Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ నేత‌లు కూడా మ‌ద్ద‌తివ్వ‌కుండా చేస్తున్నావేం కేసీఆర్‌

By:  Tupaki Desk   |   15 April 2018 6:18 AM GMT
టీఆర్ ఎస్ నేత‌లు కూడా మ‌ద్ద‌తివ్వ‌కుండా చేస్తున్నావేం కేసీఆర్‌
X
ఔను. నిజంగా మీరు చ‌దివింది కరెక్టుగానే ఉంది. టీఆర్ ఎస్ నేత‌ల మ‌ద్ద‌తు కూడా కోల్పోయేలా ఆ పార్టీ అధినేత‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేస్తున్నార‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఉద్య‌మ‌కాలంలో స‌బ్బండ వ‌ర్గాల‌ను క‌లుపుకొని సాగిన కేసీఆర్ శైలి ఇప్పుడు పూర్తిగా మారిపోయింద‌ని, తానకు ఒక్క‌డినే స‌ర్వ‌స్వం అనే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని పేర్కొంటున్నారు. తాజాగా అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా వ‌చ్చిన కామెంట్ల నేప‌థ్యంలో ఈ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇంత‌కీ అస‌లేం జ‌రిగిందంటే..అంబేద్క‌ర్ జ‌యంతికి సీఎం కేసీఆర్ గైర్హాజ‌రు అవ‌డం.

రాజ్యాంగ నిర్మాత‌గా అంద‌రితో కీర్తించ‌బ‌డే అంబేద్క‌ర్ జ‌యంతికి కేసీఆర్ దూరంగా ఉండ‌టం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. స‌హ‌జంగానే ప్ర‌ధాన‌ప్ర‌తిప‌క్ష‌మైన కాంగ్రెస్ విరుచుకుప‌డుతోంది. బీజేపీ - టీడీపీలు సైతం త‌ప్పుప‌డుతున్నాయి. త‌న రాజ‌కీయ అవ‌స‌రాల కోసం కోల్‌ క‌తాకు - బెంగ‌ళూరుకు వెళ్లేందుకు - ప్ర‌త్యేక విమానాల్లో ప‌ర్య‌టించేందుకు ఆస‌క్తి చూపించే కేసీఆర్‌ కు అంబేద్క‌ర్‌ కు నివాళి అర్పించే తీరిక లేదా అంటూ ప్ర‌శ్నిస్తున్నారు. ద‌ళితుడిని సీఎం చేస్తాన‌న్న సీఎం కేసీఆర్ ఆ హామీని నిల‌బెట్టుకోగ‌పోగా..ద‌ళిత జ‌న‌బాంధ‌వుడైన అంబేద్క‌ర్ విష‌యంలో ఇలాంటి నిర్ల‌క్ష్య‌పూరిత వైఖ‌రి ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో టీఆర్ ఎస్ శ్రేణులు సైతం త‌మ నాయ‌కుడికి మ‌ద్ద‌తుగా మాట్లాడ‌లేని ప‌రిస్థితి ఉందంటున్నారు.

కాగా, అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకొని ఈ నాలుగేళ్లలో ఏ ఒక్క సారైనా అంబేద్కర్‌ కు దండ వేశారా అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును అంబేద్కర్‌ జయంతి అధికార ఉత్సవాల్లో దళిత సంఘాల నేతలు ప్రశ్నించారు. అంబేద్కర్‌ దళితుడు అయినందునే దండ వేయడానికి సీఎం ఇష్టపడటం లేదని విమర్శించారు. దళిత వ్యతిరేక ప్రభుత్వాలైనా కేంద్రంలోని బీజేపీ - రాష్ట్రంలోని టీఆర్ఎస్‌ పార్టీలను గద్దె దించాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్‌ 127వ జయంతిని పురస్కరించుకొని శనివారం ట్యాంక్‌ బండ్‌ పైనున్న అంబేద్కర్‌ విగ్రహం వద్ద అంబేద్కర్‌ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మెన్‌ పిడమర్తి రవి - బీసీ కమిషన్‌ చైర్మెన్‌ బీఎస్‌ రాములుతో పాటు దళిత సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాల మహ నాడు అధ్యక్షుడు జి చెన్నయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడినే ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్‌.. ముఖ్యమంత్రి మాట అటుంచితే కనీసం తాను సీఎం అయ్యాక కూడా ఒక్క సారి కూడా అంబేద్కర్‌ కు దండ వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో దళితులపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో దళితులకు సుఖం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మ‌రో ద‌ళిత‌న నాయ‌కుడు లింగస్వామి మాట్లాడుతూ దళితులకే కాదు.. దళిత సంఘాల నేతలను కూడా అరెస్టు చేసి జైల్లో పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ దళిత వ్యతిరేకి అని విమర్శించారు. అట్రాసిటీ కేసులను పోలీసులు నీరు గారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.