Begin typing your search above and press return to search.

జోనల్‌ కు జైజై..

By:  Tupaki Desk   |   30 Aug 2018 7:29 AM GMT
జోనల్‌ కు జైజై..
X
మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సాధించారు. తాను అనుకున్నది... పట్టుపట్టింది సాధించి తీరుతానని మరోసారి రుజువు చేశారు. తెలంగాణను ఎన్నాళ్ల నుంచో ఊరిస్తున్న కొత్త జోనల్ వ్యవస్ధకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో ఇక పాత జోనల్ వ్యవస్ధ పూర్తిగా రద్దు అవుతుంది. ఇకపై ఎవరి జోన్లలో... ఎవరి స్వంత గ్రామాలు, పట్టణాల్లో వారు ఉద్యోగాలు చేసుకోవచ్చు. అలాగే తమకు ఇష్టమైన ప్రాంతాలలో కూడా పని చేసుకోవచ్చు. ఎన్నికల ముందు జోనల్ వ్యవస్ధను సాధించుకుంటే ఉద్యోగుల ఓట్లు తనకు అనుకూలంగా పడతాయన్న కె.చంద్రశేఖర రావు ఆలోచనకు అంకురార్పణ జరిగింది. ఇంత వరకూ తెలంగాణలో రెండు జోన్లు, ఒక మల్టీ జోన్ మాత్రమే ఉన్నాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల అనంతరం అవి ఏడుజోన్లు, రెండు మల్టీ జోన్లగా రూపాంతరం చెందుతున్నాయి. దీని కారణంగా లక్షలాది ఉద్యోగులు, నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. కొత్త జోన్ల వ్యవస్ధ కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పెద్ద లాబీయింగే చేశారు. ఏకంగా నాలుగు సార్లు ఇదే పని మీద ఢిల్లీ వెళ్లారు. అక్కడికి వెళ్లిన ప్రతిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జోన్ల ప్రస్తావన తీసుకువస్తూనే ఉన్నారు.

చివరిగా నాలుగు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రెండు రోజుల పాటు అక్కడే ఉండి ప్రధానిని, హోంమంత్రిని, ఆర్ధిక శాఖ మంత్రిని కలిసి జోన్లపై లాబీయింగ్ చేశారు. అంతే కాదు... ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ ఏకంగా వారం రోజుల పాటు ఢిల్లీలో మకాం వేసి జోన్లకు సంబంధించి సంబంధిత అధికారులతో సమావేశం అవుతూనే ఉన్నారు. అక్కడి పరిణామాలను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి చెబుతూ ఎలాంటి చర్యలు తీసుకోవాలో వాటిని అనుసరించారు. కొత్త జోన్ల కారణంగా ఇక మీదట స్ధానికతకు పెద్ద పీట వేస్తారు. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల భర్తీలో 95 శాతం వరకూ స్థానికులకే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నత స్ధాయి ఉద్యోగాల కల్పనతో పాటు ప్రమోషన్లలో కూడా స్ధానికులకు 95 శాతం అవకాశం ఉంటుంది. దీని కారణంగా స్ధానికులు మరింత లాభ పడే అవకాశం ఉంది. గత జోనల్ వ్యవస్ధలో దీనికి పూర్తి భిన్నంగా ఉండేది. స్థానికుల కోటా కూడా పలు శాఖల్లో వివిధ విధాలుగా ఉండేది. దీంతో స్ధానికులు తమది కాని ప్రాంతంలో ఉద్యోగాలు చూసుకునే వారు.

అలాగే భార్య ఒక చోట, భర్త మరొక చోట ఉద్యోగాలు చేసేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. భార్యాభర్తలు తాము కోరుకున్న ప్రాంతంలోనే ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంది. మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఈ జోనల్ వ్యవస్ధతో ఉద్యోగులు, నిరుద్యోగుల ఓట్లను తన వైపు తిప్పుకునే లక్ష్యానికి చేరువవుతున్నారు.