Begin typing your search above and press return to search.

అసద్ తో కేసీఆర్ మీటింగ్.. ఏం మాట్లాడుకున్నారు?

By:  Tupaki Desk   |   13 Nov 2020 9:10 AM GMT
అసద్ తో కేసీఆర్ మీటింగ్.. ఏం మాట్లాడుకున్నారు?
X
అనూహ్య నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు టీఆర్ఎస్ అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగిలిన వేళ.. అందరూ ఆ షాక్ లో ఉంటే.. అందుకు భిన్నంగా మరో ఎత్తుతో.. అందరి చూపు మారేలా వ్యవహరిస్తున్నారు గులాబీ బాస్. మంత్రివర్గ భేటీకి కాస్త ముందుగా.. ప్రగతిభవన్ లో సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన.. దానికి తన స్నేహితుడు.. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీని రమ్మని పిలిచారు.

ఇటీవల జరిగిన బిహార్ ఎన్నికల్లో ఐదు అసెంబ్లీ స్థానాల్ని సొంతం చేసుకోవటం ద్వారా అందరి కన్ను మజ్లిస్ మీద పడింది. ఇలాంటివేళ.. కేసీఆర్ పిలిచినంతనే ప్రగతిభవన్ కు ఖరీదైన కారులో వచ్చారు అసద్. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య భేటీ వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు. కాకుంటే.. పార్టీ వర్గాలతో పాటు.. పలు మీడియా రిపోర్టుల్ని చూస్తే.. రానున్న గ్రేటర్ ఎన్నికల గురించి మాట్లాడటానికే పిలిచినట్లుగా చెబుతున్నారు.

గతంలో అనుకున్న దాని ప్రకారం జనవరి మూడో వారం నుంచి ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టి ఫిబ్రవరి మొదటి వారంలో పూర్తి అయ్యేలా గ్రేటర్ ఎన్నికల్ని ప్లాన్ చేశారు. అందుకు భిన్నంగా దుబ్బాక ఫలితం నేపథ్యంలో డిసెంబరు మొదటి వారానికి ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యేలా కేసీఆర్ ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని తన స్నేహితుడికి సమాచారం ఇవ్వటంతో పాటు.. తన ఎన్నికల వ్యూహాన్ని షేర్ చేసుకోవటానికి అసద్ ను ప్రగతిభవన్ కు ఆహ్వానించినట్లు చెబుతున్నారు.

గ్రేటర్ గెలుపుపై సంపూర్ణ విశ్వాసం ఉన్నప్పటికీ.. అవసరమైన పక్షంలో ఉమ్మడి భాగస్వామ్యంలో గ్రేటర్ లో కొలువు తీరేందుకు వీలుగా ఇరువురు అధినేతల మధ్య మాటలు జరిగినట్లుగా చెబుతున్నారు. మొత్తం150 డివిజన్లు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో 100 స్థానాలు టీఆర్ఎస్ వి కాగా.. 40 స్థానాలు మజ్లిస్ వి. ఎంత పోటీ ఉన్నా.. గ్రేటర్ లో కొలువు తీరేది టీఆర్ఎస్సేనన్న మాట వినిపిస్తోంది. ఒకవేళ అనూహ్య పరిణామాల మధ్య.. సీట్ల సాధనలో వెనుకబడి ఉంటే.. మజ్లిస్ తో చెట్టాపట్టాలు వేసుకునేందుకు వీలుగా కేసీఆర్ ప్లాన్ బీ రెఢీ చేసి ఉంటారన్న మాట వినిపిస్తోంది.ఈ విషయాలన్ని మాట్లాడేందుకే అసద్ ను ప్రగతిభవన్ కు పిలిపించి ఉంటారని చెబుతున్నరు.