Begin typing your search above and press return to search.

జెండా పాతేశామన్నప్పుడు సీట్ల మాటేంటి?

By:  Tupaki Desk   |   29 Jan 2016 11:30 AM GMT
జెండా పాతేశామన్నప్పుడు సీట్ల మాటేంటి?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియా సమావేశంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేసిందని.. గ్రేటర్ మీద గులాబీ జెండా ఎప్పుడో ఎగిరిందంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ పూర్తి కాకముందే గెలుపు గురించి మాట్లాడేయటం.. విజయం సాధించేశామని చెప్పేయటం విశేషం.

గెలుపు మీద ఇంత ధీమాగా మాట్లాడుతున్న కేసీఆర్.. గ్రేటర్ లో తమ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందన్న విషయాన్ని మాత్రం చెప్పకపోవటం గమనార్హం. విజయం మీద అంత నమ్మకం ఉండి.. గ్రేటర్ కోట మీద గులాబీ జెండా పాతేశామని సగర్వంగా ప్రకటించేసిన కేసీఆర్.. అదే రీతిలో తాము వంద సీట్లు గెలుస్తామనో.. లేదంటే 90 సీట్లు గెలుస్తామనో చెప్పేయొచ్చు కదా.

గెలుపు మీద నమ్మకం ఉన్నా? ఎన్ని సీట్లు గెలుస్తామన్న విషయంలో మాత్రం కేసీఆర్ కు గురి కుదరలేదన్నట్లుగా ఉంది తాజా వ్యవహారం. తమకున్న ఎక్స్ అపీషియో సభ్యులతో పాటు.. మజ్లిస్ తమ మిత్రపక్షమని తేల్చేసిన కేసీఆర్.. సీట్ల విషయంలో మాత్రం క్లారిటీ లేదన్న అభిప్రాయం ఆయన మాటలు వింటే కలుగుతుంది. గెలుపు ఖరారైనప్పటికీ అది తమ సొంత గెలుపా? మిత్రపక్షంతో సాధించే గెలుపా అన్నది స్పష్టత లేని కారణంగానే కేసీఆర్ తాము సాధించే సీట్ల సంఖ్యను తేల్చి చెప్పనట్లుగా కనిపిస్తోంది.