Begin typing your search above and press return to search.

మిషన్ 100...కేసీఆర్ టార్గెట్

By:  Tupaki Desk   |   20 Dec 2018 4:34 PM GMT
మిషన్ 100...కేసీఆర్ టార్గెట్
X
తెలంగాణ వ్యాప్తాంగా అన్ని జిల్లాలకు - మున్సీపాలిటీలకు - అన్నీ గ్రామాలకు నీరు అందించాలన్నది తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు - ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆశయం. అందుకే దివి నుండి భువికి గంగను తీసుకు వచ్చిన ఆ భగీరథుడి పేరుతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత ప్రభుత్వంలో అన్ని కార్యక్రమాలను చకచక ప్రారంభించి ముగించిన కేసీఆర్ గ్రామాలకు నీరు ఇచ్చే పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందకే ఇతర పథకాల పేర్లలా కాకుండా మిషన్ భగీరథ అనే పేరును పెట్టారు. అంటే తాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రతీది ఓ మిషన్‌ లా పూర్తి చేయాలని కేసీఆర్ సంకల్పం. అప్పుడు అది ముగిసింది. ఇప్పుడు కొత్త మిషన్ ప్రారంభమయ్యింది అదే మిషన్ 100. ఇది ప్రభుత్వ పథకం కాదు ప్రత్యర్దులను ఎన్నికలలో వణికించే రాజకీయ మిషన్. తెలంగాణ ముందస్తు ఎన్నికలను ప్రకటించినప్పుడు - 105 మంది అభ్యర్దులను ఒకేసారి వెలువరించినప్పుడు కూడా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తాము 100 స్దానాలలో గెలుస్తామని అత్యంత దీమాగా చెప్పారు. ఆయనే కాదు, ఆయన కుమారుడు కె. తారక రామారావు - కుమార్తె కవిత కూడా ఈ మిషన్ 100ను ప్రస్తావించారు.

ముందస్తు ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి 100 స్దానాలు గెలుస్తుందని - అది తమ టార్గెట్‌ అని చెప్పినప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ కెసీఆర్‌ ను ఎద్దేవా చేసాయి. కొందరైతే ఒకటి ప్రక్కన రెండు సున్నాలలో ఒక సున్నా తీసేసీ 10 స్దానాలు వస్తాయని అన్నారు. అయితే ఈ అంచనాలను తలక్రిందులు చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి ఏకంగా 88 స్ధానాలలో విజయం సాధించింది. ఇక మిషన్ 100 కు మిగిలింది 12 స్దానాలే. తెలంగాణ ఎన్నికల తర్వాత స్వతంత్రులుగా గెలిచిన ఇద్దరు టీఆర్ ఎస్‌ లో చేరారు. దీంతో టిఆర్ ఎస్ బలం 90కి పెరిగింది. ఇక మిషన్ 100కు మిగిలింది 10 స్దానాలే. ఇప్పటికే ప్రతిపక్షాలకు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు తమ వైపు చూస్తున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మిషన్ 100 సాధించేందుకు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. తాను ముందస్తు ఎన్నికలకు ముందు ప్రకటించిన మిషన్ 100 సంఖ్యను ఆయన ఇప్పటికిప్పుడు కాకపోయినా సాధ్యమైనంత త్వరగా చేరుకుంటారని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.