Begin typing your search above and press return to search.

ఎప్పుడేం చేయాలో తెలీదా కేసీఆర్?

By:  Tupaki Desk   |   7 May 2016 5:18 AM GMT
ఎప్పుడేం చేయాలో తెలీదా కేసీఆర్?
X
ప్రచార మాధ్యమాలు పెద్దగా పట్టించుకోలేదు కానీ గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒక్కసారిగా విరుచుకుపడిన గాలి.. వానలతో హైదరాబాద్ మహానగరం చిగురుటాకులా వణికిపోయింది. గంటల వ్యవధిలో కురిసిన భారీ వర్షాన్ని సెంటీమీటర్లతో కొలిస్తే అది దాదాపు 8 సెంటీమీటర్లుగా అధికారులు లెక్క తేల్చారు. మూడు గంటల వ్యవధిలో ఏడు సెంటీమీటర్ల వర్షపాతం కురవటం గమనార్హం.

ఇటీవల కాలంలో ఇంత స్వల్పవ్యవధిలో ఇంత భారీ వర్షం కురవటం.. అది కూడా మహానగరం మొత్తం కావటం మరో విశేషంగా చెప్పాలి. మహానగరి నెత్తి మీద ఉన్న ఆకాశానికి చిల్లుపడినట్లుగా కురిసిన వర్షం నగర జీవికి భయానక అనుభవాన్ని మిగిల్చింది. అర్థరాత్రి వేళ ఈ వర్షం కురిసింది కాబట్టి సరిపోయింది కానీ.. అదేదో ఉదయమో.. మధ్యాహ్నమో.. సాయంత్రమో అయితే పరిస్థితి దారుణంగా ఉండేదనటంలో సందేహం లేదు.

గడిచిన కొన్నేళ్లుగా కిలో మీటర్ల దూరంలో ఒకచోట వర్షం దంచి కొడితే మరోచోట వాన చినుకు జాడ లేకుండా ఉండే పరిస్థితి. అందుకు భిన్నంగా.. నగరమంతా ఒకే యూనిట్ అన్న చందంగా వానదేవుడు తాట తీసేలా చెలరేగిపోవటంలో నగరం మొత్తం అస్తవ్యస్తమైంది. గాలి.. వాన తీవ్రతను కొన్ని అంకెల్లో చెప్పాల్సి వస్తే.. ఒక్క హైదరాబాద్ మహానగరంలో కూలిన విద్యుత్ స్తంభాలు 679. కూలిన చెట్లు 324. వర్షం నీటితో మునిగిన ప్రాంతాలు 229. రోడ్ల మీద భారీగా గుంతలు పడిన ప్రాంతాలు 116. ఇప్పుడు చెప్పినవన్నీ అధికారిక లెక్కలు. ఇక.. అనధికారలెక్కలు ఎలా ఉంటాయో చూస్తే..

హైదరాబాద్ మహానగరంలో గురువారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో మొదలైన సుడిగాలితో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తెల్లవారుజామున ఆరు గంటల సమయంలో కేవలం 10 శాతం ప్రాంతాల్లోనే కరెంటు ఉన్న పరిస్థితి. 90శాతం ప్రాంతాల్లో కరెంటు జాడే లేదు. తెలతెలవారుతుండగా విద్యుత్ అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే పనులు చేపట్టగా.. మధ్యాహ్నం 12 గంటల సమయానికి చాలా కొద్ది ప్రాంతాల్లో మాత్రమే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించగలిగారు. సాయంత్రం 5 గంటల ప్రాంతానికి నగరంలో దాదాపు 60 శాతం మేర విద్యుత్ సరఫరా పూర్తి అయినట్లుగా చెబుతున్నారు. అంటే.. హైదరాబాద్ మహానగరంలో భారీ గాలుల కారణంగా పోయిన కరెంటు నగరంలోని 60 శాతం మందికి రావటానికిపట్టిన సమయం 15 గంటలకు పైనే అన్నమాట. నగరంలో ఇన్నేసి గంటలు కరెంటు లేకపోతే పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదు.

