Begin typing your search above and press return to search.

ఇవాళ కూతుర్ని క‌లిసి కేసీఆర్‌

By:  Tupaki Desk   |   30 April 2018 10:38 AM GMT
ఇవాళ కూతుర్ని క‌లిసి కేసీఆర్‌
X
దేశ రాజ‌కీయాల మీద దృష్టి పెట్టిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆ దిశ‌గా వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్నారు. జాతీయ స్థాయిలో జ‌ట్టు క‌ట్టేందుకు వీలుగా ఆయ‌న ప‌లువురితో భేటీ కావ‌టం తెలిసిందే. నిన్న చెన్నైకి వెళ్లిన ఆయ‌న డీఎంకే అధినేత క‌రుణ‌ను క‌ల‌వ‌టం.. ఆ త‌ర్వాత స్టాలిన్ ఇంటికి విందుకు వెళ్ల‌టం తెలిసిందే.

ఒక రోజులో కార్య‌క్ర‌మాన్ని పూర్తి చేసుకొని హైద‌రాబాద్‌కు వ‌చ్చే వీలున్న‌ప్ప‌టికి.. మ‌రికొంద‌రు నేత‌ల్ని క‌ల‌వాల‌న్న మాట‌తోనే చెన్నైలో ఉండిపోయారు. దేశంలో గుణాత్మ‌కంగా మార్పులు తీసుకురావాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ప్ర‌య‌త్నిస్తున్న కేసీఆర్‌.. ఈ రోజు (సోమ‌వారం) డీఎంకే మ‌హిళా నేత‌.. కరుణ కుమార్తె.. మాజీ కేంద్ర‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన క‌నిమొళిని క‌లిశారు.

త‌న టీంతో క‌లిసి క‌నిమొళిని క‌లిసిన కేసీఆర్‌.. దేశ రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న ప‌రిణామాల గురించి చర్చించారు. క‌నిమొళితో భేటీ సంద‌ర్భంగా టీఆర్ఎస్ నేత‌లు కేకే.. ఈట‌ల‌.. ఎంపీ వినోద్‌.. ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా క‌నిమొళికి పేరుపేరునా త‌న వెంట వ‌చ్చిన ప్ర‌తి ఒక్క నేత‌ను ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌టం క‌నిపించింది. నిన్న‌టికి నిన్న క‌రుణ కుమారుడితో భేటీ అయి చ‌ర్చ‌లు జ‌రిపిన కేసీఆర్‌.. ఈ రోజు ఆయ‌న కుమార్తెతో భేటీ కావ‌టం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. డీఎంకేకు సంబంధించి రాష్ట్ర వ్య‌వ‌హారాలు స్టాలిన్ చూస్తే.. జాతీయ స్థాయి వ్య‌వ‌హారాల‌న్నీ కనిమొళి ప‌ర్య‌వేక్షిస్తార‌న్న పేరు ఉంది. ఈ కార‌ణంతోనే ఆమెతో కేసీఆర్ ప్ర‌త్యేకంగా భేటీ అయిన‌ట్లుగా చెబుతున్నారు.