Begin typing your search above and press return to search.

మోడీకి కేసీఆర్‌ కూ గ్యాప్ పెరుగుతోందా?

By:  Tupaki Desk   |   14 Dec 2015 8:47 AM GMT
మోడీకి కేసీఆర్‌ కూ గ్యాప్ పెరుగుతోందా?
X
​పీఎంవోకి తెలంగాణ సీఎంవోకీ మ‌ధ్య దూరం రోజు రోజుకు పెరుగుతోందా .. సీఎం కేసీఆర్‌ కు ప్ర‌ధాని మోడీకి గ్యాప్ పెద్ద‌వుతుందా అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. కేసీఆర్‌ కు ప్ర‌ధాని మోడీతో భేటీ అయ్యేందుకు అపాయింట్‌ మెంట్ ఎందుకు ఇవ్వ‌లేన్న ప్ర‌శ్న‌లు కూడా వ‌స్తున్నాయి. మ్యాట‌ర్ ఏంటంటే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లారు. అక్క‌డ ఆయ‌న తెలంగాణ రాష్ర్ట అభివృద్ధి కోసం ప‌లువురు కేంద్ర మంత్రుల‌ను క‌లిశారు. అలాగే రాష్ర్ట స‌మ‌స్య‌ల గురించి కూడా వారికి వివ‌రించి స‌హాయం చేయ‌మ‌ని విజ్ఞ‌ప్తి చేశారు. అలాగే తెలంగాణ సంక్షేమం కోసం తాను నిర్వ‌హించే అయుత చండీయాగానికి హాజరుకావాలంటూ వెంకయ్య సహా పలువురు కేంద్రమంత్రులకు ఆహ్వాన‌ప‌త్రాలు కూడా ఇచ్చారు.

అయితే త‌ర్వాత కేసీఆర్ ప్రధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీని కూడా క‌లవాల‌ని ట్రై చేశారు. కేవ‌లం 10 నిమిషాల పాటు మోడీని క‌లిసేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం పీఎంవోను ఎన్ని సార్లు కోరినా... ఏవో కారణాలు చెబుతూ పీఎంవో కార్యాల‌యం కేసీఆర్‌ కు మోడీ అపాయింట్‌ మెంట్ నిరాక‌రించింద‌ట‌. అయితే కేసీఆర్‌ ను క‌లిసేందుకు మోడీ ఇష్ట‌ప‌డ‌లేద‌ని...అందుకే పీఎంవో కార్యాల‌యం ఆయ‌న‌కు అపాయింట్‌ మెంట్ ఇచ్చేందుకు నిరాక‌రించింద‌ని స‌మాచారం.

రీసెంట్‌ గా కేసీఆర్ మోడీని క‌లిసేందుకు చాలాసార్లు ట్రై చేస్తున్నా పీఎం అపాయింట్‌ మెంట్ మాత్రం రావ‌డం లేద‌ని తెలుస్తోంది. ఆ ఎఫెక్ట్‌ తోనే తెలంగాణ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లో ప్రధాని కార్యక్రమాలపై విమర్శలు చేయడానికి కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు. వ‌రంగ‌ల్ ఎన్నిక‌ల త‌ర్వాత కూడా కేసీఆర్‌ తో పాటు కేటీఆర్ మోడీతో పాటు ఎన్డీయే ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. తాము అధికారంలోకి వ‌చ్చాక తెలంగాణ‌లో వ‌రుస విజ‌యాలు సాధిస్తున్నామ‌ని..అదే మోడీకి ఢిల్లీతో పాటు బీహార్‌ లో కూడా ప్ర‌జ‌లు బుద్ధి చెప్పార‌ని ఈ తండ్రి కొడుకులు విమ‌ర్శ‌లు గుప్పించారు.

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ ఘోయ‌ల్ కూడా గ‌తంలో కేసీఆర్‌ ను క‌లిసేందుకు టైం లేద‌ని చెప్పి షాక్ ఇచ్చారు. అలాగే వెంక‌య్య‌నాయుడు ఇటీవ‌ల త‌న శాఖ నుంచి మంజూరైన ఇళ్ల‌లో ఏపీకి అత్య‌ధికంగా ఇచ్చి...తెలంగాణ‌కు చాలా త‌క్కువ కేటాయించ‌డంపై కూడా తెరాస నాయ‌కులు విరుచుకుప‌డ్డారు. ఈ వాతావ‌ర‌ణం చూస్తుంటే తెరాస‌తో పాటు బీజేపీ మ‌ధ్య చాలా గ్యాప్ ఉంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. అలాగే కేసీఆర్‌ కు మోడీకి మధ్య ఉన్న గ్యాప్ అంతకంతకూ పెరుగుతున్నట్టే కనిపిస్తోంది. ఇది ఎంతవ‌ర‌కూ దారితీస్తుందో చూడాలి.