Begin typing your search above and press return to search.

విపక్షాల్ని కలిసేందుకు కేసీఆర్ కు ఇష్టం లేదా?

By:  Tupaki Desk   |   8 Aug 2015 5:45 AM GMT
విపక్షాల్ని కలిసేందుకు కేసీఆర్ కు ఇష్టం లేదా?
X
ఎంతో ప్రేమను కురిపించే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. అదే స్థాయిలో అందుకు భిన్నంగా వ్యవహరించే సత్తా సొంతం. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. తోటి రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ముఖ్యమంత్రిని కలిసేందుకు వెళితే.. వారిని వెంటనే పిలవటం.. మాట్లాడటం..వారు చెప్పే మాటల్ని వినటం లాంటివి మాత్రమే చూసిన నేతలకు.. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి చూసి విస్తుపోతున్నారు.

శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి.. మున్సిపల్ కార్మికుల సమస్యతో పాటు.. కరవు అంశాల మీద మాట్లాడటం.. ఆయనకు వినతి పత్రం ఇవ్వాలని భావించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్.. టీటీడీపీ..వైఎస్సార్ కాంగ్రెస్.. వామపక్షాల నేతలు కలిసి.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు సచివాలయంలోని ఆయన ఛాంబర్ వద్దకు చేరుకున్నారు.

అన్నీ పార్టీల నేతలు ముఖ్యమంత్రిని కలవాలని వస్తే.. వారికి వెంటనే లోపల నుంచి పిలుపు రావటం సహజం. కానీ.. అందుకు భిన్నంగా వారికి ఎలాంటి పిలుపు రాకుండా గడియారం ముల్లు కదిలిపోవటం వారికి మొదట విసుగ్గా.. అనిపించినా.. తమను కలిసే ఉద్దేశం ముఖ్యమంత్రికి లేదన్న విషయం అర్థమైన నేతలు విస్తుపోయే పరిస్థితి.

దీంతో మండిపడిన నేతలు.. ఆయన కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. విపక్షాలను కలుసుకునేందుకు సైతం ముఖ్యమంత్రి సిద్ధంగా లేరని.. ఆయన నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానిస్తూ ధర్నా చేశారు. దీంతో సీన్లోకి ఎంటర్ అయిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకొని బయటకు వెళ్లారు. మొత్తానికి విపక్ష నేతల్ని కలుసుకునేందుకు కూడా సుముఖత వ్యక్తం చేయకుండా షాకిచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి వర్యులకు విపక్షాలు అంటే అంత మంటా..?