Begin typing your search above and press return to search.

ఆత్మహత్యలు పట్టని కేసీఆర్

By:  Tupaki Desk   |   13 Sep 2015 11:14 AM GMT
ఆత్మహత్యలు పట్టని కేసీఆర్
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతు ఆత్మహత్యలు ఏమాత్రం పట్టడం లేదు. అసలు వాటి గురించి ఆయన పట్టించుకోవడం కూడా పట్టించుకోవడం లేదు. సాధారణంగా రోజుకు ఇన్ని ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే ప్రభుత్వాలు వెంటనే స్పందిస్తాయి. నివారణ చర్యలు చేపడతాయి. రైతుకు భరోసా ఇవ్వడానికి ప్రయత్నిస్తాయి. వారికి ఎంతో కొంత సాయం చేయడానికి ముందుకు వస్తాయి. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఇందుకు పూర్తి భిన్నం.

ఆత్మహత్యలను పట్టించుకోకపోవడం ఒక ఎత్తయితే.. అవి అసలు రైతు ఆత్మహత్యలే కావని నిరూపించడానికి ప్రభుత్వమే ప్రయత్నించడం దేశ చరిత్రలోనే ఎవరూ చేయని సాహసమని ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. రైతు ఆత్మహత్యలపై విచారణ జరపడం ఎక్కడైనా ఉంటుందని, కానీ ముఖ్యమంత్రి కార్యాలయం పేరిట అది రైతు ఆత్మహత్య కాదని ప్రకటించడం విడ్డూరమని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కేసీఆర్ రైతు ఆత్మహత్యలను పట్టించుకోకపోవడానికి ప్రతిపక్షాలు ఒక ఆసక్తికరమైన కథనాన్ని వినిపిస్తున్నాయి.

కేసీఆర్ కూడా రైతే కదా. ఆయన ఎకరాకు ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు కూడా. తాను కష్టపడి సాగు చేసుకుని ఎకరానికి ఏడాదికి కోటి రూపాయలు సంపాదించుకుంటుంటే.. దానిపై చేసిన అప్పులను ఒక్క దెబ్బతో తీర్చేసుకుంటుంటే.. ఈ రైతులకు ప్రభుత్వాలు ఇన్ని సాయాలు చేస్తున్నా ఎందుకు నష్టం వస్తోందన్నది ఆయన ఆలోచనగా చెబుతున్నారు. వ్యవసాయం నష్టం కానే కాదని, తనకు మల్లేనే రైతులకు కూడా సాగులో లాభాలు వస్తున్నాయని భావిస్తున్నారని చెబుతున్నారు. అందుకే వ్యవసాయ కారణాలతో కాకుండా ఇతరేతర కారణాలతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కేసీఆర్ భావిస్తున్నారని, అందుకే వాళ్లను పట్టించుకోవడం లేదని ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి.