Begin typing your search above and press return to search.

ఈట‌ల‌కు అలా.. వ‌న‌మాకు ఇలా.. కేసీఆర్ ఏంటిలా?

By:  Tupaki Desk   |   10 Jan 2022 3:17 AM GMT
ఈట‌ల‌కు అలా.. వ‌న‌మాకు ఇలా.. కేసీఆర్ ఏంటిలా?
X
రాజు త‌లుచుకుంటే దెబ్బ‌ల‌కు కొదువా.. స‌న్మానాల‌కు క‌రువా? త‌న వాడు అనుకుంటే ఏ మేలైనా చేస్తారు. అది ప‌గ‌వాడు అనుకుంటే మాత్రం ప‌గ తీర్చుకుంటారు. ప్ర‌స్తుత రాజ‌కీయ నాయ‌కులు కూడా అంతే. ఇక ముఖ్య‌మంత్రి కుర్చీపై ఉన్న నేత గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం ఏముంది? త‌న‌కు విధేయుడిగా ఉన్న వాళ్ల‌పై ఆరోప‌ణ‌లు వ‌చ్చినా చూసిచూడ‌న‌ట్లు వ‌దిలేస్తారు. కానీ త‌న‌కు ఎదురు తిరిగిన వాళ్ల‌పై చిన్న విమ‌ర్శ రాగానే చ‌ర్య‌లు తీసుకుంటారు. తెలంగాణ సీఎం కేసీఆర్ వ్య‌వ‌హార శైలి కూడా అలాగే ఉంద‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈట‌ల రాజేంద‌ర్‌, వ‌న‌మా వెంక‌టేశ్వ‌ర్రావు, ఆయ‌న త‌న‌యుడు రాఘ‌వ‌పై కేసీఆర్ వైఖ‌రే అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

త‌క్ష‌ణ‌మే వేటు..

తెలంగాణ‌లో రెండో సారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత త‌న సొంత ప్ర‌భుత్వంపైనే అప్ప‌టి టీఆర్ఎస్ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ అసంతృప్తి వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. బ‌హిరంగంగానే వ్య‌తిరేకంగానూ మాట్లాడారు. పార్టీ ఏ ఒక్క‌రికో సొంతం కాద‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఈ ప‌రిణామాల‌న్నింటినీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న కేసీఆర్ అవ‌కాశం రాగానే ఈట‌ల‌పై వేటు వేశార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఈట‌ల‌పై భూ క‌బ్టా ఆరోప‌ణ‌లు వ‌చ్చిన వెంట‌నే ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా త‌న మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్ద‌ర‌ఫ్ చేసిన కేసీఆర్‌.. ఈట‌ల పార్టీ వ‌దిలి వెళ్లేలా చేశార‌నే అభిప్రాయాలున్నాయి. ఈట‌ల భూ క‌బ్జాపై కేసీఆర్ విచార‌ణ‌కు ఆదేశించారు. ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన ఈట‌ల‌.. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో విజ‌యంతో కేసీఆర్‌కు షాకిచ్చిన సంగ‌తి తెలిసిందే.

కానీ ఇప్పుడు..

కొత్త‌గూడెం టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ‌న‌మా వెంకటేశ్వ‌ర్రావు అధికారాన్ని అడ్డుపెట్టుకున్ని ఆయ‌న త‌న‌యుడు రాఘ‌వ సాగించిన అరాచ‌కాలు ఇప్పుడు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఆస్తి త‌గాదా విష‌యంలో వ్యాపారి రామ‌కృష్ణ భార్య‌ను త‌న ద‌గ్గ‌ర‌కు పంపించ‌మ‌ని రాఘ‌వ నీచ‌మైన కోరిక కోర‌డంతో.. ఆ కుటుంబం ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. త‌మ చావుల‌కు రాఘ‌వ‌నే కార‌ణ‌మ‌ని రామ‌కృష్ణ సెల్ఫీ వీడియో తీసుకుని మ‌రీ చ‌నిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘ‌ట‌న ఎంతో చ‌ర్చ‌నీయాంశంగా మారిన‌ప్ప‌టికీ వెంట‌నే కేసీఆర్ కానీ ప్ర‌భుత్వం కానీ స్పందించ‌లేదు.

రాఘ‌వ చేసిన అరాచ‌కాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు రావ‌డంతో తీరిగ్గా అయిదు రోజులు గ‌డిచిన త‌ర్వాత ఆయ‌న్ని పార్టీ నుంచి స‌స్పెండ్ చేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. అది కూడా ప్ర‌జ‌ల నుంచి భారీ ఎత్తున వ్య‌తిరేక‌త రావ‌డంతోనే చేశార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులు త‌ప్పించుకుని తిరిగిన రాఘ‌వ కూడా అదే రోజు పోలీసుల‌కు చిక్క‌డం మ‌రిన్ని అనుమానాలు క‌లిగిస్తోంది. మ‌రోవైపు ఆయ‌న తండ్రి ఎమ్మెల్యే వెంక‌టేశ్వ‌ర్రావుపై మాత్రం కేసీఆర్ ఇంకా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. పార్టీ నుంచి కూడా ఎలాంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డ లేదు.