Begin typing your search above and press return to search.

ఇదే కేసీఆర్ లక్.. లాకప్ డెత్ రచ్చకు ముందే డీజీపీ సీరియస్ యాక్షన్

By:  Tupaki Desk   |   19 Feb 2023 10:24 AM GMT
ఇదే కేసీఆర్ లక్.. లాకప్ డెత్ రచ్చకు ముందే డీజీపీ సీరియస్ యాక్షన్
X
సమర్థుడైన పాలకుడు అయినంత మాత్రాన సరిపోదు. ఆయన ఎంత సమర్థవంతంగా వ్యవహరించినా.. ఆయన ఎంపిక చేసుకున్న బలగాలు అంతే సమర్థంగా వ్యవహరించకపోతే.. వచ్చే తలనొప్పులు అన్నీ ఇన్నీ కావు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా లక్కీ ఫెలో అని చెప్పాలి.

కీలక అధికారుల ఎంపిక విషయంలో ఆయన వ్యవహరించే తీరుపై కొందరు విమర్శలు చేసినా.. ఆ తర్వాతి కాలంలో చోటు చేసుకునే పరిణామాల్ని చూసినప్పుడు.. ఆయన ఎంపిక నూటికి నూరు పాళ్లు కరెక్టుగా ఉందన్న భావన కలుగుతుంది. ప్రభుత్వానికి మాయని మచ్చలా మారే ఉదంతాల విషయంలో.. అనూహ్యంగా రియాక్టు అయిన చర్యలు క్షణాల్లో తీసుకుంటే.. ఇష్యూ రాజకీయంలోకి రాకుండా కట్టడి చేసినట్లు అవుతుంది. తాజాగా తెలంగాణలో అలాంటి పరిస్థితే నెలకొంది.

దొంగతనం కేసులో అదుపులోకి తీసుకున్న నిందితుడ్ని చావబాదటం.. దారుణంగా హింసించిన నేపథ్యంలో అతగాడు ఆసుపత్రిలో మరణించటం తెలిసిందే. దీంతో.. మెదక్ లాకప్ డెత్ వ్యవహారం దుమారంగా మారింది. ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా ఉండేందుకు.. సదరు ఘటనను మసి పూసి మారేడు కాయ చేసినట్లుగా వ్యవహరించటం.. దీనిపై రాజకీయంగా పెను దుమారం రేగటం.. చివరకు పెద్ద ఎత్తున పోరాటాలు.. నిరసనల తర్వాత.. ప్రభుత్వానికి జరగాల్సినంత నష్టం జరిగిపోయిన తర్వాత.. దిద్దుబాటు చర్యలకు తెర తీయటం లాంటివి చేస్తారు.

కానీ.. అందుకు భిన్నంగా లాకప్ డెత్ ఉదంతం తెర మీదకు వచ్చిన గంటల్లోనే తెలంగాణ డీజీపీగా వ్యవహరిస్తున్న అంజనీ కుమార్ రియాక్టు అయ్యారు. ఈ ఘటనపై సీరియస్ కావటమే కాదు.. శాఖా పరమైన దర్యాప్తునకు ఆదేశించటం ఒక ఎత్తు అయితే.. మరోవైపు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ.. ఎస్ఐపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో కలిపి ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేయటం ద్వారా.. ప్రభుత్వ పరంగా ఎలాంటి లోటు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు నెలల సమయం మాత్రమే ఉన్న వేళలో.. ఆయన వ్యవహరించిన తీరు కేసీఆర్ సర్కారుకు మేలు కలిగేలా మారిందని చెప్పాలి. మెదక్ లాకప్ డెత్ పై విపక్షాలు విరుచుకుపడే అవకాశం ఇవ్వకుండా.. వారు రియాక్టు అయ్యేనాటికే చర్యలు తీసుకోవటం ద్వారా.. ప్రభుత్వానికి మేలు చేశారని చెప్పాలి. ఆ మాటకు వస్తే.. మెదక్ లాకప్ డెత్ రాజకీయరంగు దాల్చకముందే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చర్యలు తీసుకోవటం ద్వారా.. ప్రభుత్వానికి ఉపశమనం కలిగించారని చెప్పాలి.

ఇలాంటి వ్యవహారశైలి ప్రభుత్వంపై అనవసర ఒత్తికి కారణంగా మారుతుంది. ఇలాంటి వేళలోనే.. కేసీఆర్ చతురత కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది.ఆయన ఎంపిక నూటికి నూరు శాతం కరెక్టు అన్న భావన కలుగుక మానదు. ఏమైనా.. ప్రభుత్వానికి తలనొప్పులు రాకుండా.. తానే ముందు రియాక్టు అయి.. ఆదిలోనే చెక్ పెట్టసిన డీజీపీ అంజనీ కుమార్ ను అభినందించాల్సిందే. అదే సమయంలో.. ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.