Begin typing your search above and press return to search.

కేసీఆర్ నెక్ట్స్ స్టెప్ ఏంటో తెలుసా?

By:  Tupaki Desk   |   13 Oct 2016 9:03 AM GMT
కేసీఆర్ నెక్ట్స్ స్టెప్ ఏంటో తెలుసా?
X
కొత్త జిల్లాల ఏర్పాటుతో ఫుల్ జోష్‌ లో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు రాష్ట్రంలో త‌న ప‌ట్టు బిగించేందుకు మ‌రిన్ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్లు తెలుస్తోంది. జిల్లాల ఏర్పాటులో వ్య‌తిరేక‌త‌ను ప‌రిమిత స్థాయికి కుదించిన కేసీఆర్ తద్వారా పొందిన మైలేజీని త‌న ఇమేజ్ పెంచుకునే రీతిలో ఉప‌యోగించుకుంటారిన పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. ఇదంతా కేసీఆర్ క్షేత్రస్థాయి పర్యటన గురించిన విష‌యం. ఎప్పటి కప్పుడు వాయిదా పడుతూ వస్తోన్న సీఎం కేసీఆర్‌ క్షేత్రస్థాయి పర్యటన త్వరలోనే ఉండనుందని స‌మాచారం.

క్షేత్ర స్థాయి పర్యటనపై కేసీఆర్‌ ఒక క్లారిటీకి వచ్చారని విశ్వసనీయ వర్గాల స‌మాచారం. ఇందుకు గానూ ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నట్లు సమాచారం. సీఎం కేసీఆర్‌ క్షేత్రస్థాయి పర్యటనకు రూట్‌ క్లియర్‌ కావడానికి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురువడం - కొత్త జిల్లాల ఏర్పాటు - ఎప్ప‌ట్నుంచో పెండింగ్‌ లో ఉన్న నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీ ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ సమావేశాలు ముగియగానే క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్తానని, ఒక్కో జిల్లాలో రెండు మూడు రోజులు మకాం వేసి అక్కడే ఆ జిల్లా అభివృద్ధిపై అధికారులు - ప్రజాప్రతినిధులతో సమీక్షంచడమే కాకుండా ఆ జిల్లాలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడానికి క్షేత్రస్థాయి పర్యటనకు వస్తానని సీఎం కేసీఆరే స్వయంగా చెప్పారు. అయితే, ఆ కార్యక్రమం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్ర‌మంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో తెరాస పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటిన స‌మ‌యంలో మిషన్‌ భగీరథ - మిషన్‌ కాకతీయ వంటి పథకాలతో ప్రజల్లో చెరగని ముద్రను వేసుకున్న కేసీఆర్‌ ప్రభుత్వం ఒక రకంగా మంచి మార్కులనే పొందింది. అయితే, క్షేత్రస్థాయిలో పర్యటించడం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావడం, ఇంకేమైనా చేయాల్సి ఉందా? లోటుపాట్లను సరిదిద్దుకోవడం కోసం కేసీఆర్‌ క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లాలనుకున్నట్లు తెలుస్తోంది.

మార్చి నుంచి జిల్లాల పర్యటనకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సు వంటి తదితర అన్ని ఏర్పాట్లను చేసుకున్నప్పటికీ..అప్పుడు రాష్ట్రంలో ఉన్న కరవు పరిస్థితులు దృష్ట్యా జిల్లాల పర్యటనను వాయిదా వేసుకోవల్సిన పరిస్థితి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. దీనికి తోడుగా రాష్ట్రంలో టీఆర్‌ ఎస్‌ అధికారంలోకి వచ్చినా…నామినేటెడ్‌ పదవుల భర్తీ అప్పటికి మొదలు కాలేదు. కానీ, ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. రాష్ట్రంలో చాలా వరకు రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులు - మార్కెట్‌ కమిటీలకు పాలక వర్గాలను నియమించారు. మిగతా నామినేటెడ్‌ పదవుల భర్తీపై ప్రభుత్వం దృష్టి మళ్లించింది. దీనికి తోడుగా ప్రజల పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను - రెవెన్యూ డివిజ‌న్ల‌ను - మండ‌లాల‌ను ఏర్పాటు చేశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే… గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండాయి. వర్షాలతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయలో చేపట్టిన చెరువులన్నీ నిండాయి. దీంతో ప్రజలందరూ ముఖ్యంగా రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. దీంతో సీఎం కేసీఆర్‌ క్షేత్రస్థాయి పర్యటనపై మరలా దృష్టిని పెట్టారని తెలుస్తోంది. వర్షాలతో రాష్ట్రమంతా నిండుకుండలా ఉన్న దరిమిలా రైతులంగా సంతోషంగా ఉండటంతో వారిని నేరుగా కలుసుకుని వారితో మాట్లాడే విధంగా టూర్‌ను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దసరా పండుగ నాడు సీఎం కేసీఆర్‌ సొంతూరైన సిద్దిపేటలో కొత్త జిల్లాల ప్రక్రియను ప్రారంభించిన సంద‌ర్భంగా వ‌చ్చిన స్పంద‌న‌తో ఈ ప్ర‌క్రియ‌కు బీజం ప‌డింది. ఇక అక్కడి నుంచే ఆయన జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. కొత్త జిల్లాను ప్రారంభించి అక్కడి నుంచే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును సమీక్షించేలా సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లాల పర్యటన ద్వారా అటు ప్రభుత్వ, ఇటు పార్టీ తీరును తెలుసుకోవచ్చన్నది సీఎం కేసీఆర్‌ ఆలోచనగా సమాచారం. జిల్లాల పర్యటనలో పార్టీ పటిష్టతపై ప్రత్యేక దృష్టిని పెట్టనున్నట్లు తెలుస్తోంది. జిల్లా పర్యటనలో పార్టీ పటిష్టతో పాటు పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్‌ పదవుల పంపకం కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందన్ని తెలుస్తోంది. దీంతో కొంత కాలంగా నామినేటెడ్‌ పదవులు రాలేదని అసంతృప్తితో ఉన్న గులాబీలను వారిని చల్లార్చే అవకాశం ఉంది. మొత్తానికి సీఎం కేసీఆర్‌ క్షేత్రస్థాయి పర్యటన వల్ల అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీకి లాభం చేకూరేలా ఉండనున్నదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/