Begin typing your search above and press return to search.

'మర్యాద' గురించి మాట్లాడే ఛాన్సు మిస్ చేసుకున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   7 Feb 2022 1:30 AM GMT
మర్యాద గురించి మాట్లాడే ఛాన్సు మిస్ చేసుకున్న కేసీఆర్
X
మిగిలిన రంగాలతో పోలిస్తే.. రాజకీయ రంగంలో సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉంది. అందుకే.. ఈ రంగంలోకి అడుగు పెట్టిన వారు ఆచితూచి అన్నట్లు అడుగులు వేస్తారు. ఒకసారి చేసిన తప్పు వారిని జీవితాంతం వెంటాడేలా చేస్తుంది. అందుకే.. సంప్రదాయ రాజకీయ అధినేతలు.. నేతలు కీలక నిర్ణయాన్ని తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవటం.. విధానాల్ని ప్రకటించటం లాంటివి చేసేవారు. దూకుడు రాజకీయాలు ఎంట్రీ ఇచ్చిన తర్వాత రాజకీయ క్రీడా స్వరూపమే మారిపోయింది.

ఆట ఎంత మారినా.. దానికి సంబంధించిన ప్రాథమిక నియమాలు మాత్రం మారవన్నది మర్చిపోకూడదు. అందుకు రాజకీయాలు సైతం మినహాయింపు కాదు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వారు కొన్నింటిని తప్పక ఫాలో కావాల్సిందే. తనపై ఎవరైనా ఘాటు విమర్శలు చేసినంతనే.. తాను రాష్ట్ర ముఖ్యమంత్రినని.. ప్రజలు నేరుగా ఎన్నుకున్నారని.. తమ చేతిలో అధికారం ఉందంటూ తనకున్న పవర్ గురించి తెలియజెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రికి మర్యాద ఇవ్వరా? ఇది సరికాదంటూ విరుచుకుపడుతుంటారు.

మరి.. ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రికి ఇవ్వాల్సిన మర్యాద విషయంలో కేసీఆర్ ఏం చేసినట్లు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ప్రధాని పదవిలో ఉన్న వారు.. తాము వ్యవహరించాల్సిన రీతిలో వ్యవహరించకపోతే అది వారి తప్పు అవుతుంది. వారి తీరును చూపించి.. మేం ఇలా ఉంటామనటంలో అర్థం లేనిది. ఒకవేళ మోడీ తప్పు చేశారనుకుందాం. ఆయన తప్పు చేస్తే.. ఆయన మాదిరి మనం కూడా తప్పు చేయాల్సిన అవసరం లేదు. మన ఇంటికి శత్రువు వచ్చినా.. ఆదరించి పంపే సంస్కృతి తెలుగువారి సొంతం. ప్రధాని హోదాలో మోడీ హైదరాబాద్ కు వచ్చినప్పుడు ఆయనకు స్వాగత.. వీడ్కోలు పలకకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖం చాటేయటం ఏ మాత్రం సరికాదు.

విధానపరంగా తేడాలు ఉంటే.. ఆ విషయాన్ని సూటిగా.. స్పష్టంగా చెప్పేయటం మంచిది. రాజకీయం కోసం సంప్రదాయాల్ని పక్కన పెట్టటం ఇవాల్టికి బాగానే ఉన్నా.. రేపొద్దున కేసీఆర్ ఇలాంటి అంశాలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. మరేం ఫర్లేదు చెబుతానని పెడసరంగాకేసీఆర్ అనొచ్చు. కానీ.. ఇలాంటి కల్చర్ పోయే కొద్దీ.. మరింత దారుణ పరిణామాలకు దారి తీస్తుందన్నది మర్చిపోకూడదు. తాజాగా మోడీ జరిపిన పర్యటన ప్రైవేటు అని.. అలాంటప్పుడు ప్రోటోకాల్ అంటూ ఏమీ ఉండదని టీఆర్ఎస్ నేతలు పలువురు వ్యాఖ్యానించటం అతుకుల బొంతే తప్పించి.. మరింకేమీ కాదన్నది మర్చిపోకూడదు.

మంచిగా ఉన్నా చెడుగా ఉన్నా.. ప్రజలు ఎన్నుకున్న అధినాయకుడికి లభించాల్సిన గౌరవ.. మర్యాదలు ఇవ్వాల్సిందే. అందులో ఎలాంటి లోటు రాకూడదు. ఎందుకంటే.. వ్యక్తుల కంటే విధానాలు శాశ్వితంగా ఉండాల్సిన అవసరం ఉంది. అన్నింటికి మించి వ్యక్తిగత.. రాజకీయ విభేదాలు సంప్రదాయాల్ని దెబ్బ తీసేలా ఉండకూడదన్నది మర్చిపోకూడదు. అవకాశం వచ్చిన ప్రతిసారీ సుభాషితాలు వల్లించే ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వారు.. ప్రధాని మోడీకి స్వాగత.. వీడ్కోలు విషయంలో వ్యవహరించిన తీరుతో.. ఆయనలోని ‘పెద్ద మనిషి’ని తక్కువ చేసి చూపించారని చెప్పక తప్పదు. వ్యక్తులతో ఉండే వైరుధ్యాల్ని కొన్ని సందర్భాల్లో పక్కన పెట్టేయాల్సిందే. ఎందుకంటే..మనం అనుసరించే మంచి సంప్రదాయాలే మన తర్వాత కూడా మిగులుతాయి. అవే ఆదర్శంగా నిలుస్తాయన్న నిజాన్ని కేసీఆర్ లాంటి మేధావి మిస్ కావటం దేనికి నిదర్శనం?