Begin typing your search above and press return to search.

కేసీఆర్ న్యూ ఇయ‌ర్ టార్గెట్ ఏంటో తెలుసా?

By:  Tupaki Desk   |   31 Dec 2017 3:30 PM GMT
కేసీఆర్ న్యూ ఇయ‌ర్ టార్గెట్ ఏంటో తెలుసా?
X
కొత్త సంవ‌త్సరం నేప‌థ్యంలో...ప్ర‌తి ఒక్క‌రికీ రాబోయే ఏడాదిలో సాధించాల్సిన ల‌క్ష్యాలు, చ‌యాల్సిన ప‌నుల గురించి ఓ తీర్మానం అంటూ చేసుకుంటుంటారు. అది సామాన్యులు మొదలుకొని మాన్యుల వ‌ర‌కు సాధార‌ణం. ఈ జాబితాలో తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ కూడా చేరార‌ని టీఆర్ఎస్ వ‌ర్గాలు అంటున్నాయి. ఇప్ప‌టికే సీఎం కేసీఆర్ త‌న‌యుడైన మంత్రి కేటీఆర్ `ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండ‌టం నా కొత్త సంవ‌త్సరం తీర్మానం` అని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇదే కోవ‌లో కేసీఆర్ న్యూఇయ‌ర్ తీర్మానం ఉందంటున్నారు. అయితే అది వ్య‌క్తిగ‌త కాకుండా తెలంగాణ హితం అని చెప్తున్నారు.

ఇంత‌కీ కేసీఆర్ కొత్త సంవ‌త్సం ల‌క్ష్యం ఏంటంటే....కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించ‌డం. అవును. టీఆర్ఎస్ పార్టీ వ‌ర్గాలు ఇదే మాట చెప్తున్నాయి. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఈ ప్రాజెక్టుకుపలు రకాల అనుమతులను తెప్పించుకోవడంలో ఫలితాలు సాధించిన నేపథ్యంలో ఇకపై జాతీయ హోదా ప్రధాన అంశంగా మారింది. ఇప్పటికే పలు అనుమతులను పొందిన రాష్ట్రం మరో మూడు అనుమతులు పొందితే ఇక జాతీయహోదా డిమాండ్‌తో బాధ్యతను కేంద్రంపై పెట్టడానికి మార్గం సుగమమవుతుందని...ఇదే కేసీఆర్ 2018 ఏడాది ల‌క్ష్య‌మ‌ని అంటున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం జాతీయహోదా కల్పించినా, తెలంగాణలోని ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా కల్పించలేదు. ప్రతి రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలన్నది కేంద్ర ప్రభుత్వ విధానంగా ఉన్నందున తెలంగాణకు కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడానికి పెద్దగా అభ్యంతరం ఉండకపోవచ్చున‌ని అంటున్నారు.

ఈ ప్రాజెక్టుకు హోదాలో భాగంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు రీడిజైనింగ్ చేసి, బహుళ ప్రయోజనాలు కల్పించేలా రూపొందించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాల్సిందిగా పలు మార్లు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కాస్ట్ అప్రైజల్, ఇరిగేషన్ ప్లానింగ్, టిఎసి అనుమతులు వస్తే కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చినట్లవుతుంది. దీంతో ప్రాజెక్టు చరిత్ర సృష్టించనట్లవుతుంది. కాస్ట్ అప్రైజల్ - ఇరిగేషన్ ప్లానింగ్ అనుమతులు వచ్చిన తర్వాత కేంద్ర జలసంఘం తుది టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్సు ఇస్తుంది. జలసంఘంలోని డైరెక్టరేట్ల అనుమతులు, ఇతరత్రా అన్ని అనుమతులు వచ్చాకే జలసంఘం టిఎసి క్లియరెన్సు ఇస్తుంది. అయితే కీలకమైన అటవీ, పర్యావరణం, హైడ్రాలజీ, ఇంటర్‌స్టేట్ క్లియరెన్సులు వచ్చినందున మిగిలిన అనుమతులకు పెద్దగా ఇబ్బందులు ఉండవని రాష్ట్ర అధికారులు అభిప్రాయపడుతున్నారు. కీలకమైన అనుమతులన్నీ వచ్చినందున ఇకపై భూసేకరణ, సహా యం, పునరావాసం, అటవీ, పర్యావరణ సమస్యలు లేవనెత్తుతూ పదేపదే గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే అవకాశం లేకపోవడం ప్రభుత్వానికి పెద్ద ఊరట. టిఎసి నుంచి తుది అనుమతి రాగానే ముఖ్యమంత్రి, నీటిపారుదల మంత్రి కేంద్ర స్థాయిలోని మంత్రులు, అదికారులతో జాతీయహోదాపై చర్చిస్తారు. ప్రాణహిత చేవెళ్ల - కాళేశ్వరం ఒకటేనని కేంద్ర జలసంఘం అభిప్రాయపడుతూ ఉంది. జల సంఘం ఇంజనీర్లు సూచించిన మేరకే ప్రాజెక్టు డిజైన్‌ లో పలు మార్పులు చేయడం కలిసొచ్చే అంశంగా ఉండబోతుంది.

రూ.81 వేల కోట్ల అంచనాతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వస్తే కేంద్రం నిధులతోనే ప్రాజెక్టును పూర్తిచేయవచ్చు. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై భారీగా ఆర్థిక భారం తగ్గుతుంది. ఈ నేప‌థ్యంలో 2018లో ఇది ప్ర‌ధాన ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు చెప్తున్నారు. కేసీఆర్ ల‌క్ష్యం సాధ్య‌మ‌య్యేది మొద‌టి రెండు త్రైమాసికాల్లోనే తేలిపోతుంద‌ని కూడా విశ్లేషిస్తున్నారు.