Begin typing your search above and press return to search.

లాభసాటి వ్యవసాయం దిశగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్

By:  Tupaki Desk   |   14 Oct 2020 5:45 AM GMT
లాభసాటి వ్యవసాయం దిశగా కేసీఆర్ మాస్టర్ ప్లాన్
X
తెలంగాణ సీఎం అయినప్పటి నుంచి ఒక్కో రంగాన్ని ప్రక్షాళన చేస్తున్న కేసీఆర్ మంచి ఫలితాలను అందుకుంటున్నారు. పోలీస్, రెవెన్యూ, పంచాయితీ, మున్సిపల్ సంస్కరణలు కేసీఆర్ కు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ప్రజలకు పాలనను చేరువ చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణలోని మెజార్టీ రైతాంగానికి భరోసా కల్పిస్తూ సాగు సంస్కరణలకు నడుం బిగించారు. వ్యవసాయం చేయడం కన్నా పాన్ డబ్బా పెట్టుకోవడం నయమనే తెలంగాణ నానుడిని రూపుమాపుతానని కేసీఆర్ అన్నారు. వ్యవసాయంపై ప్రగతి భవన్ లో సమీక్ష సందర్భంగా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

అన్నదాతకు అనుకూలంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నామని కేసీఆర్ అన్నారు. రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు ప్రవేశపెట్టి ఇప్పటికే వారి మనసులు చూరగొన్నామన్నారు.. అంతే కాకుండా రైతువేదిక భవనాలను యుద్ధ ప్రాతిపదికగా నిర్మిస్తూ వారికి అవసరమైన సలహాలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నామన్నారు.. తాజాగా అన్నదాత కోసం 'అగ్రికల్చర్‌ కార్డు'ను ప్రవేశపెట్టే ఆలోచన కూడా చేస్తున్నట్లు కేసీఆర్ వివరించారు. అందులో భాగంగానే రైతు వేదిక భవనాలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిర్మిస్తున్నారు. ఇందులో రైతులందరూ ఒకేచోట సమావేశంపై పంటల సాగు విధానంపై చర్చించనున్నారు.

వానాకాలం పంటల సమయంలోనూ కేసీఆర్‌ సన్నరకాల ధాన్యాన్నే పండించాలని సూచించారు. వాటికే మద్దతు ధర ఎక్కువ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తాజాగా మంగళవారం వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, సంబంధిత అధికారులతో జరిగిన సమీక్షలోనూ కేసీఆర్‌ ఇదే విషయాన్ని ఉద్ఘాటించారు. ముఖ్యంగా మొక్కజొన్న సాగు అసలే వద్దని.. ఆ పంటకు మద్దతు ధర కేవలం రూ.800 నుంచి రూ.900 మాత్రమే వస్తుందన్నారు. అయినా వేసుకుంటమంటే అది రైతు ఇష్టమని, ప్రభుత్వం మాత్రం మద్దతు ధర కల్పించదని చెప్పారు.

సాగు సంస్కరణలు చేస్తూ రైతులకు మేలు చేసేలా తాజాగా కేసీఆర్‌ 'అగ్రికల్చర్‌ కార్డు'ను తీసుకొచ్చే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ భూములన్నీ ఆన్‌లైన్‌ చేసి కొత్త పాస్‌బుక్‌లు ఇచ్చిన సీఎం ఇక రైతుకు ప్రభుత్వం నుంచి 'అగ్రికల్చర్‌ కార్డు' ను జారీ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ కార్డు ద్వారా రైతుకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని, దీంతో తనకు కావాల్సిన అవసరాలను అన్నదాత సమకూర్చుకుంటుంటాడని కేసీఆర్‌ నిర్ణయించే అవకాశముందని తెలుస్తోంది.