Begin typing your search above and press return to search.

కేసీఆర్ జాతీయ పార్టీకి ముహూర్తం ఖరారు.. ఎప్పుడు? ఎక్కడంటే?

By:  Tupaki Desk   |   2 Oct 2022 12:09 PM GMT
కేసీఆర్ జాతీయ పార్టీకి ముహూర్తం ఖరారు.. ఎప్పుడు? ఎక్కడంటే?
X
తెలంగాణ సీఎం కేసీఆర్ తగ్గేదేలే అంటూ జాతీయ రాజకీయాల్లోకి అడుగులు వేస్తున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై ముహూర్తం ఖరారు చేశారు. ఈ మేరకు ఈరోజు ప్రగతి భవన్ లో మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులతో సమావేశమైన కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు సమాచారం.

దసరా రోజున మధ్యాహ్నం 1.19 గంటలకు సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేయబోతున్నారు. అదేరోజున టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగనుంది. జాతీయ పార్టీగా మార్పుపై టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం తీర్మానం చేయనుంది.

డిసెంబర్ 9న ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జాతీయ పార్టీ పేరు, జెండా, అజెండా వంటి అంశాలపై ఇవాళ జరిగిన సమావేశంలో పార్టీ నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

విజయదశమి రోజున జాతీయ పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేసినప్పటి నుంచి వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల్లో ఫ్లెక్సీలు, బాణాసంచా సందడి వంటి కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళిక రచిస్తున్నారు.

కాసేపటి క్రితం ప్రగతి భవన్ లో టీఆర్ఎస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఆ సమావేశంలో మంత్రులు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. ఈసందర్భంగా జాతీయ పార్టీ భవిష్యత్ ప్రణాళికలపై సీఎం చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ పేరు మార్పుపై భేటీలో తీర్మానం చేయనున్నట్లు సమాచారం.