Begin typing your search above and press return to search.

కేసీఆర్ ప్లాన్ వ‌ర్క‌వుట‌వుతుందే!

By:  Tupaki Desk   |   5 Feb 2022 3:30 PM GMT
కేసీఆర్ ప్లాన్ వ‌ర్క‌వుట‌వుతుందే!
X
రాజ‌కీయ చ‌ణక్యుడిగా పేరున్న కేసీఆర్ ఎవ‌రి ఊహ‌కు అంద‌కుండా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తార‌ని విశ్లేష‌కులు చెబుతుంటారు. పార్టీని అధికారంలోకి తీసుకురావ‌డానికి ఆయ‌న ర‌చించే వ్యూహాల‌కు తిరుగుండ‌ద‌ని అంటుంటారు. రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లి 2018లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావ‌డం అందులో భాగ‌మే. ఈ సారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాల‌ని చూస్తున్నారు. మ‌రి అందుకో బృహ‌త్త‌ర‌మైన ప్లాన్ కావాలి క‌దా. అందుకే ఈ సారి బీజేపీని టార్గెట్ చేసి సెంటిమెంట్‌ను ర‌గిలించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అందుకే విమ‌ర్శ‌లు..

ఓ ఏడాది కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఇక్క‌డి ఆ పార్టీ నేత‌ల‌పై కేసీఆర్ తీవ్రంగా విరుచుకుప‌డుతున్నారు. వరి కొనుగోళ్ల విష‌యంలో కేంద్రానిదే మొత్తం త‌ప్పు అనేలా హైలైట్ చేశారు. తాజాగా రిప‌బ్లిక్ డే వేడుకల‌కు గ‌వ‌ర్న‌ర్‌ను ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు బ‌డ్జెట్ విష‌యంలోనూ కేంద్రంపై మండిప‌డ్డారు. తెలంగాణ‌కు అన్యాయం చేశార‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. అదే విధంగా రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవ‌స‌రం కూడా ఉంద‌ని వ్యాఖ్య‌లు చేశారు. మ‌రోవైపు కేసీఆర్ త‌న మీడియాతో మోడీని టార్గెట్ చేశార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దేశంలో థ‌ర్డ్ ఫ్రంట్ మొద‌ల‌వుతోంద‌ని, దానికి కేసీఆరే నాయ‌క‌త్వం వ‌హిస్తారంటూ ఆ మీడియాలో వ‌రుస క‌థ‌నాలు వ‌చ్చేలా ప్లాన్ చేశార‌ని తెలిసింది.

ఎన్నిక‌ల వ్యూహంగా..

నిజానికి కేంద్రం మీద కేసీఆర్‌కు అంత కోపం ఉందా అంటే.. ఇదంతా కేవ‌లం ఎన్నిక‌ల వ్యూహం మాత్ర‌మేన‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కేంద్రాన్ని రెచ్చ‌గొట్టి.. వాళ్ల‌తో తిట్లు తిని ఆ విధంగా తెలంగాణ సెంటిమెంట్‌ను ర‌గిల్చి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌న్న‌ది కేసీఆర్ ఆలోచ‌న అని చెబుతున్నారు. అందుకే ఈ సారి ముంద‌స్తు ఎన్నిక‌లకు వెళ్లేది లేద‌ని చెప్పిన ఆయ‌న‌.. ఈ ఏడాది పాటు బీజేపీపై విరుచుకుప‌డుతూనే ఉంటార‌ని తెలుస్తోంది. ప‌శ్చిబ బెంగాల్ ఫార్మాలానే ఇక్క‌డ ఉప‌యోగించాల‌న్న‌ది ఆయ‌న వ్యూహంగా క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. గ‌తేడాది అక్క‌డ కేంద్రం వ‌ర్సెస్ బెంగాల్‌గా ప‌రిస్థితి మార‌డంతో మ‌మ‌తా బెన‌ర్జీ మూడోసారి సీఎం అయ్యారు. ఇప్పుడు తెలంగాణ‌లోనూ అదే బాట‌లో కేసీఆర్ సాగ‌నున్నార‌ని స‌మాచారం. ఆయ‌న అనుకుంటున్న‌ట్లే ఇప్పుడు బీజేపీ నేత‌లు రెచ్చిపోతున్నారు. దీంతో కేసీఆర్ ప్లాన్ వ‌ర్క‌వుట‌యేలా ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

ఒకేసారి రెండు పార్టీల‌కు..

రాష్ట్రంలో టీఆర్ఎస్‌ను ఓడించేంత స‌త్తా బీజేపీకి లేద‌ని నిపుణులు అంటున్నారు. అందుకే బీజేపీ భుజం మీద తుపాకీ పెట్టి కాంగ్రెస్‌ను దెబ్బ కొట్టాల‌ని కేసీఆర్ చూస్తున్నార‌ని తెలిసింది. కేసీఆర్‌కు ఎదురు తిరిగి బీజేపీలో చేరి ఈట‌ల రాజేంద‌ర్ గెలిచిన త‌ర్వాత కేసీఆర్‌లో క‌సి మ‌రింత పెరిగింద‌ని చెబుతున్నారు. మ‌రోవైపు ఢిల్లీ రాజ‌కీయాల‌పైనా ఆయ‌న దృష్టి పెట్టారు. అందుకే ప‌నిలో ప‌నిగా ఇక్క‌డ కేటీఆర్‌కు సీఎం పీఠం క‌ట్ట‌బెట్టి తాను ఢిల్లీలో పాగా వేయాల‌ని కేసీఆర్ చూస్తున్నార‌ని విశ్లేష‌కులు అంటున్నారు. అందుకే జాతీయ రాజ‌కీయాల‌పై ఫోక‌స్ పెట్టి బీజేపీని టార్గెట్ చేశార‌ని చెబుతున్నారు. కానీ అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో బీజేపీకి అనుకూలంగా ఫ‌లితాలు వ‌స్తే మాత్రం కేసీఆర్ త‌న వ్యూహాన్ని మార్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.