Begin typing your search above and press return to search.

ఈటలపై కేసీఆర్ తాజా వ్యూహం అదేనా?

By:  Tupaki Desk   |   7 May 2021 4:30 AM GMT
ఈటలపై కేసీఆర్ తాజా వ్యూహం అదేనా?
X
వ్యక్తులు ముఖ్యం కాదు.. వ్యవస్థ ముఖ్యమంటూ.. ప్రైవేటు కంపెనీల్లో తరచూ ఒక నినాదం వినిపిస్తూ ఉంటుంది. కంపెనీ పట్ల విధేయత.. అంతకు మించిన కమిట్ మెంట్ ఉందటానికి ఇలాంటి మాటలు కొలమానంగా చెబుతుంటారు. నిజానికి ఎంత పెద్ద కంపెనీ అయినా.. కొందరు సమర్థులైన వ్యక్తుల మీదనే ఆధారపడి ఉంటుంది. ఆ విషయాన్ని తెలివిగా పక్క దారి పట్టించి.. వ్యక్తులు కాదు కంపెనీనే గొప్ప అన్న మాటను అనిపించటం చూస్తుంటాం. ఒకవేళ.. ఎవరైనా ఇలాంటి వాదనల్లోని తప్పుల్ని ఎత్తి చూపే ప్రయత్నం చేస్తే.. వారిని నిర్దిక్షిణ్యంగా బయటకు పంపేసే కార్యాచరణను అమలు చేస్తారు.

గులాబీ జెండాకు ఓనర్లం మేమే అంటూ ఈటల ఏ ముహుర్తాన అన్నారో.. అప్పటి నుంచి గులాబీ బాస్ కు కొత్త గుబులు పుట్టిందంటారు. అప్పటివరకు ఈటల మీద రుసరుసలాడుతున్నా.. సమయం కోసం వెయిట్ చేసే ఆయన.. ఓనర్లం మాట ఆయన చాలా సీరియస్ గా తీసుకున్నారని చెబుతారు. తానెన్ని డక్కీముక్కీలు తిని పెంచి పెద్ద చేసుకున్న గులాబీ జెండా యాజమాన్య హక్కు ఇతరుల పరం చేసేందుకు గులాబీ బాస్ ఎందుకు ఒప్పుకుంటారు?

కారణం ఏదైనా కానీ.. ఈటలకు చెక్ పెట్టే కార్యక్రమానికి దేవరయాంజల్ లోని సీతారామ దేవాలయ భూముల్ని ఆక్రరమించారన్న ఆరోపణల్ని తెర మీదకు తీసుకురావటమే కాదు.. గంటల వ్యవధిలో దానికి సంబంధించిన రిపోర్టును తీసుకొచ్చేయటం తెలిసిందే. అంతేకాదు.. ఈటలకు చెందిన భూముల్లో భార్య పేరుతో ఉన్న గోదాములకు అనుమతులు లేవన్న లీకులు మీడియాకు ఇచ్చారని చెప్పాలి.

అదే సమయంలో ఈటల మంత్రిత్వ శాఖను పక్కన పెట్టేయటం.. కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయటం లాంటి నిర్ణయాలు చకచకా తీసుకున్నారు. తాము తీసుకున్న నిర్ణయాలతో ఈటల తన పార్టీ పదవికి రాజీనామా చేస్తారని భావించారు. అందుకు భిన్నంగా.. కేసీఆర్ వ్యూహారచనపై తనకున్న అవగాహన తెలిసేలా ఆయన స్పందించటం షురూ చేశారు. ఎక్కడా కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయకుండా.. తనపై జరుగుతున్న దాడిని ఆవేదనతో చెప్పుకోవటం ద్వారా.. తనను టార్గెట్ చేశారన్న భావన కలిగేలా చేయటంలో ఆయన సక్సెస్ అయ్యారు.

దీనికి తోడు భూ కబ్జా ఆరోపణలపై అధికారులు ఇచ్చిన నివేదికను.. అందులోని అంశాలపై హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరుకున పడేలా చేశాయి. ప్రజల్లోనూ.. అయ్యో రాజేందర్ అంతటోడికి ఇలాంటి కష్టమా? అన్న భావన కూడా ఆయనపై చర్యల కత్తిని మరింత నూరకుండా ఆపాయని చెప్పాలి. గులాబీ జెండాతోనే ఈటల గెలిచారన్న టీఆర్ఎస్ నేతల మాటలకు కౌంటర్ ఇచ్చేలా.. హూజూరాబాద్ కు వెళ్లిన వైన కాక పుట్టేలా చేసింది. ఏకంగా ఐదారు వందల వాహనాల కాన్వాయ్ లో వెళ్లిన ఈటలకు ఘన స్వాగతం లభించింది.

అంతేకాదు.. ఈటలకు దన్నుగా నిత్యం పెద్ద ఎత్తున స్థానిక నేతలు వచ్చి.. ఆయనకు అండగా ఉంటామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈటలను పార్టీ నుంచి తప్పించేలా నిర్ణయం తీసుకోకూడదన్న ఆలోచనలోకేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. ఒకవేళ రాజేందర్ తనకు తానుగా పార్టీని వీడితే ఓకే కానీ లేనిపక్షంలో చర్యలు తీసుకోకూడదన్న అభిప్రాయంలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు. ఒక్కసారి పార్టీ నుంచి వేటు వేసి పంపితే.. ఈటలను అడ్డుకోవటం కష్టమవుతుందని.. అందుకే మరింత ముందుకు వెళ్లకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని చెబుతున్నారు.

పార్టీ లైన్ కు భిన్నంగా వ్యవహరించారన్న పేరుతో డీఎస్ మీద వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసి మరీ ఆగిన చందంగా ఈటల విషయంలోనూ కేసీఆర్ అదే వ్యూహాన్ని అమలు చేస్తారని చెబుతున్నారు. గులాబీ బాస్ చేతితో వేటు వేయించుకొని బయటకు వద్దామనుకుంటున్న ఈటల ఆశ అంత త్వరగా నెరవేరదన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.