మంత్రాలకు చింతకాయలు రాలతాయో లేదు కానీ.. నమ్మకాల పెద్దపీట వేసే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం సెక్రటేరియట్ ముఖం చూసేందుకు కూడా ఇష్టపడటం లేదన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యమంత్రి అధికారిక కార్యాలయం ఉన్న సచివాలయంలోని సమతా బ్లాక్ కు ఆయన ఇప్పుడు చుట్టపు చూపు అయ్యారు. జూన్ 23న సచివాలయానికి అలా వచ్చి.. ఇలా వెళ్లిపోయిన కేసీఆర్.. అప్పటి నుంచి ఇప్పటివరకూ సచివాలయం దిక్కు చూసింది లేదు. దాదాపు ఇరవై రోజుల వ్యవధిలో ఆయన ఒక్కరోజు వచ్చింది లేదు. గడిచిన నెల రోజుల్లో మూడంటే మూడు రోజులు మాత్రమే కేసీఆర్ సచివాలయానికి రావటం గమనార్హం.
ఎందుకిలా అంటే అందరి నోట వినిపించే ఒకేఒక్క మాట.. వాస్తు సరిగా లేదని. సచివాలయం వాస్తు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏ మాత్రం సూట్ కాదని.. ఆయన నమ్మిన పండితులు చెప్పటంతో.. ఆ దిక్కుకు వెళ్లటానికి కూడా ఇష్టపడటం లేదు. అంతేకాదు..గత ముఖ్యమంత్రులు ఉపయోగించిన క్యాంపు కార్యాలయానికి సైతం తాళం వేసిన పరిస్థితి.
ఏదైనా సమీక్షా సమావేశాలు నిర్వహించాలంటే సచివాలయంలో కాకుండా.. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహించటానికి కేసీఆర్ మొగ్గు చూపుతున్నారు.
ఇప్పుడున్న సచివాలయం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏ మాత్రం సూట్ కాదని.. దీనికి నిదర్శనంగా పలు ఉదంతాల్ని ఉదహరిస్తున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కొత్తల్లోనే సీఎంకు వ్యక్తిగత కార్యదర్శిగా పని చేసిన సంతోష్ కుమార్ అనారోగ్యంగా మరణిస్తే..తర్వాత సీఎం కార్యాలయంలో పీఆర్వోగా పని చేసిన విజయ్ కుమార్ రోడ్డు ప్రమాదంలో గాయలపాలయ్యారు. ఇలా ఏదో ఒక చికాకుతో పాటు.. తెలిసిన వాస్తు పండితులు సచివాలయానికి దూరంగా ఉండాలని సూచించటంతో సెక్రటేరియట్ కు వెళ్లకుండా ఉంటున్నారు.
ముఖ్యమంత్రి ఆపీసుకు వెళ్లకపోవటంతో.. మంత్రులదీ అదే దారిగా మారిందన్న భావన వ్యక్తమవుతోంది. ముఖ్యమైన ఫైళ్లు మినహా..మిగిలిన ఫైళ్లు అన్నీ గుట్టలు.. గుట్టలుగా పేరుకొని ఉన్నాయని చెబుతున్నారు. మరోవైపు కొత్త సచివాలయానికి ఎంత వర్క్ వుట్ చేసినా.. ఏదో ఒక ఇష్యూ వచ్చి ఆగిపోతున్న పరిస్థితి. ఇక.. మధ్యేమార్గంగా ఒక విధానాన్ని అనుసరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
వాస్తు నిపుణులు సూచించిన దాని ప్రకారం.. సమతా బ్లాక్ నుంచి బయటకు వెళ్లే దారిలో ఏడమ వైపు వెళ్లటం ఏ మాత్రం సరికాదన్న సూచనతో.. ఐలాండ్ ను కుదించి.. నేరుగా వాహనం వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం యుద్ధప్రాతిపదికన రోడ్లు వేస్తున్నారు. మరి.. దీని తర్వాత అయినా వాస్తు పక్కాగా సూట్ అవుతుందా? లేక.. ఇంకేమైనా శంకలు పట్టి పీడిస్తాయా..?