Begin typing your search above and press return to search.

కృష్ణా నీటి వాటాపై కేసీఆర్ సరికొత్త వాదన.. 66:34 కాదు 50:50 ఇవ్వాలట

By:  Tupaki Desk   |   4 July 2021 4:30 AM GMT
కృష్ణా నీటి వాటాపై కేసీఆర్ సరికొత్త వాదన.. 66:34  కాదు 50:50 ఇవ్వాలట
X
తాను ఏమనుకుంటే అది జరగాలనుకోవటం మంచిదే. కానీ.. అవన్నీ ప్రజలకు మేలు చేసేవిగా ఉండాలి. నా ఇల్లు బాగుంటే చాలు.. పక్కిల్లు ఏమైనాపోయినా నాకు సంబంధం లేదన్న వాదన ఆధునిక యుగంలో ఎవరూ హర్షించరు. అన్నింటికి మించి ఇప్పటికే అమలవుతున్న ఒప్పందాల్ని రాత్రికి రాత్రికి నో చెప్పేయటంలో అర్థం లేదు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదే తీరును ప్రదర్శించారు.

ఇంతకాలం గౌరవించిన ఒప్పందాలకు గుడ్ బై చెప్పేసి.. తాను చెప్పిన కొత్త విధానానికి తగ్గట్లుగా వ్యవహరిచాలంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ఆదేశాల్ని జారీ చేశారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన కృష్ణా జలాల్లో సగం తెలంగాణకు దక్కి తీరాలని కేసీఆర్ తేల్చేసిన వైనం విస్మయానికి గురి చేస్తోంది. ఇప్పటివరకు ఏపీ.. తెలంగాణ మధ్య 66:34 శాతం నిష్పత్తిలో పంపకం జరుగుతున్న వైనానికి చెల్లుచీటి ఇచ్చేసి ఇకపై 50:50 నిష్పత్తిని అమలు చేయాల్సిందేనని తేల్చేశారు.

811 టీఎంసీల నికరజలాల్లో చెరో సగం చొప్పున అంటే 405.5 టీఎంసీలను ఉపయోగించుకోవాలన్న తన నిర్ణయాన్ని ప్రకటించి సంచలనంగా మారారు. కృష్ణా జలాలపై శనివారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనుమతులు లేకున్నా ప్రాజెక్టు పనులు చేపట్టినట్లు తేలితే జైలుకు పంపుతామని ఎన్జీటీ హెచ్చరించినా సర్వేల ముసుగులో ఏపీ మొండిగా పనులు చేస్తోందని ఆక్షేపించిన కేసీఆర్.. ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపడతుందని.. దాన్ని తెలంగాణ గుర్తించదని పేర్కొన్నారు.

ఎత్తిపోతల పథకాల ద్వారానే నేడు తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారిందని.. అందుకే రాబోయే కాలంలో క్రిష్ణా.. గోదావరి నదులపై మరిన్ని ప్రాజెక్టుల్ని నిర్మించుకుంటామని పేర్కొనటం గమనార్హం.ఏపీ ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరం చెబుతున్న జల విద్యుదుత్పత్తిని ఆపేది లేదని తేల్చారు. తెలంగాణలో చేపట్టిన ఎత్తిపోతల ప్రాజెక్టుల నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి అవసరం పెరిగిందని.. జలవిద్యుత్ తో లిఫ్టులను నడుపుతామన్నారు.

సాగునీటితో పాటు.. ఎత్తిపోతలకు అవసరమైన జలవిద్యుత్తును తెలంగాణకు కేటాయించిన నీటి ద్వారానే జరుపుకుంటున్నాం. ఇందులో ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయటానికి వీల్లేదు. ఇదే విషయాన్ని ట్రైబ్యునళ్లు.. కేఆర్ఎంబీ.. కోర్టుల్లోనూ చెబుతామన్నారు. దీనికి వ్యతిరేకంగా ఎవరేం చెప్పినా తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోదని.. తెలంగాణ వ్యవసాయం కోసం.. రైతుల సంక్షేమం కోసం ఎవరితోనైనా.. ఎంతవరకైనా పోరాడతామన్నారు. పొరుగు రాష్ట్రాలకు కేటాయించిన జలాల్ని హక్కుగా ఉపయోగించుకోవటానికి తాము సహకరిస్తామన్నారు. కేటాయింపులు లేని జలాల్ని దౌర్జన్యంగా వాడుకుంటామంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని ఆయన పేర్కొన్నారు.

పోతిరెడ్డిపాడు చట్టవ్యతిరేక.. అక్రమ ప్రాజెక్టుగా వ్యాఖ్యానించిన కేసీఆర్.. పోతిరెడ్డిపాడు కాలువకు నీళ్లు ఎత్తిపోసేందుకు తలపెట్టిన రాయలసీమ ఇరిగేషన్ కూడా అక్రమ ప్రాజెక్టేనని తేల్చారు. ఆ ప్రాజెక్టును తాము గుర్తించమన్నారు. ఈ నెల తొమ్మిదిన జరగాల్సిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని రద్దు చేయాలని.. ఈ నెల 20 తర్వాత పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. అజెండాలో తెలంగాణ రాష్ట్ర అంశాల్ని కూడా చేర్చాలని పేర్కొన్నారు. తెలంగాణకు హక్కుగా కేటాయించిన నీటిని వాడుకుంటుంటే, విద్యుత్‌ ఉత్పత్తి ఆపాలని ఆంధ్రా ప్రభుత్వం కేఆర్ఎంబీకి ఫిర్యాదులు చేయడం సరికాదన్నారు.

శ్రీశైలం డ్యామ్‌ మీద తెలంగాణ భూభాగంలో గుర్తింపు కార్డులు ఉన్న విద్యుత్‌ ఉద్యోగులను తప్ప, వేరెవరినీ అనుమతించవద్దు. కృష్ణా ప్రాజెక్టుల వద్ద రక్షణ చేపట్టాలన్న కేసీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. మరి.. ఈ వ్యాఖ్యలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.