Begin typing your search above and press return to search.

మమతతో భేటీ తరువాతే కేసీఆర్ నెక్ట్స్ స్టెప్

By:  Tupaki Desk   |   18 March 2018 7:30 AM GMT
మమతతో భేటీ తరువాతే కేసీఆర్ నెక్ట్స్ స్టెప్
X
నేషనల్ పాలిటిక్సును మలుపు తిప్పడానికి టిఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆట మొదలు పెట్టేశారు. ప్రత్యామ్నాయ ఫ్రంటును ప్రకటించిన వెంటనే మొట్టమొదటగా సంఘీ భావం తెలిపి అభినందించిన పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో ఆయన సోమవారం భేటీకానున్నారు. ఇందుకోసం కోల్‌కతా బయలు దేరి వెళుతున్నారు. ప్రస్తుతం జాతీయ రాజకీ యాల్లో వేగంగా మార్పులు వస్తున్న నేపథ్యం లో.. అనుసరించాల్సిన వైఖరిపై మమతాబెనర్జీతో కెసిఆర్‌ చర్చించనున్నారు.

రెండు వారాల కిందట బిజెపి..కాంగ్రెసేతర ఫ్రంట్‌ దేశ రాజకీయాల్లో తీసుకువస్తానని సంచలన ప్రకటన చేసిన కెసిఆర్‌ ఇపుడు బిజెపియేతర పార్టీలన్నీ ఏకత్రాటిపైకి వస్తున్న నేపథ్యంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయిం చారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు ఎన్‌డిఏ నుండి బయటకు రావడం, ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు ఇప్పటికే రంగం సిద్ధం చేశారని జాతీయమీడియాలో కథనాలు వస్తున్న నేప థ్యంలో.. సుదీర్ఘకాలంగా ఫెడరల్‌ ఫ్రంట్‌పై కసరత్తు చేస్తున్న కెసిఆర్‌ మమతతో చర్చించి భవిష్యత్‌ కార్యాచరణ రూపొందించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని ప్రాంతీయపార్టీల్లో అత్యంత బలీయంగా ఉన్న.. మమతాబెనర్జీ మద్దతు ఉంటే, ప్రాంతీయ పార్టీల కూటమితో దేశరాజకీయాల్లో చక్రం తిప్పవచ్చని కెసిఆర్‌ తలపోస్తున్నారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా అంశం.. ఉత్తరప్రదేశ్‌ ఉప ఎన్నికల ఫలితాలతో అనూహ్యంగా దేశ రాజకీయాల్లో వేడి పెరిగింది. టిడిపి, వైసిపిలు ప్రకటించిన అవిశ్వాస తీర్మానాలకు బిజెపియేతర పార్టీలన్నీ క్రమంగా మద్దతిచ్చే దిశగా కదులుతుండగా.. ఢిల్లి వెళ్లడం కంటే బెంగాల్‌ ద్వారా మంత్రాం గం నడిపి చక్రంతిప్పాలని కెసిఆర్‌ భావిస్తున్నారు. చంద్రబాబు నేతృత్వంలో ఫ్రంట్‌ ఏర్పాటయ్యే అవకాశం ఉందా.. ప్రాంతీయ పార్టీలన్నీ కూటమిగా ఏర్పడితే నేతృత్వం ఎవరు వహిస్తారు? కాంగ్రెస్‌ కూటమిలో ఉంటుందా? దేశ రాజకీయాల్లో మున్ముందు ఎలాంటి పరిణామాలు సంభవించ బోతున్నాయి? అని ముఖ్యమంత్రి కెసిఆర్‌ మమతతో చర్చించే అవకాశం ఉన్నట్లు రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

అయితే... కేసీఆర్ ముందుండి నడిపించాలనుకుంటున్న కూటమిలో కాంగ్రెస్ వద్దు అని మమతను ఒప్పించడానికి కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోది. రాష్ట్రంలో నేరుగా కాంగ్రెస్‌తోనే పోరాడుతున్నం దున.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ ఉన్న కూటమిలో టిఆర్‌ఎస్‌ ఉండడం సాధ్యం కాదని, ఇందుకు బదులుగా తన వద్ద ఉన్న ప్రత్యామ్నాయ సుస్థిర కార్యాచరణను సిఎం మమతకు వివరించే అవకాశం ఉందని సమాచారం. మమతాబెనర్జీని కలవనున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌, ఇదే సందర్భంలో బెంగాల్‌కు చెందిన వివిధరంగాల నిపుణులతోనూ భేటీ కావాలని యోచిస్తున్నారు. టిడిపి ప్రకటించిన అవిశ్వాసానికి తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీ ఇప్పటికే మద్దతు ప్రకటించగా, మమత సూచనలను మద్దతు విషయంలో పరిగణనలోకి తీసుకునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. మమత సహకారంతో మరిన్ని ప్రాంతీయపార్టీల నేతలను కలిసే యోచనలో సిఎం ఉన్నట్లు సమాచారం.