Begin typing your search above and press return to search.

జగన్ అంత అలెర్టుగా ఉంటే.. మీ మాటేంది కేసీఆర్?

By:  Tupaki Desk   |   19 Nov 2020 8:30 AM GMT
జగన్ అంత అలెర్టుగా ఉంటే.. మీ మాటేంది కేసీఆర్?
X
కరోనా భయం ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. అందుకు తగ్గట్లే కేసుల సంఖ్య కూడా తగ్గుతోంది. అలా అని సంబరపడిపోతే.. అంతకు మించిన తప్పు మరొకటి ఉండదు. తగ్గేది పెరిగేందుకే అన్న నానుడి కరోనాకు కరెక్టుగా సరిపోతుంది. కేసులు భారీగా నమోదై.. ఆ తర్వాత నెమ్మదించటం.. కాస్త గ్యాప్ ఇచ్చి.. రెట్టింపు ఉత్సాహంతో విరుచుకుపడటం వైరస్ కు ఉండే సహజ లక్షణం. ఇప్పటికే ఇలాంటి అనుభవంతో అమెరికా.. యూరప్ దేశాలు వణికిపోతున్నాయి. ఫస్ట్ వేవ్ తగ్గిన తర్వాత.. ఆయా దేశాల్లో కరోనాను పట్టించుకోవటం మానేసి ఎంత పెద్ద తప్పు చేశారన్న విషయం ఇప్పుడు అక్కడి పరిస్థితి చూస్తుంటే అర్థం కాక మానదు.

దేశంలోనూ కేరళ.. ఢిల్లీలో సెకండ్ వేవ్ స్టార్ట్ అయిందన్న మాట వినిపిస్తోంది. రానున్న కొద్ది రోజుల్లో సెకండ్ వేవ్ ముప్పు రెండు తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉంది. కేసుల నమోదు తగ్గిపోవటంతో.. రోడ్ల మీదకు వచ్చే వారి సంఖ్య పెరగటమే కాదు.. రోడ్లు మొత్తం కిటకిటలాడుతున్నాయి. సినిమా థియేటర్లు.. మల్టీఫ్లెక్సులు.. షాపింగ్ మాల్స్ లో రద్దీ కనిపించటం లేదు. ఇది మినహా మిగిలిన అన్ని చోట్ల రద్దీ అంతకంతకూ పెరుగుతోంది. ప్రయాణాలు సైతం జోరందుకుంటున్నాయి.

ఇలాంటివేళ.. సెకండ్ వేవ్ ముప్పును ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ప్రజల్ని హెచ్చరించాల్సిన అవసరం పాలకుల మీద ఉంటుంది. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఫుల్ అలెర్టుగా ఉన్నారు. సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని అధికారులకు స్పష్టం చేయటంతోపాటు.. రాష్ట్రాన్ని జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని ఆయన చెబుతున్నారు.

కరోనా కేసుల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో లాక్ డౌన్ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికిప్పుడే కాకున్నా.. రానున్న రెండు.. మూడు వారాల్లో సెకండ్ వేవ్ షురూ అయ్యే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. దీనికి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయం మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దగా పట్టించుకోవటం లేదన్న మాట వినిపిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ మీద తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఎలాంటి పరిణామాలకైనా రాష్ట్రం సిద్ధంగా ఉందన్న విషయాన్ని ఇప్పటివరకు ఎవరూ చెప్పక పోవటం గమనార్హం.

మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం.. అధికారులతో సీరియస్ గా ఈ అంశంపై రివ్యూ చేస్తున్నారు. ఏమేం జాగ్రత్తలు తీసుకుంటున్నారో అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతానికి కేసుల నమోదు తగ్గినా.. సెకండ్ వేవ్ వస్తుంది కాబట్టి.. కలెక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. యూరప్ మొత్తం సెకండ్ వేవ్ తో వణుకుతోందని.. అమెరికా కూడా ఇబ్బందులకు గురవుతున్న వైనాన్ని గుర్తుచేస్తున్నారు.

ఏపీలో 104కుఫోన్ చేసిన అరగంటకు కోవిడ్ పేషెంట్లకు బెడ్ కేటాయించేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇదంతా చూసినప్పుడు సెకండ్ వేవ్ మీద సీఎంజగన్ పెడుతున్న ఫోకస్.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు. లేదంటే.. అందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదన్న మాట వినిపిస్తోంది.