Begin typing your search above and press return to search.

విస్తరణలో కేసీఆర్ బ్రేక్ చేస్తారట..?

By:  Tupaki Desk   |   6 July 2019 1:30 AM GMT
విస్తరణలో కేసీఆర్ బ్రేక్ చేస్తారట..?
X
రెండోసారి గద్దెనెక్కగానే ఓ ఫైన్ మార్నింగ్ కేసీఆర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ మంత్రులకు మరోసారి కేబినెట్ లోకి తీసుకునేది లేదని కుండబద్దలు కొట్టారు. ఈ లెక్కనే పాపం మొన్నటివరకు మంత్రులుగా చేసి ఓడిన తుమ్మల నాగేశ్వరరావు- జూపల్లి కృష్ణారావుకు బెర్త్ దక్కలేదు. కేసీఆర్ అదే పట్టుదలతో కేబినెట్ ను మొన్నటి సారి విస్తరించారు.

అయితే ఈ రూల్ ను బ్రేక్ చేయడానికి కేసీఆర్ సిద్ధపడ్డారన్న వార్త ఇప్పుడు టీఆర్ ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారిందట.. కేసీఆర్ కు ఉద్యమకాలం నుంచి చేదోడు వాదోడుగా ఉన్న నేత కోసం ఇప్పుడు ఆ రూల్ ను పక్కనపెట్టబోతున్నారన్నది సారాంశం. ఇంతకీ ఎవరా నేత అంటే బోయినపల్లి వినోద్ కుమార్. కరీంనగర్ మాజీ ఎంపీ..

ఈసారి కేసీఆర్ వేసిన ప్లానేవీ వర్కవుట్ కాలేదు. కరీంనగర్ నుంచి పోటీచేసిన కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడైన బోయినపల్లి వినోద్ కుమార్ ఓడిపోయాడు. ఉద్యమకాలం నుంచి కేసీఆర్ వెన్నంటి నడిచి ఆర్థికంగా, పార్టీ పరంగా ఆదుకున్న వినోద్ ను ఈసారి టీఆర్ఎస్ లోక్ సభపక్ష నేతగా కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు కూడా. కానీ వినోద్ ఓడిపోవడంతో ఇప్పుడు కేసీఆర్ తీవ్ర ఆవేదనతో ఉన్నారట.. ఎలాగైనా సరే వినోద్ కు ప్రభుత్వ పరంగా పదవి ఇవ్వాలని యోచిస్తున్నాడట.

అందుకే తాజాగా ఎమ్మెల్సీ చేసి బోయినపల్లి వినోద్ ను మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారనే చర్చ టీఆర్ ఎస్ లో సాగుతోంది. అయితే ఇప్పుడు విస్తరించే కేబినెట్ లో కేసీఆర్ తోపాటు ఎర్రబెల్లి దయాకర్ రావు వెలమ సామాజికవర్గం నుంచి మంత్రులుగా ఉన్నారు. వీరితోపాటు కేటీఆర్, హరీష్ రావులకు కూడా మంత్రులుగా సీటు కన్ఫమే. మరి వినోద్ ను కూడా తీసుకుంటే నలుగురు వెలమలు అవుతారు. ఇది సామాజికంగా, మంత్రివర్గంలో విమర్శలకు తావిస్తుంది. అందుకే దీని విషయంలో కేసీఆర్ ఏం చేయబోతున్నారన్న ప్రశ్న పార్టీలో ఉత్కంఠ రేపుతోంది.