Begin typing your search above and press return to search.

మోడీ సర్కారుది తప్పు అనేలా కేసీఆర్ లాజిక్

By:  Tupaki Desk   |   20 Sep 2020 5:00 AM GMT
మోడీ సర్కారుది తప్పు అనేలా కేసీఆర్ లాజిక్
X
మాటలకున్న శక్తి ఎలాంటిదో ప్రధాని మోడీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వారిని చూస్తే అర్థమవుతుంది. మరి.. అలాంటి ఇద్దరు మాటల మరాఠీలు రాజకీయంగా తలపడితే పరిస్థితి ఎలా ఉంటుంది? తాజాగా ఇప్పుడు అలాంటి పరిస్థితే నెలకొందని చెప్పక తప్పదు. రాజకీయంగా భిన్న భావ జాలమైనప్పటికి కొన్ని పరిమితుల కారణంగా అటు మోడీ కానీ.. ఇటు కేసీఆర్ కానీ తమ గీతల్ని దాటింది లేదు.

మోడీ సర్కారుతో పెట్టుకోకూడదన్నట్లుగా వ్యవహరించిన కేసీఆర్.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా సిద్ధమైనట్లుగా చెప్పక తప్పదు. కేంద్రం నుంచి తాము ఆశించినట్లుగా నిధులు రాకపోవటం.. తమ డిమాండ్లను పట్టించుకోకపోవటం లాంటివి చూసిన కేసీఆర్.. మోడీ సర్కారుతో అమీతుమీ అన్నట్లుగా గులాబీ బాస్ బరిలోకి దిగారా? అన్న సందేహం కలిగేలా తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పక తప్పదు.

కేంద్ర సర్కారు తాజాగా ప్రవేశ పెట్టిన వ్యవసాయ బిల్లుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. ఇప్పటివరకు ఎవరు చెప్పలేనంతా క్లారిటీగా మోడీ సర్కారు చేస్తున్న తప్పును.. వ్యవసాయ బిల్లును అసలు ఎందుకు? అన్న క్వశ్చన్ వచ్చేలా చేయటంలో కేసీఆర్ తన లాజిక్ ను వినిపిస్తున్నారు.

గులాబీ బాస్ మాటల్ని విన్నంతనే మోడీ సర్కారు తీసుకొస్తున్న వ్యవసాయ బిల్లుపై కొత్త సందేహాలు కలగటం ఖాయం. తాజాగా ఆయన మాట్లాడుతూ.. కొత్త వ్యవసాయ బిల్లులోని లోపాల్ని ఎత్తి చూపించారు. రైతులు తాము పండించిన పంటను దేశంలోని ఏ ప్రాంతానికైనా అమ్ముకోవచ్చని కేంద్రం చెబుతుందని.. కానీ ఆచరణలో అదెలా సాధ్యమని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు.

‘‘రైతులు తమ సరుకునుఎక్కడైనా అమ్ముకోవచ్చని కేంద్రం తీసుకువచ్చిన బిల్లులో పేర్కొన్నారు. వాస్తవానికి ఇది వ్యాపారులు ఎక్కడికైనా వెళ్లి సరకును కొనుగోలు చేయడానికి ఉపయోగపడే విధానం. కార్పొరేట్‌ గద్దలు దేశమంతా విస్తరించడానికి, ప్రైవేటు వ్యాపారులకు దారులు బార్లా తెరవడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుంది. రైతులు తమ సరుకును దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని అంటున్నారు. అన్నదాతలు తమకున్న కొద్దిపాటి సరుకును రవాణా ఖర్చులు భరించి, లారీల ద్వారా వేరే చోటుకు తీసుకెళ్లి అమ్మడం సాధ్యమేనా? ఇది తేనె పూసిన కత్తిలాంటి చట్టం. దీన్ని కచ్చితంగా వ్యతిరేకించి తీరాలి’’ అని ఆయన వాదనను వినిపిస్తున్నారు. కేసీఆర్ చెప్పిందంతా విన్నప్పుడు నిజమే కదా? అన్న భావన కలగటమే కాదు.. లాజిక్ గా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ తరహా కౌంటర్ ను ఇప్పటివరకు ఫేస్ చేయిన మోడీ సర్కారు కేసీఆర్ లాజక్ ను ఎలా తిప్పి కొడుతుందన్నది ఆసక్తికరమని చెప్పక తప్పదు.