Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఉప ఎన్నిక ఖ‌ర్చు 500 కోట్లు

By:  Tupaki Desk   |   16 Sep 2017 12:05 PM GMT
కేసీఆర్ ఉప ఎన్నిక ఖ‌ర్చు 500 కోట్లు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నల్లగొండ ఉప ఎన్నికకు సిద్ధ‌మ‌యిపోయిన‌ట్లు తెల‌స్తోంది. ఇందుకోసం ఇప్ప‌టికే గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకున్న గులాబీ ద‌ళ‌ప‌తి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇందుకు సన్నాహక చర్యలు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. తాజా సర్వేల ప్రకారం నల్లగొండ పార్లమెంట్ ప్రజలు టీఆర్ ఎస్ వైపే మొగ్గు చూపుతుండగా, ఈ శాతాన్ని మరింతగా పెంచుకునేందుకు నల్లగొండ ప్రజల కోర్కెలు తీర్చేందుకు అభివృద్ధి జాతరకు సీఎం శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఉప ఎన్నిక కోణంలో ఇప్ప‌టికే పలు నివేదికలు తెప్పించుకుంటున్నట్లు సమాచారం. టీఆర్ ఎస్ పార్టీ ముఖ్యనేత - నల్లగొండ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి - న‌ల్ల‌గొండ కలెక్టర్‌ తో ప‌లు అంశాల‌పై మాట్లాడి అభివృద్ధి చ‌ర్య‌ల‌కు సిద్ధం చేసిన‌ట్లు స‌మాచారం. నల్లగొండలో సీఎం పర్యటన సందర్భంగా రూ.500కోట్ల పనులకు శంఖుస్థాపనలు చేసే అవకాశం ఉందని అంటున్నారు. నల్లగొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీ - ఐటీ పార్క్ - 10వేల డబుల్ బెడ్రూం ఇండ్లతో పాటు శిల్పారామం - కళాభారతి వంటి పనులను మంజూరు చేస్తూ త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం. నల్లగొండ ప్రజల ప్రధాన డిమాండ్లు తీర్చడంతో పాటు ఏ వర్గంలో మద్దతు ఉంది, ఏ వర్గంలో అసంతృప్తి ఉంది వంటి వివరాలను సామాజిక వర్గాలు వృత్తుల ఆధారంగా సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

పోల్ మేనేజ్‌ మెంట్‌ పై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి న‌ల్ల‌గొండ ఎంపీ ప‌ద‌వికి రాజీనామా లేఖ స్పీకర్‌కు పంపక ముందే సన్నాహక పనులను పూర్తిచేయనున్నట్లు టీఆర్ ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి.