Begin typing your search above and press return to search.

కొత్త బాదుడుకు రంగాన్ని సిద్ధం చేస్తున్నారా కేసీఆర్?

By:  Tupaki Desk   |   22 Sep 2021 2:58 AM GMT
కొత్త బాదుడుకు రంగాన్ని సిద్ధం చేస్తున్నారా కేసీఆర్?
X
తాజాగా ప్రగతిభవన్ లో రెండు కీలక శాఖలకు సంబంధించిన రివ్యూలు జరిగాయి. ఆసక్తికరంగా.. ఈ రెండు రివ్యూల అంతిమ లక్ష్యం.. అదనపు బాదుడు బాదేలా ప్రభుత్వాన్నినిర్ణయం తీసుకోమ్మని చెప్పటమే కావటం గమనార్హం. ఉన్న పన్నుల్ని పెంచకుండా.. ఎప్పటికప్పుడు సరికొత్త సంక్షేమ పథకాలతో ఆకట్టుకునే తీరు కేసీఆర్ పాలనలో కనిపిస్తూ ఉంటుంది. గత ప్రభుత్వాల్ని చూస్తే.. ఆర్టీసీ ఛార్జీలు.. విద్యుత్ ఛార్జీలన్నవి ఐదేళ్ల తమ పదవీ కాలంలో రెండు.. మూడు సార్లు చేయటం కనిపిస్తుంటుంది. కానీ.. కేసీఆర్ మాత్రం గడిచిన ఆరేళ్ల కాలంలో విద్యుత్ ఛార్జీల్ని పెంచింది లేదు.

ఆర్టీసీ ఛార్జీల్ని గతంలో పెంచినా.. లీటరు డీజీల్ రూ22 పెరిగినప్పటికీ.. ఇప్పటికి పాత టికెట్ ధరల్నే కంటిన్యూ చేయటం చూస్తే.. బాదుడుకు కేసీఆర్ కాస్త దూరమన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. తాజాగా ప్రగతిభవన్ లో ఆర్టీసీ.. విద్యుత్ శాఖల ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాల మీద సమీక్షను నిర్వహించారు. ఆర్టీసీ పరిస్థితి ఏ మాత్రం బాగోలేదని.. ఇటీవల కాలంలో లీటరు డీజిల్ మీద పెరిగిన ధరల భారం సంస్థను దారుణంగా దెబ్బ తీస్తోందని.. పెద్ద ఎత్తున నష్టాల్ని తీసుకొచ్చి పెడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆర్టీసీ సీనియర్ అధికారులంతా చెప్పుకొచ్చారు. ఒక్క హైదరాబాద్ మహానగరంలోనే నెలకు రూ.90 కోట్ల మేర ఆర్టీసీ నష్టాల్ని చవిచూస్తుందని.. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ అలాంటి పరిస్థితి నెలకొని ఉందన్న మాటను చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 97 డిపోలు ఉంటే.. అన్ని కూడా నష్టాల్నే నమోదు చేస్తున్నాయని.. ఇలాంటి పరిస్థితుల్లో నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఛార్జీలు పెంపునకు మించిన పరిష్కారం లేదన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు చబుతున్నారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ ఇతర కారణాలతో ఏకంగా రూ.3వేల కోట్ల మేర నష్టాల్లో ఉన్నట్లు చెబుతున్నారు.

వాస్తవానికి 2020 అసెంబ్లీలోనే ఆర్టీసీ ఛార్జీల్ని పెంచుతామని ప్రభుత్వం ప్రకటించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ కు అధికారులు గుర్తు చేశారు. అయితే.. కరోనా నేపథ్యంలో తలెత్తిన పరిస్థితుల కారణంగా.. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం పక్కన పెట్టింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఛార్జీలను పెంచకుంటే ఇబ్బందులు తప్పవన్న విషయాన్ని స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. ఆర్టీసీ అంశం ఇలా ఉంటే.. విద్యుత్ ఛార్జీల పెంపు విషయంలోనూ ప్రభుత్వం తక్షణం నిర్ణయం తీసుకోవాలన్న విషయాన్ని సీఎంతో చర్చించినట్లుగా చెబుతున్నారు.

విద్యుత్ శాఖను గట్టెక్కించాలంటే ఛార్జీల పెంపు తప్పనిసరిగా అధికారులు స్పష్టం చేశారు. రెండు శాఖ అధికారులు చెప్పిన మాటల్ని విన్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ఛార్జీల పెంపు అంశాన్ని కేబినెట్ లో చర్చించి చెబుతానని చెప్పి పంపేశారు. పెంపునకు సంబంధించిన ప్రతిపాదనల్ని వచ్చే మంత్రివర్గ సమావేశానికి తీసుకురావాలని.. అక్కడ చర్చించి ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తామని చెప్పారు. ఇదంతా చూస్తే.. బాదుడుకు ప్రభుత్వం సిద్ధమవుతుందా? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.