Begin typing your search above and press return to search.

కేసీఆర్ నే ఢీకొని ఎటూ కాకుండా పోయాడు

By:  Tupaki Desk   |   30 Jan 2020 5:23 AM GMT
కేసీఆర్ నే ఢీకొని ఎటూ కాకుండా పోయాడు
X
తెలంగాణ లో ఇప్పుడు అత్యంత బలవంతుడు ఎవరయ్యా అని చిన్న పిల్లాడిని అడిగినా ‘బక్కపలుచని కేసీఆర్ సార్’ అంటూ ఠక్కున చెప్పేస్తారు. అలాంటి గులాబీ దళపతి తోనే తలపడితే ఏమవుతుంది.. రెంటికి చెడ్డ రేవడి అవుతుంది. పైగా టీఆర్ఎస్ లో ఉంటూనే ఆ పార్టీకి అసమ్మతి గా మారి కేసీఆర్ పక్కలో బల్లెంలా తయారైతే ఊరుకుంటాడా? ఇప్పుడు మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత జూపల్లి కృష్ణరావు పరిస్థితి అలానే తయారైందట..

కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిస్థితి ఇప్పుడు ఎటూ కాకుండా అయిపోయింది. ఉద్యమంలో మంత్రి పదవి త్యాగం చేసి మరీ కేసీఆర్ తో కలిసి మొదటి ప్రభుత్వంలో కేబినెట్ మంత్రి అయిన జూపల్లి రెండోసారి గెలవక పోవడంతో ఏ పదవి దక్కించుకో లేకపోయారు. అయితే ఈయనను ఓడించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరడం జూపల్లికి శరాఘాతమైంది.

మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకే కేసీఆర్, కేటీఆర్ ఫుల్ పవర్స్ ఇవ్వడంతో జూపల్లి డమ్మీ అయిపోయాడు. తనకు , తనవారికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై తిరుగుబాటు చేసి కొల్లాపూర్ మున్సిపాలిటీలో రెబల్స్ ను దించి గెలిపించుకున్నాడు. ఆ రెబల్స్ తో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ ను కలిసి తిరిగి గులాబీ పార్టీలో కొనసాగుదామనుకున్నారు.

కానీ టీఆర్ఎస్ అధిష్టానం జూపల్లికి షాకిచ్చింది. ప్రజల మద్దతు సంపాదించిన జూపల్లికి అధిష్టానం మద్దతు మాత్రం దక్కలేదు. తమనే ధిక్కరించిన జూపల్లిని క్షమించేంది లేదని కేసీఆర్ , కేటీఆర్ అనడంతో ఇప్పుడు జూపల్లి ఎటూ కాకుండా పోయారు. రాజకీయ భవిష్యత్ కూడా అంధకారంలో పడిపోయింది. జూపల్లి ఏం చేస్తాడనేది ఆసక్తిగా మారింది.