Begin typing your search above and press return to search.

సంపన్న రాష్ట్రంలో యాదాద్రి పూజలు ఇంత ఖరీదు చేస్తే ఎలా కేసీఆర్?

By:  Tupaki Desk   |   10 Dec 2021 6:33 AM GMT
సంపన్న రాష్ట్రంలో యాదాద్రి పూజలు ఇంత ఖరీదు చేస్తే ఎలా కేసీఆర్?
X
మనమేంటి? మన స్థాయి ఏంటి? దేశంలోని ధనిక రాష్ట్రాల్లో ఒకటి.. కనిపించని దేవుడికి ఏ మాత్రం తీసిపోని రీతిలో.. మనసను టచ్ చేసేలా అడగాలే కానీ.. వందల కోట్ల హామీని వెనుకా ముందు చూసుకోకుండా ఇచ్చేసే ముఖ్యమంత్రి ఏలుబడిలో ఉన్న రాష్ట్రంలో.. తనకు మించిన తోపు హిందువు ఎవడుంటాడంటూ బాజాప్తా చెప్పుకునే కేసీఆర్ హయాంలో.. ఇలా జరగటమా? నో.. నెవ్వర్.. అలా జరగకూడదు కదా? ఇంతకీ ఆయనకు తెలీకుండానే ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారంటారా? ఇంతకూ ఇదంతా దేని గురించి అంటే..?

ఏపీలో తిరుమల ఉంది. మరి.. తెలంగాణలో? ఇలాంటి ప్రశ్న కేసీఆర్ మనసుకు రావటం.. ఆ వెంటనే తెలంగాణలో తిరుమలకు ధీటుగా ఒక దేవాలయాన్ని సిద్ధం చేసేందుకు కంకణం కట్టుకున్న గులాబీ బాస్..యాదాద్రిని సెలెక్టు చేసుకోవటం.. దాని రూపురేఖల్ని మొత్తంగా మార్చేసిన సంగతి తెలిసిందే. ఏళ్లకు ఏళ్లుగా వందల కోట్ల ప్రజా ధనాన్ని యాదాద్రి దేవాలయానికి వెచ్చించిన వైనం ఒక ఎత్తు అయితే.. తాజాగా ఆ ఆలయంలో స్వామి సేవలకు నిర్ణయించిన ధరల్ని భారీగా పెంచేస్తూ తీసుకున్న నిర్ణయం పలువురు తప్పు పడుతున్నారు.

కొవిడ్ కారణంగా ఆలయ ఆదాయం కుంటుపడిందని.. జీతభత్యాలతో ఆర్థిక భారం పెరిగిన కారణంగా ధరల్ని పెంచాల్సి వచ్చిందన్న ఆలయ అధికారుల మాట.. భక్తులకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. గుడి నిర్వహణ ఏమైనా వ్యాపారమా? మరి.. యాదాద్రి కోసం కేసీఆర్ ప్రభుత్వం వందల కోట్ల రూపాయిల్ని ఖర్చు చేసింది. మరి.. అంత ఖర్చు పెట్టిన దానికి పన్నుల రూపంలో ప్రజల నుంచి బాదేస్తామంటే ఎలా ఉంటుంది?

సరిగ్గా ఇప్పుడు ఆలయ అధికారుల మాట కూడా అదే రీతిలో ఉందని చెప్పాలి. ఇప్పటివరకు వీవీఐపీలు సత్యనారాయణ వ్రతాన్ని ప్రత్యేకంగా జరుపుకోవటానికి వీలుగా సరికొత్త టికెట్ ను తెర మీదకు తీసుకొచ్చారు. గతంలో అస్సలు లేని ఈ టికెట్ ను కొత్తగా ప్రవేశ పెట్టటమే కాదు.. దీని ధరను రూ.1500లుగా నిర్ణయించటం గమనార్హం. అంతేకాదు.. లక్ష్మీనారసింహుల నిత్యకల్యాణం టికెట్ ధర రూ.1250 నుంచి రూ.1500 కు పెంచారు. నిజాభిషేకానికి రూ.500 ఛార్జీని రూ.800లకు పెంచారు.

ఆండాళ్ల అమ్మ వారి ఊంజల్ సేవ రూ.750 నుంచి రూ.వెయ్యికి.. సత్యనారాయణ స్వామి వత్రానికి రూ.500 నుంచి రూ.800లకు.. అస్టోత్తరం టికెట్ రూ.100 కాస్తా రూ.200లుగా పెంచేశారు. వంద గ్రాముల లడ్డూను రూ.20 నుంచి రూ.30కు.. అరకేజీ లడ్డూ ధరను రూ.100 నుంచి రూ.150కు.. పావుకేజీ పులిహోర పాకెట్ ను రూ.15 నుంచి రూ.20కు.. పావుకేజీ వడను రూ.15 నుంచి రూ.20కు పెంచేశారు.

ప్రసాదాల ధరల్ని పెంచటంలో కాస్తంత అర్థం ఉంది. కానీ.. పూజలు.. స్వామివారి సేవలకు సంబంధించిన టికెట్ల ధరల్ని ఇంత భారీగా పెంచటం సరికాదని చెప్పాలి. ఓపక్క సంపన్న రాష్ట్రంగా సీఎం కేసీఆర్ తరచూ చెప్పే వేళ.. అధ్యాత్మిక కార్యక్రమాల వైపు ప్రజల్ని మరింతగామళ్లించాల్సిన వేళ.. ఇలా భారీగాధరలు పెంచేయటం ఏ మాత్రం సరికాదన్న విషయాన్ని మర్చిపోకూడదు. సామాన్యులకు షాక్ గా మారే ఈ ధరల పెంపుదల గురించి సీఎం కేసీఆర్ కు ముందే తెలుసా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.