Begin typing your search above and press return to search.

ఊహించని రీతిలో వర్షాల వేళ కేసీఆర్ కష్టపడుతున్నారట

By:  Tupaki Desk   |   17 Aug 2020 3:00 AM GMT
ఊహించని రీతిలో వర్షాల వేళ కేసీఆర్ కష్టపడుతున్నారట
X
గతాన్ని గుర్తు చేసుకుంటే.. సవాళ్లు ఎదురైన వెళ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడో ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆ మాటకు వస్తే.. ఎక్కడో ఉన్నప్పటికీ.. ఆయన సదరు ఇష్యూ గురించి వివరాలు అడిగి తెలుసుకోవటమే కాదు.. ముందుకు వచ్చి.. తానే అన్ని అయి యంత్రాంగాన్ని నడిపించినట్లుగా కనిపించరు. అందుకు భిన్నంగా తాజా ఎపిసోడ్ లో మాత్రం ఆయన స్పందిస్తున్న తీరు రోటీన్ కు భిన్నమన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

గడిచిన మూడు.. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు వరంగల్ తో పాటు.. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు కిందామీదా పడుతున్నాయి. మిగిలిన ఉమ్మడి జిల్లాలతో పోలిస్తే.. వరంగల్ జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది. ముఖ్యంగా వరంగల్ నగరంలో భాగమైన హన్మకొండ ప్రాంతం మొత్తం పూర్తిగా జలమయం కావటమే కాదు.. వేలాది మంది ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. వరంగల్ నగరం ఇప్పుడు నీటి కుండలా మారిందని చెప్పే పరిస్థితి.

ఇప్పటి వరకు జరిగిన నష్టం ఒక ఎత్తు అయితే.. రానున్న మూడు రోజులు వర్షాలు తప్పవని.. దీంతో పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుందన్న అంచనాలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. మొన్నటివరకు సరైన వర్షాలుపడటం లేదని.. కప్పలకు పెళ్లిళ్లు చేసిన వారు.. ఇప్పుడు అవే కప్పల్ని తీసుకొచ్చి విడదీస్తే తప్పించి తాము వర్షం పోటు నుంచి తప్పించుకునే అవకాశం ఉందన్న వ్యాఖ్యలు చేసుకునే పరిస్థితి. మొన్నటి వరకు వర్షాల కోసం తపించిన వారు.. ఇప్పుడు వద్దు మహాప్రభో అంటూ వేడుకునే పరిస్థితి నెలకొంది.

గడిచిన ఆరేళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ కు ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురైంది లేదు. భారీ వర్షాలకు రాష్ట్రం అతలాకుతలం కావటం ఇదే తొలిసారి. ఓవైపు కరోనా.. మరోవైపు భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యే పరిస్థితిని తొలిసారి కేసీఆర్ ఎదుర్కొంటున్నారని చెప్పాలి. ఇప్పటివరకూ ఎప్పుడూ చూడని విధంగా.. తాజా పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రతి మూడు గంటలకు ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షం.. చోటు చేసుకుంటున్న పరిణామాలు.. అందుకు అధికారులు చేస్తున్న చర్యలు లాంటి వివరాల్ని రియల్ టైంలో కనుక్కుంటున్నట్లుగా చెబుతున్నారు. ఎప్పటికప్పుడు అధికారుల్ని అలెర్టు చేయటమే కాదు.. జిల్లాకు చెందిన మంత్రులు.. ఎమ్మెల్యేలు.. కలెక్టర్లతో మాట్లాడి వారికి పలు సూచనలు చేస్తుండటం గమనార్హం.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమేం సాయం కావాలో అడగాలని కోరటమే కాదు.. యుద్ధ ప్రాతిపదికన ఆ ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టంపై మదింపు చేపడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఉపనదుల ద్వారా గోదారిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. ఆదివారం సాయంత్రానికి భద్రచలం వద్ద గోదావరి నీటి మట్టం 55 అడుగులకు చేరుకోవటంతో చివరి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అంతకంతకూ పెరుగుతున్న వరద నీటితో పరిస్థితులు ఎలా మారతాయన్నది అధికారులకు.. ప్రభుత్వానికి పెద్ద టెన్షన్ గా మారింది.