Begin typing your search above and press return to search.

హరగోపాల్‌ కేసులపై కేసీఆర్ కీలక నిర్ణయం!

By:  Tupaki Desk   |   17 Jun 2023 6:00 PM GMT
హరగోపాల్‌ కేసులపై కేసీఆర్ కీలక నిర్ణయం!
X
పౌరహక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్‌ పై దేశ ద్రోహం కేసులో సీఎం కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రొఫెసర్ హరగోపాల్‌ పై "ఉపా" (యాంటీ టెర్రర్ యాక్ట్) చట్టం ప్రకారం నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని సీఎం కేసీఆర్ డీజీపీ అంజనీ కుమార్‌ ను ఆదేశించారు. ఏడాది క్రితమే హరగోపాల్‌ తో పాటు మొత్తం 152 మందిపై నమోదైన ఈ కేసులు ఊహించని రీతిలో ఇటీవల వెలుగు చూసిన సంగతి తెలిసిందే.

పీపుల్స్ డెమోక్రటిక్ మూవ్ మెంట్ అధ్యక్షుడు చంద్రమౌళిని రెండు నెలల క్రితం పోలీసులు అరెస్ట్ చెయ్యగా.. ఆయన రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో... ఆయనపై మరిన్ని కేసులు ఉన్న కారణంగా బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు చెప్పారు. అయితే ఈ మిగిలిన కేసుల వివరాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

అవును... చంద్రమౌళి బెయిల్ పిటిషన్ సందర్భంగా విచారణ నడుస్తున్న సమయంలో కోర్టు ఆదేశించిన పిమ్మట... ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్లో గత ఏడాది నమోదైన ఎఫ్.ఐ.ఆర్. వెలుగు చూసింది. అందులో చంద్రమౌళి, హరగోపాల్‌ తో పాటు కొందరు మావోయిస్టులు, వేర్వేరు ప్రజా సంఘాల నాయకుల పేర్లు ఉన్నాయి.

అయితే గత సంవత్సరం తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని బీరెల్లి గ్రామంలో మావోయిస్టు పార్టీ నాయకులు సమావేశమై ఉన్నట్టు తెలిసి కూంబింగ్ జరిపినట్టు పోలీసులు ఈ ఎఫ్.ఐ.ఆర్. లో పేర్కొన్నారు. అయితే ఈ విషయం తెలిసి మావోయిస్టులు తప్పించుకొని వెళ్లిపోయినట్టు పోలీసులు కోర్టుకి తెలిపారు.

అయితే అక్కడ దొరికిన పత్రాల్లో లభించిన ఆధారాల మేరకు మావోయిస్టు పార్టీ నాయకులు పుల్లూరి ప్రసాదరావు, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ పద్మజా షా, విమలక్క, కొయ్యడ సాంబయ్యతో పాటు మొత్తం 152 మందిపై ఐపీసీ 120బీ, 147, 148 సెక్షన్లతో పాటు ఉపా యాక్ట్ సెక్షన్ 10, 13, 18, 20, 38 ప్రకారం కేసులు నమోదు చేసినట్టు కోర్టుకు తెలిపారు.

అయితే తాజాగా పోలీసులు ఈ కేసును బయటపెట్టడంతో ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. హరగోపాల్‌‌ సహా ఇతరులపై వెంటనే కేసును ఉపసంహరించాలని వామపక్ష పార్టీలు కూడా డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల ఒత్తిడి ఫలితంగా సీఎం కేసీఆర్ వెంటనే హరగోపాల్‌ పై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డీజీపీకి ఆదేశించిన‌ట్లు తెలుస్తోంది.