Begin typing your search above and press return to search.

కేసీఆర్ కోసం మ‌రో గెలుపు రెడీ

By:  Tupaki Desk   |   12 Feb 2016 9:25 AM GMT
కేసీఆర్ కోసం మ‌రో గెలుపు రెడీ
X
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీకి కాలం క‌లిసివ‌స్తోంది. వ‌రంగ‌ల్ ఉప ఎన్నిక నుంచి మొద‌లైన జోరు గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌కు తారాస్థాయికి చేరింది. రికార్డు స్థాయి సీట్ల‌ను కైవ‌సం చేసుకున్న గులాబీ పార్టీ అనంత‌రం అదే జోరును కొన‌సాగించింది. ముఖ్య‌మంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఎత్తుల‌తో ప్ర‌తిపక్షాల‌కు చెందిన ఎమ్మెల్యేలు కారు ఎక్కేస్తున్నారు. రేపు జ‌ర‌గ‌బోయే నారాయ‌ణ్‌ ఖేడ్ ఉప ఎన్నిక‌ల్లో కూడా టీఆర్ ఎస్ వైపే ప్ర‌జ‌లు మొగ్గు చూపే అవ‌కాశం ఉంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ఇదిలాఉండ‌గా నారాయ‌ణ్‌ ఖేడ్ ఎన్నిక‌లు ముగిసేలోగానే మ‌రో స్కెచ్‌ తో కేసీఆర్ రెడీగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. గ్రేట‌ర్ వ‌రంగ‌ల్‌ - ఖ‌మ్మం మున్సిప‌ల్ కార్పొరేష‌న్ల‌తో పాటు సిద్ధిపేట‌ - అచ్చంపేట మున్సిపాలిటీల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేలా కేసీఆర్ స్కెచ్ వేస్తున్నారు. ఈ నాలుగు పుర‌పాలిక‌ల‌కు నోటిఫికేష‌న్ ఈనెల 20న జారీ కానున్న‌ట్లు స‌మాచారం. మార్చి5వ తేదీన ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అంటే 15 రోజుల్లోనే ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్తికానుంది. ఈ దిశ‌గా ఉన్న అడ్డంకుల‌న్నింటినీ తొలగించి నోటిఫికేష‌న్‌ ను రంగం సిద్ధం చేస్తున్న‌ట్లు స‌మాచారం.

ఖ‌మ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర అర్‌ అండ్‌బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో హుటాహుటిన స‌మావేశ‌మైన సీఎం కేసీఆర్‌ ఖమ్మం జిల్లా టూర్ షెడ్యూల్ ఖరారు చేసుకోవ‌డం ఇందుకు బ‌లం చేకూర్చుతోంది. ఈనెల 15, 16వ తేదీల్లో కేసీఆర్ ప‌ర్య‌ట‌న ఉండ‌నుంది. 15వ తేదీన ఉదయం ఖమ్మం జిల్లాకు వెళ్ల‌నున్న కేసీఆర్ రోజంతా ఖమ్మం నగరంలో పర్యటించి "మురికివాడలను" సందర్శించనున్నారు. అనంత‌రం సాయంత్రం ఖమ్మం నగర అభివృద్ధిపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. నగర అభివృద్ధి కోసం రూపొందించనున్న ప్రణాళికలపై చర్చిస్తారు. 16న పాలేరు రిజర్వాయర్‌పై రూ.90 కోట్ల వ్యయంతో నిర్మించనున్న భక్త రామదాస్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. అక్కడే ఏర్పాటు చేసే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.

ఇలా బిజీ షెడ్యూల్‌ తో ఖ‌మ్మంలో చుట్టేయ‌డం వెనుక రాబోయే కార్పొరేష‌న్ ఎన్నిక‌లే కారణ‌మ‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు అంటున్నాయి. గ్రేట‌ర్‌ లో కూడా ఇలాగే కేసీఆర్‌ తో పాటు ఆయ‌న కుమారుడు-మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న‌ల‌న్నీ చేసిన త‌ర్వాతే ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న వెలువ‌డింద‌ని గుర్తుచేస్తున్నారు.