Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఓపెన్ గా మాట్లాడితే ఇంతే మరి..

By:  Tupaki Desk   |   17 Jan 2017 5:28 AM GMT
కేసీఆర్ ఓపెన్ గా మాట్లాడితే ఇంతే మరి..
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. స్వతహాగా రాజకీయ నాయకుడే అయినప్పటికీ.. కొన్నిసార్లు ఆయనలోని ఉద్యమ నాయకుడు చటుక్కున వచ్చేస్తుంటారు. ఉద్యమ నాయకులుగా విజయవంతమైన వారు.. రాజకీయ నాయకులుగా సక్సెస్ అయిన వాళ్లు తక్కువమంది ఉంటారు.ఈ రెండింటితో పాటు ప్రజల అభిమానాన్ని పొందే మరో కోణం కేసీఆర్ సొంతం. అసలుసిసలు రాజకీయ నాయకుడిగా వ్యవహరించినప్పటికీ.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కేసీఆర్ లోని అసలైన ఉద్యమ నాయకుడు నిద్ర లేస్తాడు.

ఆ సందర్భంగా టపా టపా అంటూ నిష్ఠూరంగా అనిపించే చేదు నిజాల్ని నిరభ్యంతరంగా చెప్పేస్తారు. ఇలాంటి చిత్రమైన కోణం చాలా చాలా తక్కువమంది రాజకీయ అధినేతల్లో కనిపిస్తుంది. ఇక్కడ కేసీఆర్ లో మరో ప్రత్యేకత ఉంది. ఓపెన్ గా మాట్లాడేసే క్రమంలో వివాదాల్లో చిక్కుకోవటం కనిపిస్తుంది. కానీ.. కేసీఆర్ అలాంటి అవకాశాన్ని ఎంతమాత్రం ఇవ్వరు. తాజాగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి కుమార్తెకు చెందిన స్వర్ణభారతి ట్రస్ట్ ను హైదరాబాద్ లో ప్రారంభించారు. మైహోం రామేశ్వరరావు తనకున్న భూమిలో కొంత భాగాన్ని ట్రస్ట్ కు ఇవ్వటం.. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రావటమే కాదు.. తన ప్రసంగంలో ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు.

ఉన్నది ఉన్నట్లుగా అప్పుడప్పడు మాట్లాడే కేసీఆర్.. తాజాగా అదే రీతిలో మాట్లాడారని చెప్పాలి. గ్రామాల్లో తాజాగా నెలకొన్న దారుణ పరిస్థితి గురించి చెప్పుకొచ్చిన కేసీఆర్ మాటల్ని.. ఆయన మాటల్లోనే చెబితే.. ‘‘అమ్మా దీపా.. నాదో వినతి. బ్యాక్ టు విలేజ్ కాన్సెప్ట్ పెట్టుకున్నారు. కానీ.. గ్రామాల్లో పరిస్థితులు బాగా లేవు. నిన్న మంత్రులతో కలిసి వరంగల్ వెళితే.. ఎక్కడికక్కడ తుమ్మ చెట్లు.. ఏమిటీ మురికి దుస్థితి? ఊర్లలో స్వచ్ఛత లేదు. మురికిపోయే మార్గం లేదు. పంచాయితీరాజ్.. సహకార వ్యవస్థను రాజకీయమయం చేసి.. ఉక్కిరిబిక్కిరి చేసేసి చంపేశారు. ఇప్పుడు సర్పంచ్ గా గెలవాలంటే కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. ఇలా గ్రామాల్లో ఇప్పుడువిచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. పంచాయితీరాజ్ లో ఉండే దుష్పరిణామాలను సంస్కరించేందుకు స్వర్ణభారత ట్రస్ట్ కార్యక్రమాలు చేపట్టాలి. అందుకు తెలంగాణ సర్కారు అండగా ఉంటుంది’’ అని వ్యాఖ్యానించారు. ఇంత ఓపెన్ గా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వారు అరుదుగా కనిపిస్తారని చెప్పటంలో సందేహం లేదనే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/