Begin typing your search above and press return to search.

ఉద్యోగుల కోపానికి కేసీఆర్ మంత్రం

By:  Tupaki Desk   |   12 Feb 2022 8:30 AM GMT
ఉద్యోగుల కోపానికి కేసీఆర్ మంత్రం
X
ద‌శాబ్దాల రాజ‌కీయ అనుభ‌వం.. ఉద్య‌మ నేప‌థ్యం.. తెలంగాణ‌కు రెండు సార్లు సీఎం.. ఇదీ కేసీఆర్ ప్ర‌యాణం. ఏ స‌మ‌స్య‌కు ఎప్పుడు ఏ విధంగా ప‌రిష్కారం చూపెట్టాలో.. ఆందోళ‌న‌ల‌కు నిర‌స‌న‌లకు ఏ విధంగా చెక్ పెట్టాలో ఆయ‌న‌కు బాగా తెలుసు. ఇదే విష‌యాన్ని రాజ‌కీయ నిపుణులు కూడా ప‌దేప‌దే చెబుతుంటారు. అధికారంలోకి పార్టీని తీసుకురావ‌డంతో పాటు ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించే రాజ‌కీయ చ‌తుర‌త ఆయ‌న‌కు ఉంద‌నే అభిప్రాయాలున్నాయి.

అదే కార‌ణం..

ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే.. కేసీఆర్ మ‌రోసారి త‌న తెలివితో ఓ స‌మ‌స్యకు ముగింపు ప‌లికే దిశ‌గా సాగుతున్నారు. జ‌న‌గామ జిల్లాలో జ‌రిగిన భారీ బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న ఉద్యోగుల అసంతృప్తిని చ‌ల్ల‌బ‌రిచే ప్ర‌య‌త్నం చేశార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఉద్యోగుల బ‌దిలీల విష‌యంలో జోన‌ల్‌, మ‌ల్టీ జోన‌ల్ విష‌యంలో అన్యాయం జ‌రిగింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. టీఆర్ఎస్ ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా ఉద్యోగులు ఆందోళ‌న కూడా చేశారు.

ఉపాధ్యాయులు కూడా పోరాట బాటలో సాగారు. భార్య‌భ‌ర్త‌ల‌ను ఒకే జోన్‌కే కేటాయించాల‌నే విష‌యంలోనూ ప్ర‌భుత్వం క‌నిక‌రం చూప‌డం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఉద్యోగుల బ‌దిలీల కోసం ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన 317 జీవోను స‌వ‌రించాల‌ని కోరుతున్నారు. విప‌క్షాలు కూడా ఈ విష‌యంపై ప్ర‌భుత్వాన్ని గ‌ట్టిగా ప్ర‌య‌త్నిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడ ఈ జీవోను స‌వ‌రించాల‌ని డిమాండ్ చేస్తూ జాగ‌ర‌ణ దీక్ష‌ను పూనుకోవ‌డం అరెస్ట‌వ‌డం జైలుకు వెళ్ల‌డం లాంటి ప‌రిణామాలు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. కానీ తాను ఒక్క‌సారి తీసుకున్న నిర్ణ‌యంలో వెన‌క్కిత‌గ్గే అల‌వాటు లేని కేసీఆర్ ఇప్పుడు ఉద్యోగుల బ‌దిలీల అంశంలోనూ అలాగే వ్య‌వ‌హ‌రించారు. కేటాయించిన చోట విధుల్లో చేర‌క‌పోతే ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని ప్ర‌భుత్వం హెచ్చ‌రించింది. దీంతో ఉద్యోగులు చేసేదేమీ లేక రిపోర్ట్ చేశారు.

అలా త‌గ్గించాల‌ని..

బ‌దిలీల విష‌యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల‌కు సీఎం కేసీఆర్‌పై అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. వాళ్ల నుంచి వ్య‌తిరేక‌త వ‌స్తోంది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన కేసీఆర్ వాళ్ల కోపాన్ని చ‌ల్ల‌బ‌రిచేందుకు ప్ర‌య‌త్నించార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఉద్యోగుల‌, ఉపాధ్యాయుల ఓట్లు కీల‌కం. అందుకే వాళ్ల అసంతృప్తిని త‌గ్గించేందుకు కేసీఆర్ మ‌రో మార్గంలో వ‌చ్చారని విశ్లేష‌కులు చెబుతున్నారు. జ‌న‌గామ స‌భ సంద‌ర్భంగా.. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందంటే అందుకు కార‌ణం ఉద్యోగులేన‌ని వాళ్ల‌ను కూల్ చేసే ప్ర‌య‌త్నం చేశారు.

చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌ను చూసి ఉద్యోగుల ఆందోళ‌న చెందొద్ద‌ని, బాగా ప‌నిచేసి భ‌విష్య‌త్‌లో కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతం పొందాలని అన్నారు. ప‌దోన్న‌తులు కోసం ఉద్యోగులు పైర‌వీలు చేయ‌వ‌ద్ద‌ని.. క్ర‌మానుసారంగా అంద‌రికీ ప‌దోన్న‌తులు అవే వ‌స్తాయ‌ని స్ప‌ష్టం చేశారు. అందుకు స‌ర‌ళ‌మైన విధానాన్ని తేవాల‌ని సీఎస్‌ను కోరాన‌ని తెలిపారు. మారుమూల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాల‌నే జోన‌ల్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేశామ‌ని, మారుమూల ప్రాంతాల్లో ప‌నిచేసే ఉద్యోగుల‌కు ప్ర‌త్యేక భ‌త్యం ఇవ్వాల‌ని సీఎస్‌ను అడిగాన‌ని కేసీఆర్ చెప్పారు. ఉద్యోగుల‌పై ప్ర‌శంసలు కురిపించ‌డంతో పాటు వాళ్ల‌కు ప్ర‌యోజ‌నాలు క‌లిగించేలా ప్ర‌సంగించిన కేసీఆర్‌.. వాళ్ల కోపానికి మంత్రం వేశార‌ని విశ్లేష‌కులు అంటున్నారు.