద‌న కూడా వినిపిస్తోంది. మొత్తంగా వెంక‌య్య తెలుగు నేల‌లో త‌న ప‌ర్య‌ట‌న‌ల‌ను త‌గ్గించుకుంటే మంచిద‌న్న వాద‌న ఇప్పుడు కాస్తంత బ‌లంగానే వినిపిస్తోంది.