విద్యుత్ సరఫరా లేకపోతే అపార్ట్ మెంట్లలోకి నీళ్లను పంప్ చేసే వీలు ఉండదు. లిఫ్ట్ లు పని చేయవు. దీంతో పెద్ద వయస్కులు బయటకు రాలేని పరిస్థితి. విద్యుత్ సరఫరా లేని నేపథ్యంలో పలు వస్తు సేవలు నిలిచిపోయే పరిస్థితి. ఏదో విషయం దాకా ఎందుకు ఉదయాన్నే 6 గంటలకు వచ్చే న్యూస్ పేపర్ శుక్రవారం ఉదయం 10 గంటల తర్వాతే ఇంటికి రావటం చూస్తే.. పరిస్థితి ఎంత అస్తవ్యస్తంగా ఉందో ఇట్టే చెప్పేయొచ్చు. ఇక్క న్యూస్ పేపర్ మాత్రమే కాదు.. పాల ప్యాకెట్ తో మొదలయ్యే సందడి షురూ కావటానికి 9 గంట దాటిన తర్వాత మాత్రమే మొదలైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. లోతట్టు ప్రాంతాలు జలయమం కావటం.. వాననీటితో కాలనీలు దిగ్భందం కావటం లాంటి సమస్యల గురించి.. వాటి కారణంగా నగరజీవులు పడ్డ కష్టం ఇంతాఅంతా కాదు.

దాదాపు కోటి మందికి పైగా ప్రజలు నివాసం ఉన్న హైదరాబాద్ నగరం వర్షం కారణంగా వణికిపోతే.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం చేయాలి? ఎలా వ్యవహరించాలి? సహాయక చర్యలు ఎంత వేగంగా మొదలు కావాలి? లాంటి ప్రశ్నలు వేసినప్పుడు సర్కారు డొల్లతనం ఇట్టే అర్థం కాక మానదు. నిజానికి విద్యుత్ అధికారులు తమకు తాముగా స్పందించి వేగంగా రియాక్ట్ అయ్యారు కాబట్టి సరిపోయింది కానీ.. వారే మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా హైదరాబాదీయులకు ఈ వీకెండ్ సినిమా కనిపించేదనటంలో మరో మాట లేదనే చెప్పాలి.

ఊహించని విధంగా వానదెబ్బతో నగరజీవులు విలవిలలాడుతున్న వేళ.. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరగాల్సిన సమయంలో.. సాయం కోసం ఎదురుచూస్తున్న వారికి భరోసా కలిగించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరించాల్సింది. కానీ.. ఆయన అందుకు భిన్నంగా వివిధ జిల్లాల కలెక్టర్లు.. అధికారులు.. వాస్తు నిపుణులు.. అర్కిటెక్ట్ లతో కలిసి ఒక సమావేశం పెట్టుకున్నారు. ఇంత మంది అధికారులతో కలిసి కేసీఆర్ పెట్టుకున్న మీటింగ్ దేని గురించి అంటే.. త్వరలో పెరిగే తెలంగాణ జిల్లాల్లో నిర్మించాల్సిన కొత్త కలెక్టరేట్లు ఎలా ఉండాలన్నఅంశంపై సుదీర్ఘంగా చర్చ సాగింది. ఓపక్క ప్రకృతి విపత్తుతో నగర జీవి విలవిలలాడిపోతుంటే.. మరోవైపు ముఖ్యమంత్రి భవిష్యత్ లో ఏర్పడే జిల్లాల్లోని ప్రధాన కేంద్రాల్లో కలెక్టరేట్లు ఎలా ఉండాలన్న కార్యాచరణ మీద ఫోకస్ చేయటం ఏమిటో ఒక పట్టాన అర్థం కాదు. ఎప్పుడు ఎలాంటి చర్చ చేయాలన్న విషయాన్ని కేసీఆర్ లాంటి మేధావికి మరొకరు చెప్పాల్సిన అవసరం ఉందా? వేలెత్తి చూపించాలా..?