Begin typing your search above and press return to search.

మ‌మ‌త‌కు సీఎంల మ‌ద్ద‌తు పెరుగుతోంది కేసీఆర్ సార్?

By:  Tupaki Desk   |   4 Feb 2019 6:39 AM GMT
మ‌మ‌త‌కు సీఎంల మ‌ద్ద‌తు పెరుగుతోంది కేసీఆర్ సార్?
X
ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజ‌కీయాల గురించి అదే ప‌నిగా అప్పుడ‌ప్పుడు మాట్లాడే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సారు వారికి మ‌హా ఇబ్బంది ఒక‌టి వ‌చ్చి ప‌డింది. ఏదైనా స‌రే.. తాను అనుకున్న ప్లాన్ ప్రకార‌మే జ‌ర‌గాలే త‌ప్పించి.. ఏదో జ‌రిగితే.. మ‌రేదేలో మాట్లాడ‌టం.. రియాక్ట్ కావ‌టం కేసీఆర్‌ కు బొత్తిగా ఇష్టం ఉండ‌దు. స్కెచ్ త‌న‌ది అయి ఉండాలే కానీ.. వేరే వారి స్కెచ్ లో తాను పార్టిసిపేట్ చేయ‌టం ఏమిట‌న్న‌ట్లుగా ఆయ‌న వ్య‌వ‌హార‌శైలి ఉంటుంద‌ని చెబుతుంటారు.

కేసీఆర్ చెప్పే ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ కు లక్ష్యం ఏమిటి? దుర్మార్గ కాంగ్రెస్‌.. దుష్ట బీజేపీల‌కు భిన్నంగా.. దేశంలోని బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీల‌న్ని ఏక‌తాటి మీద‌కు వ‌చ్చి అధికారాన్ని చేజిక్కించుకోవ‌టం. అంతే కాదు.. కేంద్రం చేసే పెద్ద‌న్న పెత్తనాన్ని త‌గ్గించి.. రాష్ట్రానికి నిధులు.. అధికారాలు పెరిగేలా నిర్ణ‌యాలు తీసుకోవాలి.

దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 70 ఏళ్లు అవుతున్నా.. విద్య‌.. వైద్యం.. ఆర్థిక అంశాల్లో ఎంత దారుణ ప‌రిస్థితుల్లో ఉన్నామో చెబుతూ.. త‌న బంగారు క‌ల‌ల్ని చెప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటారు కేసీఆర్‌. మ‌రి.. అలాంటి పెద్ద మ‌నిషికి ఇవాల్టి రోజున ప‌శ్చిమ‌బెంగాల్ లోని మ‌మ‌త ప్ర‌భుత్వానికి చుక్క‌లు చూపించేలా మోడీ స‌ర్కారు వ్య‌వ‌హ‌రించ‌టం.. దానికి దీదీ అప‌ర కాళికావ‌తారం ఎత్తి కేంద్రంపై పోరాడుతున్న‌ప్పుడు ఫెడ‌ర‌ల్ కేసీఆర్ రియాక్ట్ కావాలిగా.

ఓప‌క్క బెంగాల్ లో జ‌రుగుతున్న ప‌రిణామాల నేప‌థ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఒక‌రి త‌ర్వాత ఒక‌రుగా దీదీకి త‌మ మ‌ద్ద‌తు చెబుతున్న పరిస్థితి. బీజేపీ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు మిన‌హాయించి ముఖ్య‌మైన రాష్ట్రాల సీఎంలంతా త‌మ గొంతును విప్పారు.

ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్‌..ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో పాటు.. క‌శ్మీర్ మాజీ ముఖ్య‌మంత్రి ఒమ‌ర్ అబ్దుల్లా.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఎన్సీపీ నేత ఫ‌రూక్ అబ్దుల్లాతో పాటు.. స‌మాజ్ వాదీ పార్టీ అఖిలేష్ త‌దిత‌రులు దీదీకి ఇప్ప‌టికే త‌మ సంఘీభావాన్ని తెలిపారు. తాజాగా క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి సైతం ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రికి త‌న మ‌ద్ద‌తు తెలిపారు.

ఇలా ఎవ‌రికి వారు.. త‌మ‌కు తాముగా ముందుకొచ్చి మ‌ద్ద‌తు ప‌లుకుతున్న వేళ‌.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మాత్రం మౌనంగా ఉండ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో ఏదేదో చేస్తాన‌ని చెప్పే కేసీఆర్‌.. ప‌శ్చిమ‌బెంగాల్ లో చోటు చేసుకున్న ఘ‌ట‌న‌ల సంద‌ర్భంలో కామ్ గా ఉండ‌టం ఆయ‌న ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేస్తుంద‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌హా తెలివైన నేత‌గా పేరున్న కేసీఆర్.. ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉన్న‌ట్లు? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.