Begin typing your search above and press return to search.

మోడీతో మీటింగ్ కు కేసీఆర్ ఫిక్స్ అయ్యారు

By:  Tupaki Desk   |   17 Nov 2016 3:37 AM GMT
మోడీతో మీటింగ్ కు కేసీఆర్ ఫిక్స్ అయ్యారు
X
పెద్దనోట్ల రద్దు అంటూ తీసుకున్న మోడీ సంచలన నిర్ణయం ఇచ్చిన షాక్ నుంచి అందరి కంటే త్వరగా బయటకు వచ్చి.. దాని కారణంగా రాష్ట్రాలకు ఎలాంటి నష్టాలు వాటిల్లుతాయి? దాని వల్ల ఏం జరుగుతుంది? రాష్ట్రాలు తమకుతాము ఏం చేయాలి?కేంద్రం ఏం చేయాలి? లాంటి అంశాల మీద చర్చల మీద చర్చలు నిర్వహించటమే కాదు.. ప్రధాని తీసుకున్న నిర్ణయం తొందరపాటుతో కూడుకున్నదన్న సంకేతాల్ని అనధికారికంగా వెల్లడిస్తూ.. తన వాదనను ప్రజల్లోకి వెళ్లేలా చేస్తున్నారు తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.

పెద్దనోట్ల రద్దు విషయంలో మోడీకే సలహాలు.. సూచనలు ఇవ్వటంతో పాటు.. ఆయన చేసిన తప్పుల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలన్న పట్టుదలతో కేసీఆర్ ఉన్నారు. తనకు తెలీని కొత్త విషయాలపై పట్టు సాధించేందుకు సదరు అంశంపై వివిధ రంగాలకు చెందిన నిపుణులతో భేటీ అయి.. వారిచ్చే సలహాలు.. సూచనలపై మదింపు చేసి.. అంతిమంగా ఒక నిర్ణయానికి రావటం కేసీఆర్ కు అలవాటే.

తాజాగా పెద్దనోట్ల రద్దు విషయంలోనూ ఇదే ఫార్ములాను పాటిస్తున్నారు. పలువురు ఆర్థిక రంగ నిపుణులతో పాటు.. మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లతో భేటీ అయిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను చెప్పొచ్చు. నోట్ల రద్దుపై ప్రధాని మోడీని కలిసి ఒక డీటైల్డ్ రిపోర్ట్ ఇవ్వాలని అనుకున్న ఆయన.. తాజాగా అందుకు సంబంధించిన కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. వాస్తవానికి నోట్ల రద్దు అంశంపై ప్రధానితో భేటీ అయ్యేందుకు ఢిల్లీ వెళ్లాలని మొదట అనుకున్నా తాజాగా ఆయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా చెబుతున్నారు.

ఈ నెల 25నుంచి మూడు రోజులు పాటు హైదరాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ ఆకాడమీలో జరిగే అన్నీరాష్ట్రాల డీజీపీల సమావేశానికి ప్రధాని మోడీ హాజరు కానున్నారు. ఈ సమావేశం ప్రారంభమైన రోజునే ప్రధాని మోడీతో భేటీ అయి.. పెద్దనోట్లరద్దుపై తాను చేసిన అధ్యయనం.. కసరత్తులను వివరించి.. ఈ నిర్ణయంతో రాష్ట్రాలు ఎంతలా ప్రభావితం అవుతున్నాయన్న విషయాన్ని సవివరంగా ఆయనకు చెప్పాలని భావిస్తున్నారు.

పెద్దనోట్ల రద్దుపై ప్రధానినిర్ణయం తీసుకున్న రోజు నుంచే తెలంగాణ రాష్ట్ర ఆదాయం భారీఎత్తున పడిపోవటం.. కేంద్రం నుంచి వచ్చేగ్రాంట్లలో కోత పడటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న కేసీఆర్.. కరెన్సీ రద్దుకు సంబంధించి రాష్ట్రాలకు కేంద్రం అందించాల్సిన సాయం గురించి మోడీని కోరాలని భావిస్తున్నారు. తాను ప్రధాని మోడీతో సమావేశం అయ్యేవరకూ నేతలు ఎవరూ నోట్లరద్దుపై తొందరపడి మాట్లాడొద్దని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినట్లు చెబుతున్నారు. కేసీఆర్ వాదనపై మోడీ ఎలా రియాక్ట్ అవుతారన్న విషయం తేలాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/